Kanuma Festival Celebrations in AP: రాష్ట్రంలో కన్నుల పండువగా కనుమ వేడుకలు జరిగాయి. తెలుగువారి అతిపెద్ద పండుగైన సంక్రాంతిని ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. వేడుకల్లో చివర రోజైన కనుమ రోజున పశువులను పూజించుకున్నారు. చాలా చోట్ల ఎద్దుల బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. జాతరల్లో భారీ సంఖ్యలో జనం పాల్గొని స్వామివార్లకు మొక్కులు తీర్చుకున్నారు.
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో సంగమేశ్వర దేవాలయం కొండ సమీపంలో ఘనంగా జాతర జరిగింది. భారీ సంఖ్యలో భక్తులు జాతరలో పాల్గొని స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో దేవాదాయ శాఖ, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గోమాత పూజలు వైభవంగా జరిగాయి.
విశాఖ బీచ్‌లో కనుమ పండగ సందర్భంగా పతంగుల ఎగురవేసి సందడి చేశారు. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం అన్నవరప్పాడులో పాడి పశువులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ కనుమ వేడుకను ఘనంగా నిర్వహించుకున్నారు.
కన్నులపండవగా కోనసీమ ప్రభలతీర్థాలు - భారీగా తరలివచ్చిన భక్తజనం
బాపట్ల జిల్లా పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెంలో జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఒంగోలు రంగరాయుడు చెరువు వద్ద శ్రీప్రసన్న చెన్నకేశవస్వామి వారి తెప్పోత్సవం వైభవంగా జరిగింది. పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో తెలుగుదేశం ఆధ్వర్యంలో ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిర్వహించారు. రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఈ పోటీలను చూసేందుకు చిన్నారులు, యువత, పెద్దలు తరలివచ్చారు. ఎద్దుల పోటీలు ఉత్సహంతో కేరింతల నడుమ కొనసాగాయి. పోటీలను చూసేందుకు వచ్చిన వీక్షకులు సంతోషం వ్యక్తం చేశారు.
సంక్రాంతి ఉత్సవాలు - రిక్షావాలాగా మారిన బీజేపీ ఎంపీ జీవీఎల్
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి పులిపార్వేట ఉత్సవం ఘనంగా జరిగింది. కనుమ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నమయ్య జిల్లా పీలేరులో గోమాత పూజలు ఘనంగా జరుపుకున్నారు. బెలూన్లతో పశువులను అలంకరించి చిట్లాకుప్ప వద్దకు తీసుకువచ్చారు. కాటమరాజుకు పూజలు నిర్వహించిన చిట్లకు, నిప్పు అంటించి మొక్కులు తీర్చుకున్నారు. రాయచోటిలో చిట్లకు నిప్పంటించి పశువులను బెదిరించే కార్యక్రమానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు.
తిరుపతి జిల్లా వెంకటగిరిలోని కుమ్మరిగుంట పుష్కరిణిలో సాయిబాబా తెప్పోత్సవం ఘనంగా జరిగింది. జాతరలో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నాయుడుపేట స్వర్ణముఖి నదిలో సంక్రాంతి సంబరాలు వైభంగా జరిగాయి. చిన్నారుల నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి. పాటల కచేరీ ఆకట్టుకుంది.