Jagan Govt Decided not to Increase Crops Price: పంటల మద్దతు ధరలకు సీఎం జగన్(CM Jagan) కొత్త భాష్యం చెప్పారు. ఏటికేడు పెట్టుబడులు పెరిగితే నాకేంటి..? నేనైనా, నా ప్రభుత్వమైనా పంటల మద్దతు ధరను పైసా కూడా పెంచబోమని తేల్చిచెప్పేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే పంటలకు 2019-20తో పోలిస్తే 2023-24 సంవత్సరానికి సగటున 20శాతంపైనే గిట్టుబాటు ధరల్ని పెంచింది. అప్పటికీ అవి వాస్తవ సాగు వ్యయానికి అనుగుణంగా లేవని రైతులు వాపోతున్నారు. వైసీపీ ప్రభుత్వం మాత్రం తాము ఎంపిక చేసిన పంటలకు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది 2019-20 ప్రకటించిన ధరల్నే ఐదో ఏడాది 2023-24లోనూ అమలు చేస్తున్నామని ప్రకటించింది. అవేవో కొత్తగా ఈ ఏడాదే ప్రకటించినట్లుగా వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సచివాలయంలో పెద్ద పోస్టర్ కూడా విడుదల చేశారు.
ఏటా పంట వేయటానికి ముందే తామే సొంతంగా మద్దతు ధరలు ప్రకటిస్తామంటూ ఎన్నికల సమయంలో జగన్ ఊరూవాడా తిరిగి చాటింపు వేశారు. 2019-20 సంవత్సరానికి 2020 జనవరిలో మద్దతు ధరల్ని ప్రకటించారు. అవైనా సరిగా అమలు చేశారా అంటే అదీ లేదు. కరోనా సమయంలో రైతుల గోడు పట్టించుకున్న దాఖలాలే లేవు. అరటికి కిలో 8 రూపాయల మద్దతు ధర ప్రకటించి.. 4 రూపాయలకు మాత్రమే కొన్నారు. రెండేళ్లుగా పసుపు రైతుల గోడు వినడం లేదు. ఉల్లి రైతుల వేదన అరణ్య రోదనగా మారింది. క్వింటాల్ రాగులకు 4వేల 412, సజ్జకు 3వేల185 చొప్పున మద్దతు ధరల్ని నిర్ణయించాలని గతేడాది రాష్ట్ర ప్రభుత్వమే సీఏసీపీ(CACP)కి ప్రతిపాదనలు ఇచ్చింది. అయితే తాము మాత్రం కొర్ర, అండుకొర్ర, అరిక తదితర చిరుధాన్యాలకు 2019-20లో ప్రకటించిన మేరకే ఇప్పుడూ క్వింటాల్‌కు 2వేల 500 రూపాయలు కొనసాగిస్తోంది.
నాలుగేళ్లుగా సాగు వ్యయం భారీగా పెరుగుతోంది. డీజిల్, పెట్రోలు ధరల భారంతో సేద్యపు ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. నాగళ్లతో దున్నించి, గొర్రు, గుంటక తోలించాలంటేనే ఎకరాకు 5 వేల వరకు అవుతోంది. రసాయన ఎరువుల ధరలూ 50 నుంచి 80 శాతం వరకు పెరిగాయి. తెగుళ్ల తీవ్రత పెరిగింది. పురుగుమందులు ధర సగటున 60 శాతం పెరగ్గా కొన్నింటి రేట్లు రెట్టింపు అయ్యాయి. మిరప సాగుకు ఎకరాకు రెండున్నర లక్షలకు పైనే అవుతోంది. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర క్వింటాల్‌కు 7 వేల రూపాయలే. ఎకరాకు సగటున 20 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా రాబడి లక్షా 40 వేలకు మించదు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు అమ్మితే ఎకరాకు లక్షకు పైగా రైతు నష్టపోవాల్సిందే. చిరుధాన్యాలు సాగు చేయాలన్నా ఎకరాకు కనీసం 20 వేలకు తగ్గడం లేదు. దిగుబడి సగటున 5 క్వింటాళ్ల లెక్కన ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు క్వింటాల్‌కు 2వేల 500 చొప్పున చూస్తే రైతుకు వచ్చే ఆదాయం 12 వేల500 మాత్రమే.
ఏటా పెరుగుతున్న పెట్టుబడుల్ని పరిగణనలోకి తీసుకుని, అందుకు అనుగుణంగా మద్దతు ధరల్ని నిర్ణయిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఖరీఫ్ ఆరంభంలోనే మద్దతు ధరలు ప్రకటిస్తుంది. 2019-20తో పోలిస్తే 2023-24కు కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలు 20శాతం పైనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదించే ధరలతో పోలిస్తే ఇవీ తక్కువే. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా మద్దతు ధరలను ప్రకటించడం లేదు. కేంద్ర వ్యవసాయ ఖర్చులు, ధరల నిర్ణాయక కమిషన్ దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పంటల వారీ సాగు వ్యయం, మద్దతు ధరల సిఫారసును తీసుకుంటుంది. దీనిలో భాగంగా 2023-24 పంట కాలానికి ఆంధ్రప్రదేశ్ క్వింటాల్ ధాన్యానికి 3వేల126, జొన్నకు 3వేల474, మొక్కజొన్నకు 2వేల938, కందికి 10వేల384, పెసరకు 10వేల135, మినుముకు 9వేల059, వేరుసెనగకు 9వేల352, పత్తికి 8వేల716 చొప్పున ప్రకటించాలని కోరింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం సీఏసీపీని కోరడంలో చూపిన శ్రద్ధను తాము మద్దతు ధరల్ని నిర్ణయించే పంటల విషయంలో మాత్రం చూపలేకపోయింది.