కృష్ణానదీ పరివాహక ప్రాంతం అధికార యంత్రాంగాన్ని గుంటూరు జిల్లా పాలనాధికారి శామ్యూల్ ఆనంద్ కుమార్ అప్రమత్తం చేశారు. టెలీకాన్ఫరెన్స్ ద్వారా లంక ప్రాంతాలలో పరిస్థితులను సమీక్షించారు. జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నందున... నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి వరద నీరు దిగువకు అధిక మొత్తంలో విడుదల చేస్తున్నారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంత ప్రజలు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పులిచింతల జలాశయం నుంచి 7 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరనున్న నేపథ్యంలో... పరిసర ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
కంట్రోల్ రూమ్లు ఏర్పాటు..
కృష్ణానదికి వరద పోటెత్తటంతో కరకట్ట వెంట ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. వరద ఉద్ధృతి అంతకంతకు పెరుగుతుండటంతో ప్రజలు పశువుల మేతకు బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. పెదకొండూరు, గొడవర్రు, వీర్లపాలెం ప్రాంతాల్లోని పొలాలు నీట మునిగాయి. నదీ పరివాహక ప్రాంత, వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు సహాయం అందించేందుకు జిల్లాలో కలక్టరేట్ కార్యాలయంతోపాటు డివిజన్ కార్యాలయాల్లోనూ కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు.