Kanna Laxminarayana on YSRCP Corruption: సహకార రంగంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఐదు వేల కోట్ల రూపాయలకు పైగానే అవినీతికి తెరలేపారన్నారు. వైసీపీ ప్రభుత్వం హయంలో ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింది స్థాయి నేతల వరకు.. ఈ అవినీతిలో వాటాలు ఉన్నాయని ఆయన అన్నారు. కొందరు అధికారులు కూడా ఈ కుంభకోణంలో పాత్రధారులని తెలిపారు. సహకార రంగంలో జరుగుతున్న అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఈ సహకార రంగంలో కేంద్రమంత్రి అమిత్ షాతో పాటు, సీబీఐకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సహకార సొసైటీల్లో అవినీతిపై వారి వద్ద ఉన్న ఆధారాలను బయటపెడుతున్నామన్నారు. సహకార రంగంలో కోట్లాది రూపాయల అవినీతి జరిగినా పట్టించుకునే నాథులు కరవయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన సహకార రంగంలో జేబు దొంగలు చేరారని దుయ్యబట్టారు. త్రిసభ్య కమిటీల మాటున రైతుల సొమ్మును విచ్చలవిడిగా దోచుకుంటున్నారని మండిపడ్డారు.
వైసీపీ నేతల్ని సహకార పదవుల్లో నామినేట్ చేసి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. రైతులు కూడా తమ పేరు మీద ఉన్న భూ వివరాలను సహకార సొసైటీల్లో సరిచూసుకోవాలని సూచించారు. రైతుల పాస్ పుస్తకాల దొంగ జిరాక్స్‌లతో సొమ్ము దోచేశారన్నారు. కేంద్రం చర్యలు తీసుకోకుంటే రైతుల పక్షాన ఉద్యమిస్తామని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని నేరాలు కనిపించడం లేదా..! రాష్ట్రంలో జరుగుతున్న నేరాలు చూసి డీజీపీ సిగ్గుపడాలన్నారు. ముఖ్యమంత్రిగా ఆ పదవిలో కూర్చునే అర్హత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో కోల్పోయారని విమర్శించారు. చేరుకపల్లి ఘటన సహా ఇతరత్రా నేరాల పట్ల సీఎం, మంత్రులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.
నేరాలు, శాంతి భద్రతలపై ఫైర్ అయిన ప్రత్తిపాటి : రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, అకృత్యాలపై మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పందించారు. గత 15 రోజులుగా రాష్ట్రంలో విచ్చలవిడిగా అరాచకలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం 3 హత్యలు.. 6 నేరాలతో పరిఢవిల్లుతోందని ఆరోపించారు. పిల్లాడిపై పెట్రోల్ పోసి తగలబెట్టడం అత్యంత దారుణమని మండిపడ్డారు. అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం ప్రచారం చేస్తోందని.. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని నేరాలు జరుగుతున్నా.. క్రైమ్ తగ్గిందని డీజీపీ చెప్పడం విడ్డూరమని అన్నారు. పోలీసుల వ్యవస్థను వైసీపీ వ్యవస్థగా మార్చారని మండిపడ్డారు. ప్రజా భద్రతను వదిలేసి.. టీడీపీ శ్రేణులను వేధించటంపైనే దృష్టిపెట్టారని అన్నారు.