Keshav security Issue : టీడీపీ సీనియర్ నేత, పబ్లిక్ అకౌంట్స్ ఛైర్మన్ పయ్యావుల కేశవ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. తొలగించిన భద్రతను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. ఐదు లేదా ఆరుగురు భద్రత సిబ్బంది పేర్లను న్యాయస్థానం ముందు ఉంచాలని పిటిషనర్‌కు సూచించింది. అందులో ఇద్దరి పేర్లను భద్రత సిబ్బందిగా నియమించేలా ఆదేశిస్తామని తెలిపింది. పోలీసు భద్రత కుదించడంపై వివరణ ఇస్తూ కౌంటర్ దాఖలు చేయాలని హోంశాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించింది. విచారణను గురువారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి ఈమేరకు ఆదేశాలిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తనకు పోలీసు భద్రతను తొలగించడాన్ని సవాలు చేస్తూ టీడీపీ సీనియర్ నేత, ఉరవకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ హైకోర్టును ఆశ్రయించారు. 2+2 భద్రతను పునరుద్ధరించేలా ఆదేశించాలని కోరారు.
జరిగిన విచారణలో పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2+2గా ఉన్న భద్రతను 1+1కి కుదించిందన్నారు. తర్వాత పూర్తిగా తొలగించిందన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై గొంతెత్తకుండా చేసేందుకు ప్రయత్నం చేస్తోందన్నారు. భద్రతను తొలగించడంతో పిటిషనర్ ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందన్నారు. పిటిషనర్‌కు కల్పించిన భద్రతను ఉద్దేశపూర్వకంగా ఎప్పటికప్పుడు మారుస్తున్నారన్నారు. గతంలో పనిచేసిన సిబ్బందిని కొనసాగించేలా ఆదేశించాలని కోరారు. సిబ్బందిని తొలగించలేదని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్ వాదనలు వినిపించారు. ఒక సిబ్బందిని మార్చామన్న కారణంతో మరోకరిని పిటిషనర్ వెనక్కి పంపించామన్నారు. పిటిషనర్ కోరిన విధంగా అంగీకరిస్తే.. ఫలానా వారిని సెక్యూరిటీగా పంపాలని ప్రతి ఒక్కరూ కోరుతారన్నారు. ఆ వాదనలపై న్యాయమూర్తి స్పందిస్తూ.. ఆ ప్రాంతంలో పరిస్థితులపై తనకు అవగాహన ఉందన్నారు. సెక్యూరిటీ సిబ్బందిపై ప్రజాప్రతినిధులకు నమ్మకం లేకపోతే స్వేచ్ఛగా తిరగలేరన్నారు. ఐదారు పేర్లు కోర్టు ముందు ఉంచితే వారిలో ఇద్దరిని నియమిస్తామని పిటిషనర్‌కు తెలియజేశారు. విచారణను వాయిదా వేశారు.
ఇవీ చదవండి: