Irregularities for PG Medical Seats in AP : మెడికల్ పీజీ సీట్ల కోసం రాష్ట్రంలో పలు కళాశాలలు చేసిన అక్రమాల దందా కలకలం రేపుతోంది. నంద్యాలలోని శాంతిరామ్ వైద్య కళాశాలకు 50, రాజమహేంద్రవరంలోని GSL వైద్య కళాశాలకు 63, విజయనగరంలోని మహారాజా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళాశాలకు 23 చొప్పున జాతీయ వైద్య కమిషన్ నుంచి పీజీలో మొత్తం 136 సీట్లకు అదనంగా ఆమోదం లభించినట్లు నకిలీ పత్రాలు సృష్టించారు. ఈ మూడింటిలో రెండు కళాశాలలకు చెందిన 113 సీట్లను మిగిలిన వాటితో కలిపి YSR ఆరోగ్య వర్సిటీ కౌన్సెలింగ్ ద్వారా విద్యార్థులకు కేటాయించింది.
జాతీయ వైద్య కమిషన్ నుంచి వచ్చి ఉత్తర్వులు వాస్తవమా, కాదా తెలుసుకోకుండానే సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహించడం ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్లక్ష్యానికి నిదర్శనం. ఆలస్యంగా ఈ వ్యవహారాన్ని గుర్తించిన వర్సిటీ అధికారులు జాతీయ వైద్య కమిషన్ నుంచి ఆమోదం లభించని సీట్లను పక్కన పెట్టి మిగిలిన సీట్ల భర్తీకి మళ్లీ కౌన్సెలింగ్ నిర్వహిస్తోంది. దీంతో తొలుత సీట్లు పొందిన వారికి కోరుకున్న స్పెషాలిటీలో సీట్లు రాని పరిస్థితి ఏర్పడింది.
Many Colleges are Illegal for Medical PG Seats : నంద్యాలలోని శాంతిరామ్ వైద్య కళాశాల యజమాని ఇటీవలే వైసీపీలో చేరారు. GSL వైద్య కళాశాల యాజమాన్యానికీ ఉన్నత స్థాయిలో విస్తృత పరిచయాలు ఉన్నాయి. పీజీ వైద్య సీట్లు పెరిగితే యాజమాన్య కోటా ద్వారా డొనేషన్ల రూపంలో భారీగా వెనకేసుకోవచ్చు. సీట్ల సంఖ్యను బట్టి బీ, సీ కేటగిరీల్లో కొన్ని భర్తీ చేస్తారు. సీ కేటగిరీ సీట్లకు స్పెషాలిటీని బట్టి 2కోట్ల వరకు దండుకుంటారు. 136 సీట్లకు గాను 20 సీట్లు ఈ విభాగంలో భర్తీ అవుతాయి. ఒక్కో సీటుకు 2 కోట్ల చొప్పున 40 కోట్లు... ఒక్కో ఏడాది ఈ కళాశాలలకు వెళ్తాయంటే ఎన్ని కోట్ల రూపాయాలు చేతులు మారి ఉంటాయో ఊహించుకోవచ్చు.
పీజీ వైద్య కోర్సుల్లో సీట్ల పెంపు ఆషామాషీగా జరగదు. ఒకటి, రెండు సీట్లు పెరగాలన్నా ఎన్నో నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. సీట్ల భర్తీపై యాజమాన్యాల నుంచి జాతీయ వైద్య కమిషన్‌కు దరఖాస్తులు వెళ్లాలి. అక్కడ్నుంచి ప్రత్యేక బృందాలు కళాశాలలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. ఈ బృందాల సిఫార్సు మేరకు NMC అనుమతులు జారీ చేస్తుంది. మెడికల్ ఎసెస్‌మెంట్ అండ్ రేటింగ్ బోర్డు నుంచి అదనంగా సీట్లు కేటాయిస్తూ మెంబర్ లేదా ప్రెసిడెంట్ పేరుతో LOPలు జారీ అవుతాయి.
ఈ క్రమంలో మూడు కళాశాలల్లో స్పెషాలిటీల వారీగా సీట్లు పెంచుతున్నట్లు వైఎస్సార్ వర్సిటీకి సమాచారం అందింది. ఆ సమయంలోనే అనుమానం రావాలి. NMC అధికారిక వెబ్‌సైట్‌లో సరిచూసుకోవాలి.... లేదంటే NMCనే సంప్రదించాలి. కానీ ఇదేమీ జరగలేదు. నకిలీ సర్టిఫికెట్ల ఆధారంగా శాంతిరామ్ కళాశాలలో, తమిళనాడులోని ఓ వైద్య కళాశాలలో సీట్లు పెంచుకున్నట్లు దిల్లీలోనే NMC కార్యాలయం ద్వారా బయటపడింది.
ఈ విషయం తెలియగానే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ NMCని సంప్రదించింది. ఈ క్రమంలోనే GSL, మహారాజా కళాశాలలకు కూడా నకిలీ సర్టిఫికెట్లు జారీ అయినట్లు తేలింది. తొలి కౌన్సెలింగ్ ప్రారంభం నాటికి శాంతిరామ్, జీఎస్‌ఎల్ కళాశాలలకు అదనంగా సీట్లు మంజూరైనట్లు నకిలీపత్రాలు వచ్చాయి. ఆ తర్వాత విజయనగరం కళాశాలకూ LOPలు వచ్చినట్లు తేటతెల్లమైంది.
350 PG Medical Seats Across the Country are Illegal : కళాశాలలు సీట్ల పెంపు కోసం దరఖాస్తు చేయకున్నా కేటాయింపులు జరిగినట్లు స్వయంగా NMCనే వెల్లడించింది. GSL శాంతిరామ్ కళాశాల నుంచి దరఖాస్తులు రాకున్నా LOPలు జారీ చేసినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా 350 సీట్ల విషయంలో ఇలాంటి దందా జరిగినట్లు భావిస్తున్నారు. ఈ నకిలీపత్రాల జారీలో భారీ ఎత్తున నగదు చేతులు మారినట్లు భావిస్తున్నారు. నకిలీ పత్రాల జారీ వెనుక ఎవరున్నారు? ఎలా జరిగిందన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఉన్నతస్థాయిలో లాబీయింగ్ లేకుంటే... ఇలాంటి అక్రమాలు జరిగే అవకాశాలు తక్కువ.
వర్సిటీ వెబ్‌సైట్‌లో పేర్కొన్న ప్రకారం శాంతిరామ్, జీఎస్‌ఎల్ కళాశాలకు ఎన్‌ఎంసీ నుంచి జరిగిన సీట్ల కేటాయింపు వివరాలకు, ఎన్‌ఎంసీలో వెబ్‌సైట్‌లో పేర్కొన్న సీట్ల సంఖ్యలో వ్యత్యాసాలు ఉన్నాయి. నిశితంగా పరిశీలించి.. ఎన్‌ఎంసీతో సంప్రదించిన తర్వాతే సీట్ల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచినట్లు వైఎస్సార్ వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ వ్యవహారంపై NMC ఇప్పటికీ దిల్లీలో కేసు నమోదు చేసిందని...విచారణ చేపట్టాలని ఆరోగ్య వర్సిటీ ఉపకులపతి తెలిపారు. ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా ఘటనపై తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.