HC ON NARAYANA : రాజధాని అమరావతి ప్రాంతంలో అసైన్డ్ భూముల కొనుగోలు ఆరోపణల వ్యవహారంలో.. మాజీ మంత్రి నారాయణపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. 41ఏ నిబంధనలు అనుసరించాలని సీఐడీకి స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. రాజధాని ప్రాంతంలో అసైన్డ్ భూములు కొనుగోలు చేశారనే ఆరోపణలతో.. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2020లో సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో నారాయణ పిటిషన్ దాఖలు చేశారు.
అసలేం జరిగింది: అమరావతి రాజధాని పరిధిలో అసైన్డ్ భూములను మాజీ మంత్రి నారాయణ తన బంధువులు, అనుచరులతో అక్రమంగా కొనిపించారన్న ఆరోపణలతో నమోదైన కేసులో 2022 సెప్టెంబర్ 14న సీఐడీ అధికారులు ఐదుగురిని అరెస్టు చేశారు. రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఉద్యోగులు గట్టెం వెంకటేశ్, కొల్లి శివరామ్‌తో పాటు వైజాగ్‌కు చెందిన బడే ఆంజనేయులు, చిక్కాల విజయసారథి, కొట్టి కృష్ణ దొరబాబును అదుపులోకి తీసుకున్నారు. వీరిలో శివరామ్, వెంకటేశ్‌లను న్యాయస్థానంలో హాజరుపర్చారు. అయితే ఆ ఇద్దరిని జ్యుడిషియల్ రిమాండుకు ఇవ్వాలన్న సీఐడీ అభ్యర్థనను ప్రత్యేక కోర్టు జడ్జ్ తిరస్కరించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెదపాలేనికి చెందిన యలమటి ప్రసాద్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదుపై 2020లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో వారిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు.
మాజీ మంత్రి నారాయణ, ఆయన కుటుంబసభ్యులు.. రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అంజనీకుమార్‌తో కలిసి ఈ కుట్రకు పాల్పడినట్లు తమ దర్యాప్తులో తేలిందని సీఐడీ స్పష్టం చేసింది. భూ సమీకరణ పథకంలో భాగంగా అసైన్డ్ భూములకు ప్రభుత్వం పరిహారం చెల్లించదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు, మధ్యవర్తులు, స్థిరాస్తి వ్యాపార ఏజెంట్లతో బెదిరించి.. నారాయణ, అతని అనుచరులు నిర్ణయించిన ధరకే రైతులు అమ్ముకునేలా చేశారని తమ దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిపారు. రాజధాని ప్రాంతంలో 1,100 ఎకరాల అసైన్డ్ భూముల్లో అక్రమ లావాదేవీలు చోటుచేసుకున్నాయని పేర్కొంది. 169.27 ఎకరాల అసైన్డ్ భూములకు సంబంధించి నారాయణ, ఆయన కుటుంబసభ్యులు, రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య 15 కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు నడిచినట్లు తమ విచారణలో వెల్లడైనట్లు తెలిపారు.
ఇవీ చదవండి: