దళితుల స్వాధీనంలో ఉన్న భూమిలో అక్రమ మైనింగ్ జరుపుతున్నారన్న కేసులో వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, రేపల్లె మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని హైకోర్టు న్యాయవాది అరుణ్ సౌరీ గుంటూరులో తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ..గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం ఓలేరు గ్రామంలో దళితులకు చెందిన ది ఆది ఆంధ్ర టెనెంట్స్ కోఆపరేషన్ సోసైటికి 1924 నుంచి ఆర్.ఎస్ నెంబర్లోని 580 లో భూమి ఉందని...అందులో దళితులు గడ్డి వేసుకుని జీవనం సాగిస్తున్నారన్నారు. అయితే అధికార పార్టీ నేతలు వేమూరు ఎమ్మెల్యే నాగార్జున, రేపల్లె మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు ఆధ్వర్యంలో అక్రమంగా ఇసుక, మట్టి తరలిస్తున్నారని తెలిపారు. సోసైటీ ప్రెసిడెంట్, సభ్యులు..దీనిపై అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. అందుకే దీనిపై సొసైటీ ప్రెసిడెంట్ మేరుగ దేవదానం, బుస్సా సుగుణ రాజు తరుపున రిట్ పిటిషన్ వేసినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం తరపు నుంచి రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు చెప్పినట్లు న్యాయవాది తెలిపారు.
ఇదీ చదవండి