Nadendla Manohar: వైకాపా ఎంపీ, ఎమ్మెల్యేలపై జనసేన వర్గాలు దాడి చేస్తాయని మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఖండించారు. జనసేన పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేక వైకాపా ఇలాంటి కుట్రలు చేస్తోందని ఆయన అన్నారు. రహస్య నివేదిక లీక్ కావడంపై డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జనసేన నాయకుల ఫోన్లపైనే కాకుండా ఇలాంటి వ్యవహారాలపైనా నిఘా ఉంచాలన్నారు. టెక్కలిలో జనసేన కార్యాలయంపై వైకాపా దాడి చేస్తే.. ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు లేవని అన్నారు. వైకాపాతో ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా తేల్చుకుంటామని స్పష్టం చేశారు.
అరాచకం సృష్టించాలని చూస్తోంది: ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పేరుతో జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో మరో అరాచకం సృష్టించాలని చూస్తోందని.. జనసేన నేత పోతిన వెంకట మహేశ్ విమర్శించారు. జనసేన బలంగా ఉన్న ప్రాంతాల్లో ఘర్షణలు సృష్టించి.. శాంతి భద్రతల సమస్య తీసుకురావాలన్నదే వైకాపా లక్ష్యమని ఆరోపించారు. ప్రజలను రెచ్చగొట్టి విద్వేషాలను రగల్చడంలో వైకాపా నాయకులు దిట్ట అని పోతిన మండిపడ్డారు. వైజాగ్లో వాళ్లే కొట్టుకొని జనసేన పార్టీ నాయకుల మీద కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. ఇప్పుడు ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో అరాచకాలకు, అల్లర్లకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు.
ఇవీ చదవండి: