రాష్ట్రంలో అక్షరాస్యతకు సంబంధించి ఇంటింటి సర్వేకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రయోగాత్మకంగా ఇప్పటికే చేపట్టిన వివిధ ప్రాంతాల్లో సర్వేఫలితాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేపట్టేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపింది. త్వరలో వీటికి ఆమోదం లభించనుంది. ఈ-ప్రగతి, గ్రామ, వార్డు సచివాలయాలు, పాఠశాల, ఉన్నత విద్యాశాఖల సహకారంతో ఈ సర్వేను నిర్వహించనున్నారు. ఇందుకు ప్రత్యేకంగా యాప్‌ను సిద్ధం చేశారు. కరోనా ప్రభావం తగ్గితే ఆగస్టు 15 తర్వాత నుంచి సర్వే చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. గ్రామ, వార్డు వాలంటీర్లతో ట్యాబ్‌ల ద్వారా ఈ సర్వే చేపట్టనున్నారు. వీరు చేసే సర్వే సమగ్ర వస్తుందో.. లేదో పరిశీలించే బాధ్యతలను ఉపాధ్యాయులు, అధ్యాపకులకు అప్పగించనున్నారు.
పిల్లలు ఏం చదవాలనుకుంటున్నారో తెలుసుకోవడం కోసం
ఇంటింటికి నిర్వహించే సర్వేలో సుమారు 20 అంశాలపై వివరాలు సేకరించనున్నారు. కుటుంబసభ్యుల అందరి వివరాలను తీసుకుంటారు. ఏం చదువుకున్నారు? ఎక్కడితో చదువు ఆపేశారు? అవకాశం ఉంటే మళ్లీ చదువు కొనసాగిస్తారా? చదవడం, రాయడం వచ్చా? పది, ఇంటర్ చదివే పిల్లలు ఉంటే వారు భవిష్యత్తులో ఏం చదవాలనుకుంటున్నారు? నైపుణ్య శిక్షణ అవసరమా? ఇలాంటి వివరాలను సేకరిస్తారు. దీంతో ఉన్నత విద్యలో తీసుకోవాల్సిన మార్పులపై స్పష్టత వస్తుందని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. పిల్లలు ఏం చదవాలనుకుంటున్నారో తెలిస్తే అందుకు అనుగుణంగా కోర్సులను రూపొందించవచ్చని ఆలోచిస్తోంది.
18-23 వయస్సులో ఉన్న వారి విద్యార్హతల కోసం
చదువులు మధ్యలో నిలిపివేయడానికి కారణాలు, అక్షరాస్యులు ఎంత మంది ఉన్నారో తెలుసుకునే అవకాశం లభిస్తుంది. ఇప్పటి వరకు యువత ఉన్నత విద్యలో ఎలాంటి మార్పులు కోరుకుంటుందో తెలియడం లేదు. ఉన్నత విద్యాసంస్థలు తమకు తోచిన రీతిలో కోర్సులను ప్రవేశపెడుతున్నాయి. కొన్నింటికి ఆదరణ లభించడం లేదు. 18-23 వయస్సులో ఉన్న వారి విద్యార్హతలు ఎలా ఉన్నాయో విశ్లేషణ చేయనున్నారు.
ఇదీ చూడండి.