Tomato Prices are Falling Day by Day in Telangana : టమాటా ధరలు రోజురోజుకు పతనమవుతున్నాయి. పది రోజుల క్రితం కిలో రూ.50 పలికిన టమాటా ఒక్కసారిగా పడిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో టమాటా కేవలం రూ.10లకే విక్రయిస్తున్నారు. ఇటీవల కాలంలో మరీ ఈ స్థాయిలో టమాటా రేట్లు ఎప్పుడూ పడిపోలేదు. ఆరుగాలం శ్రమించి, వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పండించిన పంట చివరకు మార్కెట్‌కు తీసుకొచ్చేసరికి ధరలు పడిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
కొద్దిరోజుల క్రితం కిలో టమాటా రూ.80 నుంచి రూ.100లతో బెంబేలెత్తించాయి. గత పదిరోజుల వరకూ రూ.50 పలికిన ధర ఇప్పుడు ఒక్కసారిగా పడిపోయింది. నాణ్యమైన టమాటా సైతం 25 కిలోల ట్రేను కేవలం రూ.200లకే విక్రయిస్తున్నారు. రైతు బజార్లలో కిలో టమాటాను రూ.10లకు అమ్ముతున్నారు. అలాగే ఒకేసారి 3 కిలోలు కొంటే రూ.20లకే అమ్ముతున్నారు. కనీసం కేజీ రూ.20 ఉంటే తప్ప తమకు పెట్టిన పెట్టుబడి కూడా రాదని అన్నదాతలు వాపోతున్నారు.
కిలో టమాట రూపాయి కంటే తక్కువా? - రహదారిపై రైతుల ఆందోళన
పంట పండించిన గ్రామాల నుంచి సరుకు రైతు బజార్‌కు రావాలంటే ఆటో ఖర్చు ఒక్కో ట్రేకు రూ.50, అలాగే హమాలీ కూలీ రూ.10 కలిపితే మొత్తం 60 రుపాయలు అవుతోంది. చివరికి సరుకు విక్రయించగా వచ్చిన డబ్బులు కూలీ, హమాలీ, రవాణా ఖర్చులకే సరిపోతుందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. వివిధ రాష్ట్రాలతో పాటు స్థానికంగా పండించిన టమాటా పంట ఎక్కువ మొత్తంలో మార్కెట్‌కు వస్తుండటంతో ధరలు ఒక్కసారిగా పడిపోతున్నాయి.
దాదాపు కోటిన్నర జనాభా ఉన్న భాగ్యనగరంలో టమాటాకు భారీ డిమాండ్ ఉంటుంది. మార్కెట్‌కు తెలంగాణ రాష్ట్రంలో పండించిన పంటతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుంచి టమాటా భారీగా వస్తోంది. దీన్ని సాకుగా చూపి దళారులు రైతులకు గిట్టుబాటు ధరలు అందకుండా నిలువు దోపిడీ చేస్తున్నారని వినియోగదారులు చెబుతున్నారు.
ఒకప్పుడు ఎర్రపండు రేంజే వేరు - కానీ ఇప్పుడు రైతన్నలకు కన్నీళ్లే!
ఒక్కసారిగా ధరల హెచ్చుతగ్గుల సమయంలో సరకును శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో టమాటా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి మార్కెటింగ్ చేస్తే అన్నదాతలకు భరోసా కలుగుతుందని వివరించారు. దీంతో స్వయం సహాయ సంఘాల మహిళలకు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు విస్తృతం చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
వింటర్ స్పెషల్ - రెస్టారెంట్ స్టైల్ "టమాటా సూప్"- ఇలా చేస్తే టేస్ట్ అద్భుతం!