High Court Stay on R5 Zone: పేదలకు ఇళ్ల నిర్మాణం ముసుగులో.. అమరావతి రాజధాని బృహత్ ప్రణాళికను విచ్ఛిన్నం చేయాలన్న వైకాపా సర్కార్ అత్యుత్సాహానికి.. హైకోర్టు తాత్కాలిక బ్రేకులు వేసింది. హైకోర్టులో.. అమరావతి రైతుల పిటిషన్ పెండింగ్‌లో ఉందని తెలిసీ ఆగమేఘాలమీద సీఎం జగన్ శంకుస్థాపన చేసిన ఇళ్ల నిర్మాణాలపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం స్టే విధించింది. సంపద సృష్టించే.. ఆర్-5 జోన్‌లో ప్రభుత్వం తలపెట్టిన ఇళ్ల నిర్మాణం ఆపాలని.. ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి నిర్మాణం కోసం ఇచ్చిన భూములను.. రాజధానేతరులకు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ.. రాజధాని ప్రాంత రైతు సంక్షేమ సంఘాలతోపాటు.. మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లపై ఇటీవలే విచారణ పూర్తి చేసిన హైకోర్టు.. తీర్పును వెలువరించింది. ఆర్5 జోన్‌లో ఇళ్ల పట్టాల చెల్లుబాటు ఉన్నత న్యాయస్థానాల తుది తీర్పునకు లోబడే ఉంటుందనే నిబంధన ఉంచారని.. దీన్ని బట్టి చూస్తే..కోర్టు తీర్పు తర్వాతే చెల్లుబాటు అవుందనే విషయం ప్రభుత్వానికి ముందే తెలుసని.. ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఈ విషయంలో.. డ్రాఫ్టింగ్‌లో లోపం ఉందన్న ప్రభుత్వ వాదన సహేతుకం కాదని స్పష్టం చేసింది. ఆర్-5 జోన్‌లో.. ఇళ్ల పంపిణీ అనేది పూర్తి స్థాయి చర్చ, విచారణ జరగాల్సిన అంశమని.. తెలిపింది. ఈ దశలో ఇళ్ల నిర్మాణం పూర్తయితే సరిదిద్దలేని నష్టంగా మారుతుందని.. తుది తీర్పు వెలువడే వరకు ఇళ్ల నిర్మాణం నిలుపుదల చేస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని అభివృద్ధి, భూములిచ్చిన రైతుల ప్రయోజనాలతో.. తీర్పు ముడిపడి ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. విశాల ప్రయోజనాలను.. దృష్టిలో పెట్టుకుని ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై స్టే విధిస్తున్నట్లు తీర్పులో స్పష్టంచేసింది.
నిజానికి ఇళ్ల నిర్మాణ వ్యవహారం కోర్టు పరిధిలో ఉండగానే.. ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లింది. తుది తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే.. జరిగే వృథాకు బాధ్యులెవరని.. తీర్పు రిజర్వ్ చేసే ముందే హైకోర్టు ప్రశ్నించింది. కానీ.. ఇవేమీ లెక్కపెట్టిని జగన్..గత నెల 24వ తేదీన.. కృష్ణాయపాలెంలో ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. 50 వేల ఇళ్లను ఉచితంగా నిర్మించి ఇస్తామని.. ఆర్భాటం చేశారు. ఇప్పటికే అక్కడ ముళ్లపొదలు తొలగించడానికి.. రోడ్ల నిర్మాణానికి దాదాపు 60 కోట్ల రూపాయాలకుపైగా.. ప్రభుత్వం ఖర్చుచేసింది. ఇప్పుడు నిర్మాణాలు ఆపేయాలని హైకోర్టు ఆదేశించడంతో.. ఈ ప్రజాధనం దుర్వినియోగానికి బాధ్యులెవరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
"ఈ భూములలో ఇళ్ల నిర్మాణం కోర్టు పరిధిలోనిది అని.. పట్టాలు ఇచ్చేటప్పుడే రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. అయినా సరే ప్రభుత్వం ప్రజలను మోసం చేసి.. రాజకీయ స్వప్రయోజనాల కోసం పట్టాలు ఇచ్చింది. ప్రభుత్వానికి ఎవరికీ మంచి చేసే ఆలోచన లేదు". - ఇంద్రనీల్‌బాబు, న్యాయవాది
"ఇళ్ల నిర్మాణం కూడా రాజధాని అభివృద్ధిలో భాగమేనని ప్రభుత్వం అంటోంది. కానీ ప్రభుత్వానికి పేదల ప్రయోజనాలు అవసరం లేదు.. రాజధానిని అభివృద్ధి చేసే ఆలోచన లేదు. అమరావతి అభివృద్ధిని ముందుకు పోకుండా చేసి.. కక్ష పూరితంగా ప్రభుత్వం చేస్తోంది". - సుంకర రాజేంద్రప్రసాద్, న్యాయవాది