Jada Sravan Kumar Demands: రాజధాని ప్రాంతంలో వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న సెంటు భూమి స్థలాల అంశాన్ని న్యాయస్థానంలో సవాలు చేస్తామని ప్రముఖ న్యాయవాది, జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ చెప్పారు. గుంటూరు జిల్లాలోని తుళ్లూరులో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసేందుకు దీక్ష శిబిరానికి వచ్చిన శ్రవణ్‌ను, దళిత బహుజన ఐకాస కన్వీనర్ బసవయ్యను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. రాజధానిలో పేదలు తినే అన్నం ప్లేటును ముఖ్యమంత్రి లాక్కొని మరో పేదవాడికి ఇవ్వడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. న్యాయస్థానం అనుమతితో రాజధానిలో త్వరలోనే పాదయాత్ర చేస్తానన్నారు. జై భీమ్ భారత్ పార్టీ తరఫున రాజధాని రైతులకు అండగా ఉంటామని శ్రవణ్ చెప్పారు.
34వేల 774 ఎకరాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రైతులు సుమారు 14వేల నుంచి 16వేల ఎకరాల్లో అర ఎకరం, పావు ఎకరం ఇచ్చిన వాళ్లు ఉన్నారని తెలిపారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రాజధానిని చంపేయాలనే ప్రయత్నంలో, అలాగే రాజకీయ పరమైనటువంటి తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టలానే ప్రయత్నంలో ఉందని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాలు ఉంటే పార్టీలతో చూసుకోవాలి తప్ప.. పావు ఎకరం, అర ఎకరం ఉన్న దళిత రైతులు, ముస్లీం రైతుల జీవితాలతో చెలగాటమాడటం అత్యంత దుర్మార్గకరమైన అంశం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేదలుగా ఉన్నటువంటి వ్యక్తులు భూములు ఇస్తే.. ఆ భూముల్ని ఈరోజు నిరుపయోగంగా చేసి.. భవిష్యత్తుకు 5లక్షల కోట్ల రూపాయల సంపదను ఆవిరి చేసిన ముందు చూపు లేని ఈ ప్రభుత్వాన్ని నిరసిస్తున్నామని తెలిపారు.
ఓ పేదవాడి భుజం మీద తుపాకీ పెట్టి మరో పేద వాడిని కాల్చాలనే ప్రయత్నాన్ని నిరసిస్తున్నామని స్పష్టం చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేయాలని జై భీమ్ భారత్ పార్టీ పిలుపునిచ్చిందని తెలిపారు. తమ హక్కుల్ని కాలరాయడానికి ముఖ్యమంత్రి గానీ, ప్రధాన మంత్రికి గానీ, పోలీసులకు ఎటువంటి హక్కు లేదన్నారు. ఈరోజు అమరావతి దళిత రైతులకు జరుగుతున్న అన్యాయాలను నిరసిస్తూ అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేయాలని, తుళ్లూరు దీక్ష శిబిరంలో రైతులతో కలిసి దీక్ష చేయాలని పూనుకున్నామని.. అయితే దానిని పోలీసులు ఆపి ఓ వ్యక్తి ప్రజాస్వామ్య హక్కును, పార్టీ ప్రజాస్వామ్య హక్కను కాలరాసే విధానాన్ని ఖండిస్తున్నామని తెలిపారు.
న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాం: రాజధాని కోసం ఇచ్చిన తమ భూములను అభివృద్ధి చేయాలని దళిత ఐకాస నేత బసవయ్య డిమాండ్ చేశారు. వెయ్యి మంది పోలీసులతో అక్రమంగా, అన్యాయంగా దీక్ష చేస్తున్న తమను అరెస్టు చేశారని మండిపడ్డారు. పొలాలు ఇచ్చిన తమకు ఇళ్లు కట్టుకునే అర్హత లేదని.. కేవలం జగన్‌కు ఓటు బ్యాంకుగా ఉపయోగపడే వారికి హక్కు ఉందని చెప్తున్నారని.. అది ఎంత వరకూ న్యాయం అని ప్రశ్నించారు. ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆర్5 జోన్‌పై తెచ్చిన జీవోను కొట్టివేసే దాకా ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: