Jagan Assures Farmers About Grain Collection: ధాన్యం సేకరణపై ముఖ్యమంత్రి జగన్ గొప్పలు చెప్తున్నారు.. కానీ ఆయన మాటలకీ వాస్తవానికీ పొంతన కుదరడం లేదు. గణాంకాలు చూస్తే ఏటికేడు సాగు తగ్గిపోతోంది, ఉత్పత్తి దిగజారుతోంది, సేకరణ కుచించుకుపోతోంది. ఇదిగో మా ప్రభుత్వ ఘనత అంటూ.. ఉన్నదీ లేనిదీ కలిపి చెబుతూ బాకాలూదుతున్న జగన్.. తెలంగాణలో ధాన్యం సేకరణ, ఉత్పత్తితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు పడిపోతుందో.. తెలుసుకునే ప్రయత్నం చేశారా? తెలంగాణలో గతేడాది 131 లక్షల టన్నుల ధాన్యం సేకరించగా.. ఆంధ్రప్రదేశ్ 49 లక్షల టన్నులకే పరిమితమైందని తెలుసా? తెలంగాణలో ధాన్యం సేకరణకు ఏడాదికి 27వేల కోట్లకు పైగా ఖర్చు పెడుతుంటే.. ఆంధ్రప్రదేశ్‌లో 10వేల కోట్లతో కొనేందుకే రైతుల్ని సతాయిస్తున్నారని గుర్తుందా? తేమ, నూకల పేరుతో కొర్రీలు వేస్తూ.. పొమ్మనకుండానే పొగ పెడుతున్నారని అంగీకరిస్తారా?
Under the YCP Rule Grain Farmer Cheated: నాలుగేళ్ల కిందటి వరకు ధాన్యం ఉత్పత్తి, సేకరణలో.. ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. అలాంటిది ఇప్పుడు ఎందుకు వెనకబడిపోతోంది? అసలు ఏపీలో వ్యవసాయం మొదలైందే తాను వచ్చాక అన్నట్లు గప్పాలు కొడుతున్న సీఎం జగన్ వాస్తవాలను ఎందుకు గుర్తించడం లేదు? ఒకవైపు తెలంగాణలో గ్లోబల్ టెండర్లు పిలిచి మరీ ధాన్యం అమ్మేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే 21 లక్షల టన్నులకు టెండర్లు ఆహ్వానించగా.. త్వరలో మరో 25 లక్షల టన్నుల అమ్మకానికి.. ఏర్పాట్లు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పండించిన పంట కొనడానికీ రైతుల్ని వేధిస్తున్నారు. మద్దతు ధరల్లో కోత పెడుతూ రైతుల నుంచి ఎదురు సొమ్ము.. వసూలు చేస్తున్నారు. కావాలనే సేకరణను తగ్గించుకుంటూ ప్రభుత్వంపై భారం పడకుండా చూసుకుంటున్నారు. రైతుల్ని మిల్లర్ల దయాదాక్షిణ్యాలకు వదిలేస్తున్నారు.
Collection of Grain in Rabi Season: ఆంధ్రప్రదేశ్‌లో 2020- 21లో 85 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. 2022- 23లో సేకరించింది 49 లక్షల టన్నులే. అంటే 36 లక్షల టన్నులు తగ్గింది. తద్వారా క్వింటాలుకు మద్దతు ధర ప్రకారం టన్ను 20 వేల 600 చొప్పున 7 వేల 416 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు బాధ్యత నుంచి.. ప్రభుత్వం తప్పించుకుంది. రాష్ట్ర విభజన తర్వాత ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది రబీలో ధాన్యం సేకరణ తగ్గించారు. 2020-21లో 37 లక్షల టన్నులు సేకరించగా గడచిన రబీలో 14 లక్షల టన్నులే తీసుకున్నారు. అంటే 23లక్షల టన్నుల మేర.. సేకరణ తగ్గించారు. అదే తెలంగాణలో గడచిన రబీలో 66 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఏపీలో ఖరీఫ్‌లోనూ సేకరణ తగ్గింది. 2020-21 ఖరీఫ్ సేకరణతో పోలిస్తే.. 12లక్షల టన్నులు తగ్గింది.
గతేడాది ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ధాన్యం ఉత్పత్తిలో సేకరించింది 38.39శాతం మాత్రమే. 2021- 22తో పోలిస్తే 16 శాతం తగ్గింది. అదే తెలంగాణలో ఖరీఫ్, రబీల్లో కలిపి 2022-23లో 48.45శాతం, 2021-22లో 55శాతం, 2020-21లో 64.56శాతం చొప్పున సేకరించారు. వాస్తవానికి 2018-19లో ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం ఉత్పత్తి 123.52 లక్షల టన్నులు ఉండగా. 72 లక్షల టన్నులు సేకరించారు. అదే ఏడాది తెలంగాణలో ఉత్పత్తి కోటి టన్నులే ఉన్నా..సేకరణ 77.46 లక్షల టన్నులు. 2022-23లో ఏపీలో ఉత్పత్తి 129 లక్షల టన్నులు ఉండగా.. తెలంగాణలో 272 లక్షల టన్నులకు పెరిగింది.
YSR Bheema in AP: "మాటలు కట్టిపెట్టి చేతల్లో సాయం చేయండి ముఖ్యమంత్రి గారూ"
Difference Between AP and Telangana in Grain Collection: ప్రభుత్వం కొంటున్నట్లు చెబుతూనే రైతులే వెనక్కి తగ్గేలా చేస్తే.. సర్కారుపై భారం తగ్గుతుంది. అందుకే ప్రభుత్వం రకరకాల నిబంధనలు పెట్టి రైతులను సతాయిస్తోంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా సేకరిస్తున్నామని.. కొత్త విధానం అమలు చేస్తున్నామని చెబుతోంది. ఈ విధానంతో ఇబ్బందులు పడుతున్నామని.. అన్నదాతలు వాపోతున్నా పట్టించుకోవడంలేదు. తేమ ఎక్కువగా ఉందని, నూకశాతం పెరుగుతోందంటూ.. ధరలో కోత పెడుతున్నా ప్రభుత్వం ప్రేక్షకపాత్రకే పరిమితమవుతోంది. వేధింపుల్ని భరించలేక రైతులు తక్కువ ధరకే.. వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. పెత్తనమంతా మిల్లర్లదే.. వారు చెప్పిందే ధర.. రైతుల నుంచి క్వింటాలుకు 200-300 వరకు ఎదురు సొమ్ము తీసుకుని మద్దతు ధరపై కొన్నట్లు కాగితాల్లో చూపిస్తున్నారు. మిల్లరు సరే అన్నాకే.. ఆర్‌బీకేల్లో రైతుల పేరుతో నమోదు చేస్తారు. ఎదురు సొమ్ము తీసుకుంటున్న విషయం.. ప్రభుత్వానికి తెలిసినా.. మిల్లర్లకే వత్తాసు పలుకుతోంది. తేమ, నూక ఎక్కువగా ఉంటే వారు మాత్రం ఎలా తీసుకుంటారని కొందరు అధికారులే వెనకేసుకొస్తున్నారు.
CM Announcement to Buy Grain in AP: తడిసిన, మొలకలొచ్చిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొంటామని ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు ప్రకటిస్తారు.. కానీ క్షేత్రస్థాయిలో రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. క్వింటాలు ధాన్యానికి 10-12 కిలోల వరకు తూకం తగ్గించి తీసుకుంటున్నారు. ధాన్యం సేకరణకు వారాల తరబడి సతాయిస్తున్నారు. రైతుల చేతికి ధాన్యం వచ్చేనాటికే కేంద్రాలు తెరవాల్సి ఉన్నా తీరిగ్గా నెల తర్వాత సేకరణ ప్రారంభిస్తున్నారు. లక్ష్యం పూర్తైందని అరకొర సేకరణతో ముగిస్తున్నారు. ఈ ఏడాది శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో సంక్రాంతికే ఖరీఫ్ సేకరణ ముగించారు. రైతులు ఆందోళన చేయడంతో కొన్నాళ్ల తర్వాత మళ్లీ ప్రారంభించినా నామమాత్రంగానే సేకరించారు. దీంతో పలువురు రైతులు తక్కువ ధరకే వ్యాపారులకు అమ్ముకున్నారు.
Farmers Agitation: పరిహారం కోసం రోడ్డెక్కిన రైతన్నలు.. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళన
AP, Kerala Governments Agreement on Grain Export: ఏపీలో రైస్‌మిల్లర్ల సంఘం నేతల చేతిలోనే పౌరసరఫరాల శాఖను పెట్టారు. వారు చెప్పినట్లే నడిపిస్తున్నారు. కేరళలో బొండాల రకం ధాన్యానికి అధిక డిమాండు ఉంది. దీన్ని ఆంధ్రప్రదేశ్‌లో అధికంగా పండిస్తారు. ఐతే గత కొన్నేళ్లుగా సేకరణ సరిగా లేకపోవడంతో కేరళకు సరఫరా కావట్లేదు. దీంతో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి.. అదే పేరుతో కేరళకు సరఫరా చేస్తున్నారు. అది నాణ్యంగా లేదని కేరళ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నుంచి దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. అక్కడి వ్యవసాయశాఖ మంత్రి, అధికారుల బృందం విజయవాడ వచ్చి చర్చించింది. తర్వాత మంత్రి కారుమూరి, అధికారులు తిరువనంతపురం వెళ్లారు.
బియ్యం, పప్పుధాన్యాల ఎగుమతులపై ఒప్పందం కుదిరినట్లు ప్రకటించారు. దీంతో బొండాల రకం ధాన్యాన్ని కొంటారనే ఆలోచనతో రైతులు పెద్ద ఎత్తున సాగుచేశారు. తీరా పంట చేతికొచ్చాక సేకరణ సమయానికి కేరళతో ఒప్పందం ఊసే లేదు. అదేమంటే ఎఫ్‌సీఐ కొంటుందన్నారు. దీంతో రైతులు చేసేది లేక వ్యాపారులకే అమ్ముకున్నారు. కేరళలో బొండాల రకం ధాన్యానికి డిమాండు పెరగడంతో మిల్లర్ల దగ్గరున్న ధాన్యానికి రేటు పెరిగింది. మిల్లర్ల ఒత్తిడితోనే ప్రభుత్వం కేరళకు బియ్యం ఎగుమతుల్లో వెనక్కి తగ్గిందని రైతులు మండిపడుతున్నారు.