గుంటూరు జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న తెనాలి డివిజన్‌లోని గ్రామ పంచాయతీలకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఆదివారం ముగిసింది. సింహభాగం గ్రామాల్లో పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేయడంతో పల్లెపోరు ఆసక్తికరంగా మారింది. అధికార పార్టీలోనే కొందరు రెబల్స్ బరిలోకి దిగడంతో ఆ పార్టీ నియోజకవర్గ నేతలు రంగంలోకి దిగి చక్కదిద్దే ప్రయత్నాలు ప్రారంభించారు. గ్రామాల వారీగా నామినేషన్లు వేసిన అభ్యర్థుల వివరాలు తెప్పించుకుంటున్న నాయకులు ప్రత్యర్థి పార్టీల నేతలు బలహీనంగా ఉన్నచోట వారిని తమవైపు తిప్పుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.
కొన్ని గ్రామాల్లో సింగిల్ నామినేషన్ మాత్రమే వేస్తారని భావించినా చివరిక్షణంలో పోటీ నామినేషన్లు దాఖలు కావడం నేతలకు తలనొప్పిగా మారింది. సొంత పార్టీలో రెబల్స్ నామినేషన్లు వేస్తున్నారని సమాచారం రాగానే వారికి సర్దిచెప్పి నిలువరించారు. కీలకమైన గ్రామాల్లో సర్పంచి అభ్యర్థిత్వంపై కొలిక్కి రాకపోవడంతో రెబల్స్ బరిలోకి దిగారు. మండల కేంద్రమైన కొల్లిపరలో అధికార పార్టీ నుంచి ఇద్దరు అభ్యర్థులు బరిలోకి దిగారు. ప్రతిపక్ష పార్టీ నుంచి ఒకరు నామినేషన్ వేయడంతో ఇక్కడ త్రిముఖపోరు ఉంటుందని భావిస్తున్నారు. ఎమ్మెల్యేల నుంచి అభ్యర్థులకు ఒత్తిడి వస్తుండడంతో చరవాణికి సైతం అందుబాటులో ఉండకుండాపోయారు. రెబల్స్ నామినేషన్‌లను ఉపసంహించుకునేలా నేతలు తాయిలాలు ఆశచూపి మంత్రాంగం చేస్తున్నారు.
ఇదీ చదవండి: