Irregularities in MGNREG Scheme in AP: పేదవారి కడుపు నింపడానికి ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం రాష్ట్రంలో అక్రమార్కుల జేబులు నింపుతోంది. చనిపోయినవారిని జాబితాలో చూపెట్టి లక్షలా రూపాయలు దారి మళ్లిస్తున్నారు. పనులకు హాజరుకాకపోయినా కూలీలకు దొంగ మస్టర్లు వేసి.. అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ అక్రమాల వెనుక వైసీపీ నేతల హస్తముందనే వాదనలు వినిపిస్తున్నాయి. సభలో సందు దొరికినప్పుడల్లా పేదల పక్షపాతినని ఊదరగొట్టే జగన్.. బలహీనులకు అన్యాయం జరుగుతున్న పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఒక్కో జిల్లాలో రోజూ లక్ష పని దినాలు ఉపయోగించుకోవాలి. ఇందుకోసం తగిన కార్యాచరణతో ముందుకెళ్లాలి. ఈ ఏడాది 5,280 కోట్లు ఉపాధి కింద ఖర్చు చేయాలన్న లక్ష్యాన్ని గడువులోగా చేరుకోవాలంటూ 2021 ఏప్రిల్ 26, 2023 ఏప్రిల్ 27న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్ ఆదేశాలతో అధికారులు కిందిస్థాయి సిబ్బందిపై ఒత్తిడి పెంచారు. దీంతో ఉపాధి హామీ లక్ష్యాన్ని పక్కనపెట్టి కిందిస్థాయి సిబ్బంది సీఎం జగన్ చెప్పిన లక్ష్యాన్ని చేరుకోవడానికి వివిధ రకాల అక్రమాలకు పాల్పడుతున్నారు.
రోజూ లక్ష పనిదినాలు చూపేందుకు లేని పేర్లకు మస్తర్లు వేయడం.. చనిపోయిన వారిని సైతం కూలీలుగా చూపి కూలీ సొమ్ములు పక్కదారి పట్టిస్తున్నారు. పనిలో పనిగా తమ జేబులు సైతం నింపుకుంటున్నారు. కష్టపడి పనిచేస్తున్నా సరైన కూలీ దక్కడం లేదని.. కానీ ఏ పని చేయకుండానే లక్షాలాది రూపాయలు వెనకేసుకుంటున్నారని ఉపాధి హామీ కూలీలు మండిపడుతున్నారు. దీని వెనక వైసీపీ నేతల హస్తముందని వారు ఆరోపిస్తున్నారు.
ఉపాధి హామీ పథకం అమల్లో అవకతవకలు, అక్రమాల నిరోధానికి కేంద్ర ప్రభుత్వం గత నాలుగేళ్లలో అనేక కొత్త విధానాలను ప్రవేశపెట్టింది. ఇందుకోసం ఆధునిక సాంకేతికతను సైతం అనుసంధానిస్తోంది. డ్రోన్లతో పనులను తనిఖీ చేయించాలని తాజాగా రాష్ట్రాలను ఆదేశించింది. అయితే రాష్ట్రంలో ఉపాధి పనుల్లో పర్యవేక్షణ వ్యవస్థలు సరిగా పని చేయడం లేదు.
క్షేత్రస్థాయిలో భారీగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని జిల్లాల్లో అధికార వైసీపీ నేతలు, సిబ్బంది కలిసి వేతనాల సొమ్మును పంచేసుకుంటున్నారు. ఒక్కో జిల్లాలో రోజూ లక్ష పని దినాలు వినియోగించాల్సిందన్న సీఎం జగన్ ఆదేశాలతో అధికారులు క్షేత్రస్థాయిలోని సిబ్బందిపై ఒత్తిడి పెంచుతున్నారు. ఏం చేస్తారో తెలియదు.. పని దినాలు భారీగా ఖర్చు చేయాల్సిందేనంటూ మౌఖిక ఆదేశాలతో సిబ్బంది అక్రమాల బాట పడుతున్నారు.
ఈ క్రమంలోనే మృతులకూ పనులు కల్పించే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. జాబ్‌కార్డు కలిగిన కూలీల్లో ఎవరైనా మరణిస్తే.. వారి పేర్లను కార్డుల్లోంచి తొలగించడం లేదు. దీనివల్ల పని దినాల వినియోగాన్ని భారీగా చూపించి.. నరేగా సిబ్బంది ఆర్థిక ప్రయోజనం పొందుతున్నారు. మృతి చెందిన కూలీల బ్యాంకు ఖాతాల నుంచి వీరి కుటుంబ సభ్యుల సహకారంతో ఏటీఎం కార్డుల ద్వారా వేతనాలు డ్రా చేస్తున్నారు.
ఉపాధి హామీ పథకంలో కేంద్రం నుంచి మెటీరియల్’ నిధులను ఎక్కువగా రాబట్టాలంటే పని దినాలను అత్యధికంగా వినియోగించుకోవాలి. వేతనాల కింద వినియోగించిన నిధుల్లో.. 1/3 వంతును మెటీరియల్ కింద కేంద్రం అందిస్తుంది. రాష్ట్రానికి పని దినాల కేటాయింపులను కేంద్రం గత రెండేళ్లుగా తగ్గిస్తోంది. ఈ ప్రభావం మెటీరియల్ నిధులపై పడే అవకాశం ఉందని గ్రహించిన ప్రభుత్వం.. క్షేత్రస్థాయి సిబ్బందికి లక్ష్యాలను నిర్దేశించి గడువులోగా వినియోగించాల్సిందేనని ఒత్తిడి పెడుతోంది. మొదట కేటాయించిన పని దినాలు ఉపయోగించుకోవడమే తడవుగా కేంద్రం వద్దకు వెళ్లి అదనపు కేటాయింపులు తెస్తోంది. రెండేళ్లుగా ఇదే జరుగుతోంది.
కొన్ని జిల్లాల్లో ఉపాధి హామీ పథకం సిబ్బంది అధికార వైసీపీ నేతలు చెప్పినట్లుగా తలూపుతున్నారు. శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని పంచాయతీల్లో కూలీలు చనిపోయినా.. వారి పేర్లతో మస్టర్లు వేయడం వెనుక వైసీపీ నేతల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో కూలీలు పనులకు వెళ్లకపోయినా.. మస్టర్లు వేసి వేతనాల సొమ్ము కొల్లగొడుతున్నారని ఆరోపణలున్నాయి. ఉపాధి హామీ పథకంలో నిధుల దుర్వినియోగం ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువగా ఉన్నట్టు పార్లమెంటరీ స్థాయీ సంఘం 2022 ఫిబ్రవరి నివేదికలో స్పష్టం చేసింది.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం చినతాడేపల్లిలో కాసాని వెంకటేశ్వరరావు, చిటకన చంద్రయ్య మృతి చెందినా వారిద్దరూ ఆరు వారాల పాటు ఉపాధి పనులకు హాజరైనట్టు సిబ్బంది మస్టర్లు వేశారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మర్రిపాడు పంచాయతీ చిన్నమర్రిపాడుకి చెందిన గిన్ని చిట్టెమ్మ 2017 డిసెంబరులో మృతి చెందారు.
2021-22, 2022-23లోనూ ఆమె ఉపాధి పనులకు హాజరైనట్లుగా సిబ్బంది మస్టర్లు వేశారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెం పంచాయతీలో ఉపాధి పనులకు కూలీలు హాజరవ్వకపోయినా.. మస్టర్లు వేసి వేతనాలను కూలీలతోనే బ్యాంకుల్లో డ్రా చేయించి సిబ్బంది పంచుకుంటున్నారు. తన భార్య మూడు వారాలపాటు ఉపాధి పనులకు వెళితే.. నాలుగు వారాలకు హాజరైనట్లుగా మస్టర్లు వేసి బ్యాంకు ఖాతాలో వేతనాలు జమ చేసినట్లు సత్యనారాయణరెడ్డి అనే వ్యక్తి విచారణలో వెల్లడించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం దిబ్బగుడివలస పంచాయతీలో ఫీల్డ్ అసిస్టెంట్ ఒకరు కూలీల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు.
NREGA Labour concerns: ఉపాధి హామీ సొమ్ము గోల్మాల్ వ్యవహారంలో కొనసాగుతున్న కూలీల నిరసన