Lack Of Facilities for 10th Class Examination Centers : ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు పదో పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలకు గుంటూరు జిల్లావ్యాప్తంగా 138 కేంద్రాలను సిద్ధం చేస్తుండగా.. 27 వేల 7 వందల 14 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఒక్కో కేంద్రంలో సుమారు 200 నుంచి 500 మంది వరకు విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అంతమందికి సరిపడా బెంచీలు అన్ని పాఠశాలల్లో లేవని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో నాబార్డు ద్వారా సుమారు 200కి పైగా పాఠశాలలు నిర్మించారు.
నాబార్డు కాంపొనెంట్‌లో బెంచీలకు ప్రత్యేకించి నిధులు కేటాయించలేదు. నిర్మాణాలకు పోను ఏమైనా నిధులు మిగిలితే వాటితో ఫర్నిచర్ కొనుగోలు చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలున్న చోట్ల సరిపడా బెంచీలను సమకూర్చుకునేందుకు నిధులు ఎలా అని ప్రధానోపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో సుమారు 320కు పైగా పాఠశాలల్లో ఫర్నిచర్ లేదని వారు గుర్తు చేస్తున్నారు.
పరీక్ష కేంద్రాల్లో ఏమైనా అసౌకర్యాలున్నాయా అనే విషయమై నెలరోజుల ముందే జిల్లా, మండల స్థాయి అధికారులు సంయుక్తంగా పరీక్షా కేంద్రాలను పరిశీలించాలి. ప్రధానోపాధ్యాయులతో సమావేశమై ఎన్ని బెంచీలు అవసరమో నివేదిక తీసుకోవాలి. జిల్లా విద్యా శాఖ కమిషనర్‌కు సంబంధిత ప్రతిపాదనలు పంపి ఫర్నిచర్ ఏర్పాటుకు నిధులను కోరాలి. ఈ ప్రక్రియ సక్రమంగా అమలు కావడం లేదు. పాఠశాల గ్రాంటు నుంచి నిధుల్ని వాడుకోవాలని సూచించి.. అధికారులు మిన్నకుండి పోతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం విద్యా సంవత్సరంలో పాఠశాల నిర్వహణ గ్రాంటు నిధులు 20 శాతం పాఠశాలలకు మాత్రమే వచ్చాయి. మిగిలిన పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు తమ జేబుల్లోంచి నిధులు వెచ్చిస్తే మినహా ఫర్నిచర్ సమకూర్చలేని పరిస్థితి నెలకొంది. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు తప్పనిసరిగా బెంచీలు ఏర్పాటు చేయాలని.. ఎక్కడైనా కింద కూర్చోబెట్టారని తెలిస్తే సంబంధిత ప్రధానోధ్యాయులపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు అధికారుల వైఖరిపై విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నాయి. ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలు మాని సంబంధిత ఫర్నిచర్‌ను సమకూర్చాలని డిమాండ్ చేస్తున్నారు.
"ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తానని చెప్పారు. ప్రైవేటు స్కూల్స్‌తో పోటీపడి ప్రభుత్వం పాఠశాలలో అన్ని సౌకర్యాలను కల్పిస్తామని.. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించమని విద్యార్థుల తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత 'నాడు నేడు' అనే పేరుతో కేవలం కొన్ని పాఠశాలలను మాత్రమే ఆయన అభివృద్ధి చేస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో బెంచ్‌లు లేక కొంత బాలికలను కూడా బయటకూర్చోపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది." - నాసర్ జీ, ఏఐఎస్ఎఫ్ , రాష్ట్ర ఉపాధ్యక్షుడు
విద్యాశాఖకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం.. తక్షణమే పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనను చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘ నాయకులు కోరుతున్నారు. పదో తరగతి పరీక్షలు ముంచుకొస్తున్న తరుణంలో త్వరితగతిన ఫర్నిఛర్ ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాల నాయకులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: