High Court Comments on Volunteer Duties: హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. వాలంటీర్ల విధుల విషయంలో మరో సారి చురకలు అంటించింది. వాలంటీర్ల విధుల విషయంలో తాము కోరిన వివరాలను గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సీఈవో ఇంతియాజ్ కోర్టు ముందు సమగ్రంగా ఉంచలేదని హైకోర్టు ఆక్షేపించింది. పూర్తి వివరాలతో మెరుగైన అఫిడవిట్ వేయాలని ఆదేశించింది. ప్రభుత్వ శాఖలు, అధికారులు ఉండగా సామాజిక సేవ కోసం నియమించుకున్న వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల వివరాలు ఏవిధంగా సేకరిస్తారు, అందుకు ఏ చట్టంలోని నిబంధనలు అనుమతిస్తున్నాయో స్పష్టత ఇవ్వాలని మరోసారి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ అధికారులతో చేయించాల్సిన పనులను వాలంటీర్ల ద్వారా ఎందుకు చేయిస్తున్నారని ప్రశ్నించింది. లబ్ధిదారుల ఎంపికతో అసలు వారికేం సంబంధమని ఘాటుగా వ్యాఖ్యానించింది. వాలంటీర్లకు జవాబుదారీతనం ఏముంటుందని పునరుద్ఘాటించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఆదేశాలిచ్చారు.
వైఎస్సార్ చేయూత పథకం కింద గతంలో లబ్ధిదారులగా ప్రయోజనం పొందాము కాని ఇప్పుడు వారికి వ్యతిరేకంగా ఉంటున్నామని కొన్ని కారణాలు చూపి కొందరు రాజకీయ నాయకులు రాజకీయ కారణాలతో తమను అనర్హులగా పేర్కొంటూ ప్రభుత్వ పథకాల నుంచి తొలగించారని పేర్కొంటూ గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం గారపాడు గ్రామానికి చెందిన ఆర్ వసంతలక్ష్మి మరో 26 మంది కలిసి హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. లబ్ధిదారులను గుర్తించే పని ప్రభుత్వ శాఖలు, అధికారులదైతే.. ఆ బాధ్యతను వాలంటీర్లకు అప్పగించడంపై ఆశ్ఛర్యం వ్యక్తం చేసింది. వాలంటీర్ల చేతిలోకి లబ్ధిదారుల వ్యక్తిగత సమాచారం వెళ్లాక అది దుర్వినియోగం అయితే పరిస్థితి ఏమిటని దానికి ఎవరు బాద్యత వహిస్తారు అని ఆందోళన వ్యక్తం చేసింది. వాలంటీర్ల విధులపై స్పష్టత ఇస్తూ మెరుగైన అఫిడవిట్ వేయాలని సెర్ప్ సీఈవోను హాకోర్టు ఆదేశించింది. తాజాగా జరిగిన విచారణలో పిటిషనర్ల తరపున న్యాయవాది జి అరుణ్‌శౌరి వాదనలు వినిపించారు. న్యాయస్థానం కోరిన వివరాలు సెర్ప్ సీఈవో తాజాగా వేసిన అఫిడవిట్లో లేవని అన్నారు. వాలంటీర్లు సమాచారాన్ని సేకరించి సచివాలయ సిబ్బందికి.. ఇస్తారన్నారు అని సెర్ఫ్ సీఈవో తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. లబ్ధిదారుల ఎంపికలో వారి పాత్ర ఏమీ ఉండదనీ ఆ పని అంతా సచివాలయ సిబ్బంది చూసుకుంటారు అని అన్నారు. సీఈవో వేసిన అఫిడవిట్‌పై న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. కొంచెం మెరుగైన అఫిడవిట్ వేయాలని ఆదేశించారు.
ఇవీ చదవండి :