ఇన్నాళ్లూ తిండి పెట్టిన నగరాలు కష్టం రాగానే వారిని వదిలేశాయి. భరోసా ఇవ్వాల్సిన వారు అండగా నిలవలేదు. పనులు లేవు.. తిండీ తిప్పల సంగతి పక్కనపెడితే... చంటి పిల్లలను పోషించలేని దిక్కుతోచని స్థితి వారిది. ఉన్న ఊరు కాదంది. కన్న ఊరికి వెళ్లిపోదామనుకుంటే అవకాశాలు లేవు. ఇక కాళ్లను నమ్ముకుని.... వేల కిలోమీటర్ల నడకకు సిద్ధమయ్యారు. ఒకరు కాదు ఇద్దరు కాదు కొన్ని వేల మంది. ఏ ప్రధాన రహదారిపై చూసినా.... పిల్లా జల్లాతో తరలివెళ్తున్న వలస కార్మికుల వేదనే దర్శనమిస్తోంది. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై కాజా టోల్‌గేట్ వద్దకు చేరుకున్న వలస కూలీలను ఈటీవీ భారత్ -ఈనాడు బృందం పలకరించగా వారి గోడు వెళ్లబోసుకున్నారు..
ప్రాణాలు కడగట్టుకుపోతున్నా బతుకుపై ఆశతో తరలి వెళుతున్న వలస కార్మికుల దయనీయ పరిస్థితిని ‘ఈనాడు-ఈటీవీ భారత్’ ప్రతినిధులు పరిశీలించారు. కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారిపై గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని కాజ టోల్ గేట్ వద్ద... 24 గంటల పాటు ఆ మార్గంలో వెళ్లిన వలస కార్మికులను పలకరించారు. 24 గంటల వ్యవధిలో సుమారు 1100 మందికిపైగా వలస కార్మికులు వెళ్లారు. లారీ డ్రైవర్లను బతిమాలుకుని, వాటిలో ఎక్కి వెళ్లినవారు దీనికి అదనం. ఇలా తరలిపోతున్నవారిలో 80 శాతంపైగా కాలి నడకనే వెళుతున్నారు. ఈ మహా ప్రస్థానం ఎప్పటికి ముగుస్తుందో తెలీక ముందుకి సాగుతూనే ఉన్నారు.
ఉత్తరప్రదేశ్. బిహార్, ఝార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు... చెన్నై, బెంగళూరు సహా రాష్ట్రంలని పలు జిల్లాల్లో వివిధ పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచి తిండీ తిప్పలు లేక అవస్థలు పడుతున్నారు. వ్యవస్థలపై నమ్మ కం కోల్పోవడమే... సొంతూళ్లకు వెళ్లిపోవడానికి ప్రధాన కారణమని వీరంతా నిరాశ చేస్తున్నారు. కష్టకాలంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు, యజమానులు మొండిచేయి చూపించారంటున్నారు. ఇంటి యజమానులు మానవత్వం చూపలేదని ఆవేదన చెందుతున్నారు. ఇక పనులు దొరుకుతాయో లేదోనన్న విశ్వాసం కూకడా లేకపోవడంతో ఊళ్లకు పయనమయ్యారు.
ప్రత్యేక రైళ్లు వేసినా నిబంధనల వల్ల తమకు అవకాశాలు దూరమయ్యాయని కార్మికులు వాపోతున్నారు. కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరిగి దరఖాస్తులు చేసినా రైలు ప్రయాణానికి నోచుకోలేదంటున్నారు. మండుటెండల్లోనే నడిచి వెళ్తున్నామని వేదన చెందుతున్నారు. కొంత మంది యువత ఏదోవిధంగా సైకిళ్లు ఏర్పాటు చేసుకుని... వాటి ద్వారానే సొంత ఊళ్లకు వెళ్తున్నారు. కొంత మంది సొంత సైకిళ్లు తీసుకెళ్తున్నారు. మరికొందరు ఇళ్ల నుంచి డబ్బు పంపితే.. వాటితో సైకిళ్లు కొని తొక్కుకుంటూ వెళ్తున్నారు. వీటి వల్ల.. రోజుకు సుమారు 70-80కిలోమీటర్ల దూరం వెళ్లగలుగుతున్నామని చెబుతున్నారు.
ఇవీ చదవండి