గుంటూరు జిల్లాలో కల్తీ మద్యం గుట్టురట్టయింది. వెల్దుర్తి మండలంలోని ఉప్పలపాడు, గుండ్లపాడులో భూమిలో దాచిపెట్టిన 16వేల మద్యం సీసాలను ఎస్ఈబీ అధికారులు, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన కల్తీ మద్యం విలువ 37 లక్షల రూపాయలు ఉంటుందని అధికారుల అంచనా. కల్తీ మద్యం తయారీ, అక్రమ రవాణా, విక్రయాలు జరిపిన మొత్తం 19 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ వెల్లడించారు.
ట్యాంకుల నుంచి దోచి.. మన్నులో దాచి
కర్ణాటకలోని బెల్గాం, గోవా, మహారాష్ట్రలో అనుమతి పొందిన మద్యం తయారీ డిస్టలరీలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్(మద్యం తయారీకీ వాడే ముడిసరకు)ను నిందితులు అపహరిస్తారు. అనంతరం కర్ణాటక, మధ్యప్రదేశ్ కేంద్రంగా కల్తీ మద్యాన్ని తయారు చేస్తారు. పేరున్న కంపెనీల మూతలు, స్టిక్కర్లతో బాటిళ్లను తయారు చేసి అందులో కల్తీ మద్యాన్ని నింపుతారు. ఆ తరువాత వాటిని గుంటూరు జిల్లాతో పాటు వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తారని ఎస్పీ విశాల్ గున్నీ వివరించారు. ఈ కేసులో గుంటూరు జిల్లా ఉప్పలపాడు, గుండ్లపాడుకు చెందిన 12 మంది, తెలంగాణకు చెందిన ముగ్గురు, మధ్యప్రదేశ్ చెందిన ఇద్దరు, కర్ణాటక నుంచి ఒకరు చొప్పున నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. 20 రోజులపాటు శ్రమించి కేసును ఛేదించిన ఎస్ఈబీ, పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ విశాల్ గున్నీ అభినందించి రివార్డులు అందజేశారు
ఇదీ చదవండి