Conflict In YSRCP : ఉత్తరాంధ్రలో అధికార వైఎస్సార్సీపీ వర్గపోరుతో ఉడికిపోతోంది. అనకాపల్లి నుంచి ఇచ్ఛాపురం వరకు దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ పట్టు కోసం నేతల సిగపట్లతో పార్టీ క్యాడర్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. విశాఖలో ఎంపీ విజయసాయిరెడ్డి పెత్తనంపై సొంత పార్టీలోనే వ్యతిరేకత పెల్లుబుకుతోంది. విజయనగరంలో మంత్రి బొత్స కుటుంబాన్ని ఢీ కొట్టేందుకు ఆయన దగ్గరి బంధువులే సిద్ధమవుతున్నారు. ఈ మంత్రి మాకొద్దంటూ అప్పలరాజుపై పలాస నియోజకవర్గ వైఎస్సార్సీపీ నేతలు మూకుమ్మడి పోరాటానికి దిగారు. అనకాపల్లిలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు కుంపటి రగులుతుండటంతో పక్క నియోజకవర్గ చూపులు చూస్తున్నారు. ఆయన తన నియోజకవర్గం వైపే చూస్తున్నారని ఎలమంచిలి ఎమ్మెల్యే రమణమూర్తి రాజు మండిపడుతున్నారు. నలుగురు నేతల నాలుగు స్తంభాలాటలో ఇచ్ఛాపురం ఉంటే.. టెక్కలిలో 3 వర్గాల పోరుతో పీటముడి పడుతోంది. పాడేరులో అయిదుగురి మధ్య టికెట్ ఆట రసవత్తరంగా సాగుతోంది. ఇంకా చాలా నియోజకవర్గాల్లో అంతర్గత కుమ్ములాటలు ముదిరి బహిరంగ విమర్శలు, సవాళ్లదాకా వచ్చాయి. ఇందులో కొన్ని పంచాయితీలు ముఖ్యమంత్రి దాకా వెళ్లినా తెగకపోవడం ఉత్తరాంధ్రలో వర్గపోరు తీవ్రతకు నిదర్శనం.
ఇద్దరి ఏంపీల మధ్య పంచాయితీ : విశాఖలో పార్టీ నేతలపై రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పెత్తనంపై రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. ఆయనకు, విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. సాయిరెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు విశాఖపట్నంలో భూములు కొన్న వ్యవహారం బయటకు పొక్కడంలో ఎంపీ పాత్ర ఉందని భావిస్తున్న సాయిరెడ్డి.. ఎంవీవీకి చెందిన నిర్మాణ సంస్థలో లోపాయికారీ వ్యవహారాన్ని మీడియా ముందు బయటపెట్టారు. ఆ తర్వాత ఎంపీ సంస్థ నిర్మాణాలను రెవెన్యూ, జీవీఎంసీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తతంగం వెనుక సాయిరెడ్డి ఉన్నారని ఎంపీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇద్దరు ఎంపీల మధ్య పంచాయితీ ముదిరి సీఎం కార్యాలయానికి చేరింది. విశాఖ నుంచి లోక్‌సభకు పోటీ చేయాలనే వ్యూహంతో సాయిరెడ్డి పావులు కదుపుతుండటం ఎంపీతో చెడేందుకు ఒక కారణం కావచ్చంటున్నారు. మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ.. సాయిరెడ్డిని గతంలో జిల్లా పరిషత్ సమావేశంలోనే విమర్శించారు. తర్వాత వారిద్దరినీ సీఎం తాడేపల్లికి పిలిచి మందలించారు. అయినా సాయిరెడ్డితో వారిద్దరికీ సఖ్యత కుదరలేదనే చెబుతున్నారు.
తారస్థాయికి విభేదాలు : విశాఖ దక్షిణ నియోజకవర్గంలోనూ సాయిరెడ్డి జోక్యం వర్గ పోరును పెంచిందని వైఎస్సార్సీపీ శ్రేణుల సమాచారం. టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ వైఎస్సార్సీపీకీ మద్దతు ప్రకటించడంతో ఆయన్నే నియోజకవర్గ పార్టీ బాధ్యుడిగా నియమించారు. అయితే అక్కడున్న బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్ ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీ పడుతున్నారు. దీంతో గణేష్, సుధాకర్‌ల విభేదాలు తారస్థాయికి చేరాయి. సుధాకర్ తనను ఇబ్బంది పెడుతున్నారంటూ ఎమ్మెల్యే గణేష్ వైఎస్సార్సీపీ కార్యాలయం వద్దకు వెళ్లి హడావుడి చేశారు. ముఖ్యమంత్రి కల్పించుకుని గణేష్‌ను నియోజకవర్గ సమన్వయకర్తగా కొనసాగిస్తూ, సుధాకర్‌కు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. అయినా సుధాకర్ ఎమ్మెల్యేగా పోటీపై దృష్టి పెడుతున్నారని, సాయిరెడ్డి మద్దతుతోనే ఆయన ఇలా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
అనకాపల్లిలో ఆగని పోరు : అనకాపల్లిలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఎంపీ సత్యవతి, మాజీ మంత్రి దాడి వీరభద్రరావులలో ముగ్గురికీ ఒకరంటే ఒకరికి పొసగడం లేదు. ఒకరు వెళ్లిన కార్యక్రమాలకు మరొకర్ని పిలవని పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి నుంచి కాకుండా మరో నియోజకవర్గం నుంచి పోటీ చేసే యోచనలో మంత్రి ఉన్నారని, ఆయన వెళ్లిపోతే ఈ టికెట్ తమకంటే తమకేనని ఎంపీ సత్యవతి, దాడి వీరభద్రరావు ఇప్పటి నుంచే రాజకీయ వ్యూహాలు అమలు చేసుకుంటున్నారు. మరోవైపు అమర్‌నాథ్ తాను వెళ్లాలనుకుంటున్న నియోజకవర్గంలో వ్యతిరేక వాతావరణం ఉందని గ్రహించి ఇప్పుడు విశాఖ నగరంలోని మరో నియోజకవర్గంపై దృష్టి సారిస్తున్నట్లు తెలిసింది.
సీట్టింగ్ సీటు ఎలా వదులుకుంటానంటూ : ఎలమంచిలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కన్నబాబు రాజు, గవర కార్పొరేషన్ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్ వర్గాలు పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ఎన్నికల్లో కొన్నిచోట్ల బాహాబాహీకి దిగిన సందర్భాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలమంచిలి నుంచి పోటీ చేసేందుకు మంత్రి గుడివాడ అమర్‌నాథ్ సిద్ధమవుతున్నారన్న చర్చ ఎమ్మెల్యే వర్గంలో అసంతృప్తిని రాజేసింది. మా దగ్గరకు ఎవరైనా బయటి వ్యక్తులు వచ్చి పోటీ చేస్తామంటే ఓడిపోతారంతేనని ఎమ్మెల్యే కన్నబాబు రాజు బహిరంగ హెచ్చరిక జారీ చేశారు. మంత్రికి, బొడ్డేడ ప్రసాద్‌కు వ్యాపార బంధాలున్నందున ఒకరికొకరు సహకరించుకుంటున్నారు. ఐతే మంత్రికి లేదంటే ప్రసాద్‌కు టికెట్ అన్నట్లుగా వారి ప్రచారం సాగుతోంది. తన సిట్టింగ్ సీటును ఎలా వదులుకుంటానంటూ ఎమ్మెల్యే సీరియస్‌గా తీసుకున్నారు. విభేదాలు పెరుగుతుండటంతో వైఎస్సార్సీపీ పెద్దలు ఈ ముగ్గురి మధ్య సయోధ్య కుదిర్చారని, దీంతో ప్రసాద్ కొద్దిగా నెమ్మదించారని చెబుతున్నారు.
దెబ్బకు దెబ్బ అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని ప్రకటన : పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు నియోజకవర్గంలో వ్యతిరేక వర్గాలు చాలా ఉన్నాయి. ఇటీవల పాయకరావుపేట మండల పర్యటనకు వెళ్లిన ఆయనను పార్టీ నాయకుడు చిక్కాల రామచంద్ర తన అనుచరులతో అడ్డుకున్నారు. ఎస్.రాయవరం, కోటవురట్ల మండలాల్లోనూ ఎమ్మెల్యేకు అసమ్మతి ఉంది. వైఎస్సార్సీపీ తొలి కేబినెట్‌లోనూ, పునర్‌వ్యవస్థీకరణలోనూ తనకు అవకాశం దక్కకపోవడంతోపాటు రాజకీయంగా ఎదుగుదలకు వీరంతా అడ్డుతగులుతున్నారన్న ఆగ్రహాన్ని ఎమ్మెల్యే బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. దెబ్బకు దెబ్బ అంటే ఎలా ఉంటుందో ఇకపై చూపిస్తానని ఎమ్మెల్యే ప్రకటించారంటే ఆయనకు వర్గపోరు సెగ ఏ స్థాయిలో తగులుతుందో అర్థం చేసుకోవచ్చు.
అరకులో అంతర్యుద్ధాలు : అరకులో ఎమ్మెల్యే శెట్టి పల్గుణ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కుంభా రవిబాబు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం రవిబాబు, తన సీటును నిలబెట్టుకునేందుకు ఎమ్మెల్యే ఎవరికి వారు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. వీరిద్దరిలో ఒకరు సీఎంని ప్రభావితం చేయగలరన్న ఒక గురువు ఆశీస్సులను ఇప్పటికే తీసుకున్నారంటున్నారు. పాడేరులో కుదరకపోతే అరకులోనైనా టికెట్ ఇవ్వాలని పసుపులేటి బాలరాజు ప్రయత్నిస్తున్నారు. అరకులోనూ ఆయన వర్గాన్ని బలోపేతం చేసుకుంటున్నారు. 2019 ఎన్నికల ముందు వరకూ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా పనిచేసినప్పటికీ చివరకు టికెట్ ఇవ్వలేదని, ఈసారైనా ఇవ్వాలంటూ సూర్యనారాయణ ప్రయత్నిస్తున్నారు.
పంచ వర్గాలుగా పాడేరు వైఎస్సార్సీపీ : పాడేరులో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, ఎంపీ మాధవి మధ్య పోటీ నెలకొంది. ట్రైకార్ ఛైర్మన్ పదవి సత్తిబాబుకు ఎంపీయే ఇప్పించారంటున్నారు. ఆయన ద్వారా పాడేరులో రాజకీయ కార్యకలాపాలను ఎంపీ సాగిస్తున్నారు. కొన్నాళ్ల కిందటి వరకూ ఎంపీ, ఎమ్మెల్యే కలిసి కార్యక్రమాల్లో పాల్గొనలేదు. అధిష్ఠానం సర్దుబాటు చేయడంతో ఈ మధ్య పార్టీ కార్యక్రమాల్లో వేదిక పంచుకున్నప్పటికీ వేదిక దిగగానే ఎవరి దారి వారిదే అంటున్నారు. మరోవైపు మాజీ మంత్రి బాలరాజు ఈసారి పాడేరు టికెట్‌ను తన కుమార్తె వెంకటలక్ష్మికి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి జడ్పీ ఛైర్మన్ పదవి వెంకటలక్ష్మికి కాకుండా సుభద్రకు ఇప్పించారని, ఆ సమయంలో తర్వాత ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని భరోసా ఇచ్చారని బాలరాజు వర్గీయులు చెబుతున్నారు. దీంతో బాలరాజు, ఆయన కుమార్తె నియోజకవర్గంలో సీరియస్‌గా పని చేసుకుంటున్నారు. మరోవైపు 2019 ఎన్నికల వరకూ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా ఉన్నా తనకు కాకుండా భాగ్యలక్ష్మికి టికెట్ ఇచ్చారని మత్సరాస విశ్వేశ్వరరాజు అసంతృప్తిగా ఉండటంతో.. సర్దుబాటులో భాగంగా ఆయన భార్య కిముడు శివరత్నంకు జడ్పీ ఛైర్మన్ పదవిస్తామని వైఎస్సార్సీపీ అధిష్ఠానం హామీ ఇచ్చిందంటున్నారు. కానీ శివరత్నం, వెంకటలక్ష్మిలకు జడ్పీ ఛైర్మన్ పదవి ఇవ్వొద్దని పాడేరు, అరకు ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, పల్గుణ అడ్డుచెప్పడంతో చివరి నిమిషంలో సుభద్రకు ఇచ్చారన్న చర్చ నియోజకవర్గంలో ఉంది. బాలరాజు, విశ్వేశ్వరరాజు వర్గాల మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. వీరంతా ఇలా ఉంటే మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు టికెట్ రేసులోకి దిగడంతో పాడేరులో 5 వర్గాలయ్యాయి.
చివరికి చోడవరంలోను : చోడవరంలో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి స్థానిక ప్రజాప్రతినిధులకు దూరం పెరిగింది. బుచ్చయ్యపేట, చోడవరం తదితర జడ్పీటీసీ సభ్యులు ఎమ్మెల్యేతో కలవడం లేదు. మరికొందరు తమ పనులతోపాటు రాజకీయంగా మాడుగుల ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు వద్దకు వెళుతున్నారు. బండారు సత్యనారాయణ, మార్కెట్ కమిటీ ఛైర్మన్ వెంకట సత్యారావు తదితరులు ఎమ్మెల్యేకి వ్యతిరేక వర్గంగా కొనసాగుతున్నారు.
నెల్లిమర్లలో నూతన పోరు : విజయనగరం జిల్లా నెల్లిమర్లలో మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం, స్థానిక ఎమ్మెల్యే బడుకొండ అప్పల నాయుడు కుటుంబం మధ్య స్పర్థలు చోటుచేసుకోవడంతో నియోజకవర్గంపై ఎవరికి వారు పట్టు సాధించే ప్రయత్నాల్లో ఉన్నారు. బొత్స మేనల్లుడు, విజయనగరం జడ్పీ ఛైర్మన్ చిన్న శ్రీను.. ఎమ్మెల్యే అప్పల నాయుడు బావాబామ్మర్దులు. త్వరలో వియ్యంకులు కాబోతున్న ఈ నేతలిద్దరూ ఇప్పుడు ఒకటిగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో నెల్లిమర్ల నుంచి పోటీ చేసేందుకు మంత్రి బొత్స సోదరుడు బొత్స లక్ష్మణరావు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. లక్ష్మణరావు, ఆయన తనయుడు నియోజకవర్గంలో పట్టు సాధించే పనిలో ఉన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అప్పల నాయుడు నిలిపిన సర్పంచి అభ్యర్థులకు వ్యతిరేకంగా 5 చోట్ల లక్ష్మణరావు తన మద్దతుదారులను బరిలో దింపి 3 చోట్ల గెలిపించుకున్నారు. నెల్లిమర్లలో స్థానిక పార్టీ నాయకులు పలువురు మంత్రి బొత్సకు సహచరులు, అనుయాయులున్నారు. దీంతో ఎమ్మెల్యే అక్కడ కార్యక్రమాలను తగ్గించుకుని, నియోజకవర్గంలోని ఇతర మండలాలపై దృష్టి పెట్టారు.
బొత్సకు హెచ్చరిక : మీ తమ్ముడు నా నియోజకవర్గంలో ఇబ్బందులు సృష్టిస్తున్నారు.. మీరు నియంత్రించకపోతే నేను ఎంత దూరమైనా వెళ్తానంటూ మండల పరిషత్ ఎన్నికల సమయంలో.. ఎమ్మెల్యే బహిరంగంగానే మంత్రి బొత్సను హెచ్చరించారు. ఇటీవల అప్పల నాయుడి కుమారుడి వివాహానికి వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌ను బొత్స కుటుంబ సభ్యులు హెలిపాడ్‌వద్దే కలిసి వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. బొత్స మద్దతిచ్చే ఎమ్మెల్సీ పెన్మత్స సూర్యనారాయణ రాజు పదవీ కాలం మార్చిలో ముగియనుంది. ఆయనకు ఆ పదవిని రెన్యువల్ చేయకుండా 2009లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసిన కందుల రఘుబాబుకు ఇస్తే పార్టీ బలోపేతమవుతుందని ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే, జడ్పీ ఛైర్మన్ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా ఎవరికివారు నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు వ్యూహరచన చేస్తున్నారు. శృంగవరపుకోటలో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మధ్య వర్గ పోరు నువ్వా నేనా అన్నట్లుగా నడుస్తోంది. ఎంపీపీ ఎన్నికల సందర్భంగా వేపాడలో కార్యకర్తలే ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. చివరికి ఎమ్మెల్యే సూచించిన అభ్యర్థి కాకుండా ఆయన వ్యతిరేక వర్గం అభ్యర్థే ఎంపీపీ పీఠాన్ని దక్కించుకున్నారు.
ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఎమ్మెల్సీ నీకే : శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను అభ్యర్థిగా ముఖ్యమంత్రి ప్రకటించారు. కానీ అక్కడ గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పేరాడ తిలక్, వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఏ పదవీ దక్కని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి టికెట్ రేసులో ఉన్నారు. శ్రీనివాస్, తిలక్ ఉప్పూనిప్పులా వ్యవహరిస్తున్నారు. దీంతో శ్రీనివాస్‌ను గెలిపిస్తేనే నీకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని తిలక్‌కు.. సీఎం జగన్ ఇటీవల నియోజకవర్గ పార్టీ సమీక్షలో చెప్పారు. కానీ ఎమ్మెల్యేగా తిలక్ పోటీ చేయకపోతే మా పరిస్థితి ఏంటని ఆయన వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది. పాతపట్నం, రాజాం, పాలకొండ ఈ మూడు నియోజకవర్గాలనూ పాలవలస కుటుంబమే శాసిస్తోంది. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ చెప్పినట్లే ఇక్కడ అన్నీ జరుగుతాయన్న ప్రచారం ఉంది. పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి విక్రాంత్ సోదరే. రాజాం, పాలకొండలలోనూ పాలవలస కుటుంబమే అభ్యర్థులను నిర్ణయించే పరిస్థితి. పాతపట్నం నుంచి టికెట్‌ను ఆశిస్తున్న మామిడి శ్రీకాంత్ ప్రభావం చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ధర్మాన ప్రసాదరావు మద్దతుతో పారిశ్రామికవేత్త సిరిపురం తేజేశ్వరరావు సీరియస్‌గానే పావులు కదుపుతున్నారు. పాతపట్నం జడ్పీటీసీ సభ్యురాలు ఉషారాణి భర్త మధుబాబు, కొత్తూరు మండల ఉపాధ్యక్షుడు తులసి వరప్రసాద్ టికెట్ ప్రయత్నాల్లో ఉన్నారు. ఎమ్మెల్యే స్థానికురాలు కారని, ఈసారి స్థానికులైన తమకే టికెట్ ఇవ్వాలంటూ మిగిలినవారి నుంచి డిమాండ్లు వస్తున్నాయి.
మాకొద్దీ అప్పలరాజు అంటూ : మంత్రి సీదిరి అప్పలరాజుకు ఆయన నియోజకవర్గం పలాసలో అడుగడుగునా అసమ్మతి తయారైంది. తనకు మున్సిపల్ ఛైర్మన్ పదవి రాకుండా చేశారని పలాసలో కౌన్సిలర్ దువ్వాడ శ్రీకాంత్, వజ్రపుకొత్తూరు పీఏసీఎస్ పదవి ఇచ్చినట్లే ఇచ్చి లాగేశారని సొసైటీ మాజీ అధ్యక్షుడు దువ్వాడ హేమబాబు చౌదరి, తనను ఎంపీపీ కాకుండా అడ్డుపడ్డారని మాజీ ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు సోదరుడు జుత్తు నీలకంఠం మంత్రిపై గుర్రుగా ఉన్నారు. వీరంతా కలిసి ఆయనకు వ్యతిరేక వర్గంగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. దున్నూరులో వీరంతా సమావేశం నిర్వహించి మాకొద్దీ అప్పలరాజని, వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇస్తే గెలవనివ్వబోమని అల్టిమేటం జారీ చేశారు. మేం రాజకీయంగా బలపడితే తనకు ఇబ్బందనే మంత్రి మమ్మల్ని మోసం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. పలాస దగ్గర 30 ఎకరాల భూమి విషయంలో మంత్రి అప్పలరాజే వెనకుండి ప్రజా సంఘాలు, మావోలను శ్రీకాంత్ తమ్ముడు శ్రీధర్‌పైకి ఉసిగొల్పారని ఈ ప్రాంతంలో విస్తృత చర్చ సాగుతోంది.
ఇచ్ఛాపురంలో నాలుగు వర్గాలుగా : ఇచ్ఛాపురంలో ప్రస్తుత సమన్వయకర్త పిరియా సాయిరాజ్, మాజీ ఎమ్మెల్యే నరేష్ కుమార్ అగర్వాల్, పచ్చదనం- సుందరీకరణ కార్పొరేషన్ ఛైర్మన్ నర్తు రామారావు, శ్యాంప్రసాద్‌రెడ్డి.. నలుగురూ నాలుగు దిక్కులుగా ఉన్నారు. కంచిలి, సోంపేట జడ్పీటీసీ సభ్యులు సాయిరాజ్‌ను వ్యతిరేకిస్తూ రామారావుకు మద్దతిస్తున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ కావాలంటున్న రామారావు తన కార్పొరేషన్ ద్వారా నియోజకవర్గంలో పనులకు శ్రీకారం చుడుతూ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. మరోవైపు మండలాల్లోనూ జడ్పీటీసీ సభ్యులకు, ఎంపీపీలకు పడట్లేదు. సాయిరాజ్ దిల్లీలో తన వ్యవహారాల్లో ఎక్కువగా ఉంటున్నారన్న విమర్శలున్నాయి. ఆయన భార్య, జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ పిరియా విజయనే నియోజకవర్గ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఇలా మొత్తంగా ఉత్తరాంధ్రలో నేతల మధ్య ఆధిపత్య పోరు వైఎస్సార్సీపీ అధిష్ఠానాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
ఇవీ చదవండి :