నివర్ తుపాను బాధిత రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ దీక్ష చేపట్టారు. అయన పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా పార్టీ శ్రేణులు నిరసన దీక్షలు చేపట్టారు.
గుంటూరులో..
నివర్ తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణ సాయం కింద్ర రూ. 10వేలు అందించాలని జనసేన పీఏసీ సభ్యులు బోనబోయిన శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గుంటూరు కలెక్టరేట్ ఎదుట దీక్ష చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్.. ఏరియల్ సర్వే చేసి నష్టాన్ని అంచనా వేస్తున్నాం.. పరిహారం ఇస్తామనటం సరికాదన్నారు.
తెనాలిలో..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపు మేరకు తెనాలిలోని చినరావూరు పార్కు వద్ద పార్టీ నాయకులు, రైతులతో కలిసి నిరసన దీక్ష చేపట్టారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు 24 గంటల్లో రూ. పది వేలు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల బాధలు ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదని.. సర్కారు నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ జనసేన నిరసన దీక్ష చేపట్టిందన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ స్పందించి రైతులను ఆదుకోవాలన్నారు.
రేపల్లెలో...
చేతికొచ్చిన పంటను నష్టపోయి రాష్ట్రంలో రైతులు బాధ పడుతుంటే ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని పార్టీ రేపల్లె నియోజకవర్గం ఇంఛార్జి కమతం సాంబశివరావు అన్నారు. అన్నదాతకు తక్షణ సహాయంగా రూ.10 వేలు.. ఎకరాకు రూ. 35 వేలు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్డీవో కార్యాలయాల ముందు నిరసన దీక్ష చేపట్టారు. అధికారులు పంట నష్టం వివరాలను సేకరించడంలో ఆలస్యం వహిస్తున్నారని ఆరోపించారు. గిట్టుబాటు ధరకే ప్రభుత్వం ధ్యాన్యం కొనుగోలు చేయాలన్నారు. అన్నదాతలకు అండగా జనసేన ఉంటుందని భరోసా ఇచ్చారు.
మంగళగిరిలో...
అకాల వర్షాలతో నష్టపోయిన కర్షకులను ఆదుకోవాలంటూ.. మంగళగిరిలోని అంబేడ్కర్ కూడలి వద్ద జనసేన నేతలు నిరసన దీక్ష చేపట్టారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు చర్యలు చేపట్టలేదని పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిల్లపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. మద్యంపై వచ్చే ఆదాయంతో రైతులను అదుకోవచ్చని అన్నారు. తక్షణ సహాయం కింద రూ. 10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: