Jagan government is ready to sell Amaravati lands: 2019 ఎన్నికలకు ముందు వరకు రేయింబవళ్లు పెద్దఎత్తున సాగిన రాజధాని నిర్మాణ పనులు.. వైసీపీ ప్రభుత్వం రాకతో హఠాత్తుగా నిలిచిపోయాయి. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటినా ఇప్పటి వరకు అమరావతి నిర్మాణానికి వైసీపీ ప్రభుత్వం ఒక్క తట్ట మట్టి వేయలేదు. కక్షపూరితంగా అన్ని పనులనూ నిలిపివేసింది. మూడు రాజధానుల పేరుతో జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకు మభ్యపెడుతూ వచ్చింది. కొత్త వాటి సంగతి దేవుడెరుగు.. గత ప్రభుత్వం 10 వేల కోట్లతో చేపట్టిన వివిధ పనులను పక్కన పెట్టేసింది. దీంతో అవన్నీ ఈ నాలుగేళ్ల కాలంలో శిథిల దశకు చేరుకుంటున్నా పట్టించుకోకుండా గాలికొదిలేసింది. ఈ ప్రభుత్వం రాజధాని పరిధిలో చేపట్టిన ఏకైక పని కరకట్ట రోడ్డు విస్తరణ మాత్రమే. అది కూడా రెండేళ్లు దాటినా ఇంతవరకు అడుగు ముందుకు పడలేదు. ఒక పక్క సంపదను సృష్టించే రాజధానిని పక్కన పెట్టేసి.. మరో వైపు ఆదాయం కోసం అమరావతి భూములను తెగనమ్మేందుకు జగన్ ప్రభుత్వం నడుం బిగించింది.
Auction of 14 acres of land collected by CRDA: రాజధాని ప్రాంతంలోని గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో సీఆర్డీఏ అధీనంలో ఉన్న స్థలాల విక్రయానికి అనుమతిస్తూ గత ఏడాది ప్రభుత్వం 389, 390 జీవోలను జారీ చేసింది. ఇందులో భాగంగా నిధుల సమీకరణ కోసం సీఆర్డీఏ మళ్లీ భూముల వేలానికి తెరతీసింది. ఈసారి కోర్ క్యాపిటల్‌లోని భూములను వేలం వేయబోతోంది. వీటికి సంబంధించి అప్‌సెట్ ధరను ఖరారు చేయడంతో సీఆర్డీఏ అధికారులు శుక్రవారం వేలం ప్రకటన జారీ చేశారు. రైతుల నుంచి సీఆర్డీఏ సమీకరించిన భూముల్లోని 14 ఎకరాలను వేలానికి ఉంచారు.
Auction of 10 acres in Guntur district: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరులో 10 ఎకరాలను వేలం వేయనున్నారు. ఒక్కో ప్లాట్ ఎకరా విస్తీర్ణం చొప్పున మొత్తం పది ప్లాట్లను వేలానికి ఉంచారు. ఎకరా ధర 5.94 కోట్లుగా ధరను నిర్ణయించారు. తుళ్లూరు మండలం పిచ్చికలపాలెంలోని ఒక్కొక్కటి ఎకరం విస్తీర్ణం ఉన్న నాలుగు ప్లాట్లను వేలం వేయనున్నారు. ఎకరా ధరను 5.41 కోట్లుగా నిర్ధారించారు. శుక్రవారం నుంచి ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలి. వచ్చే నెల 4వ తేదీ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో వేలం నిర్వహించనున్నారు.
Jagan government stance on Amaravati: అమరావతిపై జగన్ ప్రభుత్వ వైఖరి కారణంగా రాజధాని జిల్లాల్లోని భూములను వేలం వేసినా ఎవరూ ఆసక్తి చూపలేదు. రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేక భూములు కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో సొంతంగా నిధులు సమీకరించుకునేందుకు సీఆర్డీఏ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. వేలంలో భాగంగా తొలి విడతలో గతేడాది ఐదు లాట్లలో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోని తెనాలి, నవులూరు, పాయకాపురం, ఇబ్రహీంపట్నంలలోని 56.2 ఎకరాల్లో ఉన్న 100 నివాస, వాణిజ్య ప్లాట్లను వేలానికి ఉంచారు. వీటికి నామమాత్రంగానే స్పందన వచ్చింది. ఎన్నిసార్లు అమ్మకపు ప్రకటనలు ఇచ్చినా విక్రయాలు అరకొరే. ప్రభుత్వానికి ఇక్కడ రాజధానిని అభివృద్ధి చేసే ఉద్దేశం లేదన్న భావన అందరిలో నెలకొనడమే ఈ దుస్థితికి కారణం.