High Court on Red Sandal Smuggling: అటవీ సంపదను కొల్లగొట్టి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో దర్యాప్తు ఆలస్యంపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. నిందితులపై కేసులు నమోదు చేసి సంవత్సరాలు గడుస్తున్నా పురోగతి లేదని, అభియోగపత్రాలు దాఖలు చేయడం లేదని తీవ్రంగా ఆక్షేపించింది. స్మగ్లర్లపై కేసులు నమోదు చేసి వదిలేస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఎర్రచందనం, గంధం, ఇతర అటవీ ఉత్పత్తుల అక్రమ రవాణా ప్రభుత్వ ఆదాయానికి తీవ్ర నష్టం కలిగిస్తోందని తెలిపింది. దర్యాప్తులో పురోగతి లేకపోవడంతో స్మగ్లర్లు సమాజంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారని పేర్కొంది.
దర్యాప్తులో జాప్యం స్మగ్లరకు శాపం: దర్యాప్తులో జాప్యంతో నేరగాళ్లకు ఎలాంటి భయం లేకుండా పోయిందని, మళ్లీ మళ్లీ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆగ్రహించింది. దర్యాప్తులో జాప్యం స్మగ్లర్లకు వరంగా మారిందని పేర్కొంది. అసాధారణ జాప్యం ఆందోళనకు గురి చేస్తోందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుల్లో లోతైన దర్యాప్తు అవసరం అని స్పష్టం చేసింది. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు నిర్వహించాలని తేల్చి చెప్పింది.
అటవీ ఉత్పత్తుల కేసులు, ఎర్రచందనం, గంధం తదితర కేసుల్లో రాష్ట్రంలోని అందరు అటవీశాఖ అధికారులు, పోలీసు యంత్రాంగం, ఆయా జిల్లా ప్రధాన న్యాయమూర్తులు(పీడీజే).. సిట్‌కు బేషరతుగా సహకరించాలని స్పష్టం చేసింది. 2001 జనవరి 1 నుంచి ఇప్పటి వరకు నమోదైన కేసులకు సంబంధించిన వివరాలతోపాటు ఆయా కేసుల పురోగతిని తమ ముందు ఉంచాలని సిట్‌ను ఆదేశించింది. నిందితులతో అధికారులు కుమ్మక్కు అయ్యారా?, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నారా? తదితర వివరాలన్ని బయటకు రావాలంటే సిట్‌తో విచారణ అవసరం అని అభిప్రాయపడింది.
సిట్ ఏర్పాటుకు ఆదేశాలు: ఈ నేపథ్యంలోనే కేంద్ర పర్యావరణ, అటవీశాఖ ద్వారా సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. సిట్‌ను ఏర్పాటు చేయాలని అటవీశాఖ కార్యదర్శిని ఆదేశించింది. ఈ సిట్‌కు సివిల్ కోర్టుకు ఉండే అధికారాలుంటాయని, వ్యక్తులకు సమన్లు జారీ చేయవచ్చని, రికార్డులు సమర్పించాలని ఆదేశించవచ్చని, వాంగ్మూలాలు నమోదు చేసే అధికారం ఉంటుందని పేర్కొంది. 12 వారాల్లో కేంద్ర అటవీశాఖ కార్యదర్శి ద్వారా నివేదిక సమర్పించాలని సిట్‌ను న్యాయస్థానం ఆదేశించింది. సుమోటోగా నమోదు చేసిన వ్యాజ్యంలో.. కేంద్ర అటవీశాఖ కార్యదర్శి, రాష్ట్ర అటవీశాఖ ముఖ్య కార్యదర్శి, అటవీశాఖ ప్రధాన సంరక్షకుడు, అన్ని జిల్లాల డీఎఫ్‌వోలు, ఎస్పీలను ప్రతివాదులుగా చేర్చాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 6కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఈనెల 15న ఈమేరకు కీలక తీర్పు ఇచ్చారు.