High Court Comments on Passport Issuance: క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నా ఎన్వోసి లేకుండా తమకు పాస్‌పోర్టు జారీ చేసేలా ఆదేశించాలంటూ పలువురు చేసిన అభ్యర్ధనను హైకోర్టు తిరస్కరించింది. ఎన్వోసి వచ్చిన తర్వాతే పాస్ పోర్ట్ పునరుద్ధరణను పరిగణలోకి తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. న్యాయస్థానం అనుమతి ఉత్తర్వులిచ్చాక కూడా కేసు పెండింగ్‌లో ఉందని పాస్ పోర్టును పునరుద్ధరణ చేయకుండా ఉండటానికి వీల్లేదని న్యాయస్థానం తేల్చి చెప్పింది.
క్రిమినల్ కేసు పెండింగ్‌లో ఉన్నా.. సంబంధిత కోర్టు నుంచి నిరభ్యంతర పత్రం సమర్పించాల్సిన అవసరం లేకుండానే పాస్‌పోర్టును పునరుద్ధరించేలా పాస్‌పోర్టు అధికారులను ఆదేశించాలని పిటిషనర్లు చేసిన అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. విచారణ కోర్టు ఇచ్చిన ఎన్‌వోసీ/అనుమతి ఉత్తర్వులను సమర్పించిన తరువాతే పిటిషనర్ల పాస్‌పోర్టును పునరుద్ధరించే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సంబంధిత ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారులను ఆదేశించింది.
మరోవైపు న్యాయస్థానం అనుమతి ఇచ్చాక కూడా కోర్టులో క్రిమినల్ కేసు పెండింగ్‌లో ఉందనే ఒక్క కారణంతో పాస్‌పోర్టును పునరుద్ధరించకుండా ఉండటానికి వీల్లేదని తేల్చిచెప్పింది. ఇప్పటికే భారతదేశం నుంచి విదేశాలకు వెళ్లిన పిటిషనర్లు, లేదా విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వారు ఎన్‌వోసీ కోసం క్రిమినల్ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. ఆయా కేసులోని పరిస్థితులు పరిగణనలోకి తీసుకొని చట్ట నిబంధనల మేరకు తగిన ఉత్తర్వులివ్వాలని విచారణ కోర్టులను ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరీ ఇటీవల ఈ విధంగా తీర్పు ఇచ్చారు.
క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, సంబంధిత కోర్టు నుంచి ఎన్‌వోసీ తీసుకురావాలని తదితర కారణాలతో పాస్ పోర్టులను రెన్యువల్ చేయక పోవడాన్ని సవాలు చేస్తూ పలువురు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. పాస్‌పోర్టు మొదటిసారి జారీచేసే సమయంలోనే క్రిమినల్ కేసులను పరిగణనలోకి తీసుకోవాలి తప్ప.. రెన్యువల్ విషయంలో కాదని పిటీషనర్ల తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. ఎన్‌వోసీ కోసం బలవతంపెట్టకుండా రెన్యువల్ చేసేలా ఆదేశించాలని కోరారు.
పాస్‌పోర్టు చట్టంలోని సెక్షన్లు 5, 6(2) ప్రకారం క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉంటే పునరుద్ధరణను తిరస్కరించవచ్చని పాస్ పోర్ట్ అధికారుల తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. దేశం విడిచి వెళ్లేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని కోర్టు నుంచి ఎన్‌వోసీ తెస్తే పునరుద్ధరణను పరిశీలిస్తారన్నారు. పాస్‌పోర్టు చట్టం సెక్షన్లు 5, 6(2) ప్రకారం రెన్యువల్ విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం పాస్‌పోర్టు అధికారులకు ఉందన్నారు.
ఇరువైపు వాదనలు విన్న న్యాయమూర్తి.. కేంద్ర ప్రభుత్వం 1993 ఆగస్టులో జారీచేసిన నోటిఫికేషన్ ప్రకారం.. సంబంధిత కోర్టు నుంచి అనుమతి ఉత్తర్వులు/ఎన్‌వోసీ తెచ్చుకుంటేనే పాస్‌పోర్టు రెన్యువల్ తిరస్కరణకు గురికాకుండా మినహాయింపు ఉందని తెలిపారు. పాస్‌పోర్టు మొదటిసారి జారీ విషయంలో ఉన్న అధికారాలే.. రెన్యువల్ విషయంలోనూ ఉంటాయన్నారు. ఎన్‌వోసీ లేకుంటే రెన్యువల్‌ను తిరస్కరించే అధికారం పాస్‌పోర్టు అధికారులకు ఉంటుందని స్పష్టంచేశారు. వ్యాజ్యాలను పరిష్కరించారు.
ఇవీ చదవండి: