High Court: ఉపాధ్యాయుల బదిలీ మార్గదర్శకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం డిసెంబర్ 10న జారీ చేసిన జీవో 187ను ఉపసంహరించుకున్నాం అని ప్రభుత్వ న్యాయవాది వీకే నాయుడు హైకోర్టుకు నివేదించారు. ఇందుకు సంబంధించిన మెమోను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం సమర్పించిన వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్.. తగిన ఉత్తర్వులిచ్చేందుకు వ్యాజ్యాలపై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.
జీవో 187లోని మారదర్శకాలు లోపభూయిష్ఠంగా ఉన్నాయని పేర్కొంటూ పలువురు ఉపాధ్యాయులు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. వాటిపై గత ఏడాది డిసెంబర్ 26న విచారణ జరిపిన హైకోర్టు.. బదిలీ మారదర్శకాలు సక్రమంగా లేవని ప్రాథమికంగా అభిప్రాయపడింది. యాంత్రికంగా మార్గదర్శకాలిచ్చినట్లుందని పేర్కొంది. తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు తుది జాబితా వెల్లడించవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. తాజాగా ఈ వ్యాజ్యాలు విచారణకు రాగా.. జీవోను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు నివేదించారు.
మళ్లీ రూపొందిస్తాం: 2022-23 విద్యా సంవత్సరానికి ఏప్రిల్ 30 చివరి పనిదినమని.. 2023-24 విద్యా సంవత్సరానికి పాఠశాలలు జూన్ 12న తిరిగి ప్రారంభం అవుతాయని కోర్టు ముందు ఉంచిన మెమోలో పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ జీవో 187, తదనంతరం జారీ చేసిన సవరణలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించిందని స్పష్టం చేసింది. ఉపాధ్యాయుల బదిలీ మార్గదర్శకాలు మళ్లీ రూపొందిస్తామని కోర్టుకు నివేదించింది.
హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ: మరోవైపు తిరుమల శ్రీవారి ప్రొటోకాల్ దర్శనానికి తనతో వచ్చిన భక్తుల ఆధార్ గుర్తింపు కార్డులను మార్చడంతో పాటు నగదును తీసుకున్నానన్న ఆరోపణతో తిరుమల రెండో పట్టణ ఠాణాలో తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ బీఎస్ భానుమతి విచారణ జరిపారు. తదుపరి వాదనలు వినేందుకు విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. న్యాయవాది నర్రా శ్రీనివాసరావు ఎమ్మెల్సీ తరఫున వాదనలు వినిపించారు.
ఎమ్మెల్సీకి వ్యక్తిగత సహాయకుడిగా పేర్కొంటున్న మొదటి నిందితుడు వేణు గోపాల్, డ్రైవర్‌గా పేర్కొంటున్న రెండో నిందితుడు డేగరాజు.. ప్రస్తుతం ఎమ్మెల్సీ వద్ద పని చేయడం లేదన్నారు. సదుద్దేశంతో భక్తులకు దర్శనం నిమిత్తం టీటీడీ అధికారులకు సమాచారం మాత్రమే ఇచ్చారన్నారు. ఆధార్ కార్డుల్లో అడ్రస్‌ను తప్పుగా పేర్కొన్నారన్న ఆరోపణలకు పిటిషనర్‌కు సంబంధం లేదన్నారు. పోలీసుల తరఫున సహాయ పీపీ వెంకట కుమార్ వాదనలు వినిపించారు. ఈ వ్యవహారంలో రూ.1.07లక్షలు చేతులు మారినట్లుగా తేలిందన్నారు. పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కావాలన్నారు. దీంతో విచారణ శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.
ఇవీ చదవండి: