Lorry Owners Problems in AP due to Tax Burden: రాష్ట్రంలో పేదలకు పెత్తందారులకు యుద్ధం జరుగుతోందని, తాను పేదల పక్షపాతినని జగన్ పదే పదే చెబుతారు. కానీ జగన్ మాత్రం పేదలపైనే యుద్ధం చేస్తున్నారు. సరకు రవాణా రంగమే దానికి నిదర్శనం. కొవిడ్‌తో నష్టపోయిన రవాణా రంగాన్ని గట్టెక్కించాల్సింది పోయి, పన్నుల పేరిట మోయలేని భారంతో ప్రభుత్వం చావుదెబ్బ కొట్టింది. త్రైమాసిక పన్నులు 30 శాతం, హరిత పన్నును ఏకంగా 134 రెట్లు పెంచారు.
సరకు రవాణా లారీలు నడిపితే నడపండి, లేదంటే మానేయండి అన్నట్లు వ్యవహరిస్తోంది. దీంతో రాష్ట్రంలో ఉన్న 4 లక్షల 50 వేల సరకు రవాణా వాహనాల్లో అధికశాతం మంది యజమానులు ఈ రంగాన్ని వదిలేసే పరిస్థితికి వచ్చారు. కొత్తవాళ్లయితే కనీసం ఇటువైపు చూసే సాహసం చేయట్లేదు. డీజిల్ ధరలు మన రాష్ట్రంతో పోలిస్తే కర్ణాటకలో 11 రూపాయలు, తమిళనాడులో 5 రూపాయలు, ఒడిశాలో 3 రూపాయలు తక్కువగా ఉంది. అదనపు పన్నులతో పాటు అధిక డీజిల్ ధరలు లారీ యజమానులకు భారంగా మారాయి. ఫలితంగా ఆ ప్రభావం నిత్యావసర, తదితర సరుకులపైన పడుతూ ప్రజలను ఆర్థికంగా మరింత సంక్షోభంలోకి నెట్టేస్తోంది.
సరకు రవాణా వాహనదారులు 3 నెలలకోసారి పన్ను చెల్లించాలి. చాలాకాలంగా అమల్లో ఉన్న త్రైమాసిక పన్నును వైసీపీ సర్కార్ 20 నుంచి 30 శాతం పెంచేసింది. గతేడాది జనవరిలో త్రైమాసిక పన్ను పెంపునకు వీలుగా ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. కానీ ఇప్పటికే నష్టాల్లో ఉన్నామని ఇలాంటి పరిస్థితుల్లో పన్నుల పెంపు సరికాదంటూ లారీల యజమానుల సంఘాల నేతలు సర్కారుకు విన్నవించారు.
అయినా సరే ప్రభుత్వం ఏ మాత్రం కనికరించలేదు. మే నుంచి త్రైమాసిక పన్ను పెంపును అమల్లోకి తీసుకొచ్చింది. 6 టైర్ల లారీకి గతంలో 3 వేల 9వందల 40 ఉన్న పన్నును 4 వేల 9వందల 70కి, 10 టైర్ల లారీకి 6 వేల 5 వందల 80 రూపాయల నుంచి 8 వేల 3 వందల 90కి, 12 టైర్ల లారీకి 8 వేల 5 వందల 20 రూపాయల నుంచి 10 వేల 9 వందల 10 రూపాయల కి, 14 టైర్ల లారీకి 10 వేల 4 వందల 80 రూపాయల నుంచి 13 వేల 4 వందల 30 రూపాయలకి పెంచింది. ఇలా ఏటా 200 కోట్ల మేర భారం వేసింది.
ఏడేళ్లు దాటిన వాహనాలకు ఏటా ఫిట్‌నెస్ సర్టిఫికేట్ పొందే సమయంలో హరిత పన్ను కింద గతంలో 200 రూపాయల రుసుము విధించేవారు. కాలం చెల్లిన వెహికల్స్ సంఖ్యను తగ్గించే ఆలోచనతో హరిత పన్ను పెంచేలా కేంద్రం ఇటీవల వీలు కల్పించింది. దీనినే అవకాశంగా తీసుకుని జగన్ సర్కార్ ఇష్టానుసారంగా ధరలను పెంచేసింది. ఏడేళ్లు దాటిన వాహనాలను మూడు రకాలుగా విభజించి హరిత పన్ను విధించింది.
Lorry Owners Association Demand: 'రాష్ట్రంలో పన్నులు ఎక్కువ.. సంక్షోభంలో రవాణా రంగం'
7 నుంచి 10 ఏళ్ల మధ్య వాహనాలకు ఓ త్రైమాసిక పన్ను విలువలో సగం చెల్లించాలి. అంటే లారీని బట్టి 2 వేల 4 వందల 85 నుంచి 6 వేల 7 వందల 15 వరకు చెల్లించాల్సి ఉంటోంది. 10 నుంచి 12 ఏళ్ల మధ్య వాహనాలకు ఓ త్రైమాసిక పన్ను విలువ మేర కట్టాలి. అంటే 4 వేల 9 వందల 70 నుంచి 13 వేల 4 వందల 30 వరకు కట్టాల్సి ఉంది. 12 సంవత్సరాలకు పైబడిన వాహనాలకు రెండు త్రైమాసిక పన్నుల విలువ మేర హరిత పన్నుగా వేశారు. అంటే 9 వేల 9వందల 40 నుంచి 26 వేల 8 వందల 60 మేర చెల్లించాల్సి వస్తోంది.
పొరుగు రాష్ట్రాలు అలా: సరకు రవాణా వాహనాలకు హరిత పన్ను కర్ణాటకలో ఏడాదికి 200 రూపాయలు, తమిళనాడులో 500 రూపాయలు మాత్రమే అక్కడి ప్రభుత్వాలు వసూలు చేస్తున్నాయి. ఏపీలో మాదిరిగా తెలంగాణలో గతంలో మూడు స్లాబ్లలో హరిత పన్ను పెంచి వసూలు చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. కానీ లారీ యజమానుల సంఘం విజ్ఞప్తితో అక్కడి ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది. 7 నుంచి 12 ఏళ్ల మధ్య వాహనాలకు 15 వందల రూపాయలు, 12 ఏళ్లు దాటిన వాటికి 3 వేల రూపాయలుగా సవరించింది. ఏపీలో జగన్ మాత్రం ఉపశమనాలు ఊసెత్తడం లేదు.
రాష్ట్రంలో ప్రస్తుతం సరకు రవాణా వాహనాలకు అమలు చేస్తున్న వివిధ పన్నులు, బీమా, మిగిలినవన్నీ కలిపి ఓ లారీ యజమాని ఏటా లక్ష రూపాయలకు పైనే వెచ్చించాల్సి వస్తోంది. 12 ఏళ్లు దాటిన 14 టైర్ల లారీ ఉన్న యజమాని త్రైమాసిక పన్నుల కింద ఏడాదికి 53 వేల రూపాయలు, హరిత పన్ను కింద 26 వేల 800 రూపాయలు, నేషనల్ పర్మిట్ రుసుము 17 వేల రూపాయలు, థర్డ్ పార్టీ బీమా 50 వేలు కలిపి మొత్తం లక్షా 46 వేలు ఖర్చు చేయాల్సి వస్తుంది.