HC On Telugu Language: రాష్ట్రంలో తెలుగు అమలు విషయంలో భాషాభివృద్ధి సంస్థ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో పరిశీలిస్తామని హైకోర్టు పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు, ఉత్తర్వులు తెలుగులో జరిగేలా సర్కారును ఆదేశించాలని కోరుతూ డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ 2021లో హైకోర్టులో పిల్ వేశారు. మంగళవారం జరిగిన విచారణలో ప్రభుత్వ న్యాయవాది (జీపీ) వాదనలు వినిపిస్తూ.. తెలుగు అమలు తీరుపై క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించి కోర్టుకు నివేదించామని చెప్పారు. పిటిషనర్ తరఫున న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌బాబు వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం కోర్టు ముందుంచిన వివరాలను పరిశీలిస్తే 50 శాతం మాత్రమే తెలుగు అమలు అవుతోందన్నారు. కోర్టు జోక్యం తర్వాతే ప్రభుత్వం తెలుగు భాషాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. తెలుగు భాషాభివృద్ధి సంస్థను ప్రతివాదుల జాబితాలో చేర్చాలని ఆదేశించింది. ఆ సంస్థ పనితీరు సంతృప్తికరంగా లేకపోతే తగిన ఆదేశాలిస్తామని స్పష్టం చేసింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
ఇవీ చదవండి: