Nara Lokesh Met Governor: భారతదేశానికి డ్రగ్స్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ మారుతోందంటూ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఫిర్యాదు చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన లోకేశ్.. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) నివేదిక ప్రకారం 2021-22సంవత్సరంలో డ్రగ్స్ సరఫరాలో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉందనే వివరాలను ఆధారాలతో సహా ఆయనకు అందజేశారు. జాతీయ భద్రతకు ముప్పు తెచ్చేలా రాష్ట్రంలో జరుగుతున్న హవాలా లావాదేవీలు ఆర్థిక వ్యవస్థపైనా ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని నివేదించారు. యువత ద్వారా సమాజాన్ని నాశనం చేసే చర్యలను నివారించి సమగ్ర విచారణ ద్వారా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.
Lokesh on Drugs in AP: గవర్నర్‌ను కలిసిన అనంతరం లోకేశ్ మీడియాతో మాట్లాడారు. వైసీపీ నేతల ప్రమేయంతోనే రాష్ట్రంలో మాదకద్రవ్యాల సరఫరా జరుగుతోందని.. అందుకే డ్రగ్స్ నియంత్రణపై ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదని ఆరోపించారు. డ్రగ్స్ ఉత్పత్తి లేదా స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన వారిలో అనేక మంది వైసీపీ నేతలే ఉండటం యాదృచ్ఛికం కాదని స్పష్టం చేశారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా కొండపైనా డ్రగ్స్ అక్రమ రవాణా జరగటం కలవరపెడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
Lokesh Met Governor on Drugs in AP: డీఆర్ఐ నివేదిక ప్రకారం 2021-22లో ఏపీలోనే 18వేల 267.84 కేజీల మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయని నివేదించారు. కందుకూరు, అనకాపల్లి ప్రాంతాల్లోని పాఠశాల విద్యార్థులు సైతం మాదకద్రవ్యాల బారిన పడిన ఉదంతాలు వెలుగు చూశాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ ప్రేరిత నేరాల రేటు ఎక్కువగా ఉందని గవర్నర్‌కు వెల్లడించారు. గత నాలుగేళ్లలో యువత.. మత్తులో మహిళలను వేధించడం, దాడులు చేయడం వంటి ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయని వివరించారు.
మైనర్లు సైతం హంతకులుగా మారిన ఘటనలను గవర్నర్‌కు ఉదహరించారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మాదకద్రవ్యాలు అన్ని వయసుల వారికి అందుబాటులో ఉండటం దురదృష్టకర పరిణామం అని తెలిపారు. పాఠశాలలు, కళాశాలలు అనే తేడా లేకుండా విద్యార్థులపై ఈ మహమ్మారి తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2021 సెప్టెంబర్ 19న ముంద్రా పోర్టులో పట్టుబడిన రూ.9వేల కోట్ల విలువ చేసే మాదకద్రవ్యాల మూలం విజయవాడ, కాకినాడలుగా తేలిందని గుర్తు చేశారు.
Lokesh Fires on CM Jagan: కాకినాడ కేంద్రంగా బియ్యం ఎగుమతి చేసే కంపెనీని రిజిస్టర్ చేసి మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు డీఆర్ఐ నిర్థారించిన వైనాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో పట్టుబడిన మాదకద్రవ్యాల మూలం ఏపీనే అని ఆయా రాష్ట్ర పోలీసులు బహిర్గతం చేసిన వివరాలను జస్టిస్ నజీర్‌కు వివరించారు. యువగళం పాదయాత్రలో డ్రగ్స్ వల్ల తమ పిల్లల జీవితాలు నాశనమవుతున్నాయని వారి తల్లిదండ్రులు తన దృష్టికి తీసుకొచ్చారని లోకేశ్ తెలిపారు. లోకేశ్‌తో పాటు తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు షరీఫ్, నక్కా ఆనంద్ బాబు, కొల్లు రవీంద్రలు ఉన్నారు.
గంజాయి క్యాపిటల్‌గా ఏపీ: చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జాబ్ క్యాపిటల్‌గా ఉండే ఏపీ.. ఇప్పుడు డ్రగ్ క్యాపిటల్‌గా మారిందని లోకేశ్ ఆరోపించారు. గుడి, బడి అనే తేడా లేకుండా రాష్ట్రంలో గంజాయి దొరుకుతోందని.. గంజాయ్‌కి బలైన తన కూతురు గురించి పాదయాత్రలో ఓ తల్లి చెప్పుకున్న ఆవేదనతోనే గంజాయిపై యుద్ధం ప్రకటించామన్నారు. ముఖ్యమంత్రి ఇంటి పక్కనే గంజాయ్ దొరుకుతోందని.. సీఎం ఇంటి సమీపంలో మహిళలకే రక్షణ లేదన్నారు. ఇది ఒక్క రాష్ట్ర సమస్య మాత్రమే కాదని.. దేశ భద్రతకు ముప్పు వాటిల్లే సమస్య ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇంత గంజాయి ఎందుకు దొరుకుతోందని సీఎం ఒక్కసారైనా డీజీపీ ని పిలిచి ఆడిగారా ? అని ప్రశ్నించారు. తన పాదయాత్రకు అడుగడుగునా ఇబ్బందులు సృష్టించటం సరికాదని.. పాదయాత్రకు తగిన భద్రత కల్పించాలని కూడా గవర్నర్‌ని కోరినట్లు లోకేశ్ తెలిపారు.
Lokesh Comments on Volunteers: వాలంటీర్ల వ్యవస్థ రాజ్యాంగేతర శక్తిగా మారకూడదన్నది తెలుగుదేశం విధానమని లోకేశ్ అన్నారు. వాలంటీర్లను పార్టీ కార్యకర్తల్లా రాజకీయ అవసరాలకు వాడుకోవటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. చంద్రగిరిలో వాలంటీర్ల ద్వారా డేటా సేకరణ ఉదంతం వెలుగు చూసిందని.. వాలంటీర్లయినా, మరెవరైనా రాజ్యాంగం లోబడి పనిచేయాల్సిందేనన్నారు. ప్రభుత్వం వద్ద సమగ్ర సమాచారం ఉండగా, వాలంటీర్ల ద్వారా మళ్లీ సమాచార సేకరణ దేనికి అని ప్రశ్నించారు.