High Court Angry on Electrical Officials in Contempt of Court: కోర్టు ధిక్కరణ కేసులో నెల రోజుల జైలు శిక్ష అనుభవించేందుకు.. తగిన చర్యలు తీసుకునేందుకు వీలుగా రిజిస్ట్రార్ జ్యూడీషియల్ ముందు లొంగిపోవాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడకపోవడంపై ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీ సంతోషరావు, ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ పూర్వ సీఎండీ బి.శ్రీధర్ పై హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను గౌరవించాలని హితవు పలికింది. కోర్టు ఉత్తర్వులను తేలిగ్గా తీసుకోద్దని హెచ్చరించింది. రిజిస్ట్రార్ జ్యుడీషియల్ వద్ద సోమవారం లొంగిపోయాకే కోర్టు ధిక్కరణ అప్పీళ్లపై విచారణ చేస్తామని తేల్చిచెప్పింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాధ్‌రాయ్, జస్టిస్ తర్లాడ రాజశేఖరరావుతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఉత్తర్వులిచ్చింది.
కనీస వేతనాలు చెల్లించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ చిత్తూరు జిల్లాకు చెందిన షిఫ్ట్ ఆపరేటర్లు, జూనియర్ లైన్‌మెన్‌లు, జూనియర్ ఇంజనీర్లు 2022లో హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి.. ఓ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకొని పిటిషనర్లు సమర్పించిన వినతిపై తగిన ఉత్తర్వులు జారీ చేయాలని 2022 సెప్టెంబర్ 6న అధికారులను ఆదేశించింది. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ విద్యుత్ శాఖ అధికారులు ధర్మాసనం ముందు అప్పీల్ వేశారు. విచారణ జరిపిన ధర్మాసనం.. అధికారులను ఆశ్రయించి వినతి సమర్పించుకోవాలని పిటిషనర్లకు సూచించింది. చట్ట నిబంధనలకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేయాలని 2022 డిసెంబర్ 22న ఉత్తర్వులిచ్చింది.
అయితే సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు, మరోవైపు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను ఉద్దేశ పూర్వకంగానే అధికారులు పట్టించుకోలేదని షిప్ట్ ఆపరేటర్లు, జూనియర్ లైన్‌మెన్‌లు సింగిల్ జడ్జి వద్ద కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలు వేశారు. వాటిపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీ సంతోషరావు, ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ పూర్వ సీఎండీ బి.శ్రీధర్‌కు నెల రోజల సాధారణ జైలు శిక్ష, రూ.వెయ్యి చొప్పున జరిమానా విధిస్తూ ఈ నెల 21న తీర్పు ఇచ్చారు. జైలు శిక్ష అనుభవించేందుకు చర్యలు తీసుకునే నిమిత్తం ఈ నెల 27న హైకోర్టు రిజిస్ట్రార్ జ్యుడీషియల్ ముందు హాజరుకావాలని ఇరువురు అధికారులను ఆదేశించారు.
ఈ నేపథ్యంలో 28వ తేదీ అత్యవసరంగా ఇరువురు అధికారులు ధర్మాసనం ముందు అప్పీల్ వేసి.. జైలు శిక్ష విధిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును నిలుపుదల చేయాలని కోరారు. అధికారుల తరఫున న్యాయవాదులు అనూప్ కౌశిక్ కరవాడి, వీఆర్ రెడ్డి కొవ్వూరి వాదనలు వినిపించారు. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు ప్రతి 27వ తేదీ మధ్యాహ్నం అందుబాటులోకి వచ్చిందన్నారు. దాని అమలును నిలుపుదల చేయాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఈనెల 27న రిజిస్ట్రార్ జ్యుడీషియల్ ముందు లొంగిపోవాలని సింగిల్ జడ్జి ఆదేశించారని గుర్తు చేసింది. ఆ ఉత్తర్వులకు ఎందుకు కట్టుబడి ఉండలేదని ప్రశ్నించింది. అధికారుల వ్యవహార శైలిపై ఆక్షేపణ తెలిపింది. సోమవారం లొంగిపోయిన తర్వాత కోర్టు ధిక్కరణ అప్పీల్‌పై విచారణ చేపడతామని తేల్చిచెప్పింది. సోమవారానికి వాయిదా వేసింది.