Expansion of Southwest Monsoon: వాయువ్య భారత్‌లో బిపర్ జోయ్ తుపాను ప్రభావం పూర్తిగా తగ్గటంతో దేశంలో నైరుతీ రుతుపవనాల విస్తరణ జోరందుకుంది. ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో అంతటా నైరుతీ విస్తరించినట్టు భారత వాతావరణ విభాగం తెలియచేసింది. తదుపరి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, యూపీ తదితర రాష్ట్రాలకూ నైరుతి విస్తరించేందుకు అనువుగా వాతావరణ పరిస్థితులు ఉన్నట్టు వాతావరణశాఖ తెలిపింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో నైరుతీ రుతుపవనాల జల్లులు అంతటా నమోదు అవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురుస్తున్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతీ రుతుపవనాల కారణంగా జల్లులు కురుస్తుండటంతో ఎక్కడ చూసినా ఆకాశం మేఘావృతమై కనిపిస్తోంది. వర్షపు జల్లులతో పాటు గాలుల కారణంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా దిగివచ్చాయి.
- ALSO READ: అల్లకల్లోలం సృష్టించిన బిపోర్జాయ్.. విద్యుత్ స్తంభాలు నేలమట్టం.. వేల గ్రామాలకు కరెంట్ కట్
గోదావరి జిల్లాల్లో భారీగా వర్షాలు.. వరుణుడి కరుణ కోసం ఎదురుచూస్తున్న రైతన్నకు శుక్రవారం వేకువ జామునే మొదలైన వర్షంతో శుభ సందేశాన్నిచ్చింది. పాలకొల్లు, నరసాపురం, యలమంచిలి, మొగల్తూరు, వీరవాసరం, పాలకోడేరు మండలాల్లో భారీవర్షం కురిసింది. ఇంకా పలు మండలాల్లోనూ వరుణుడు పలకరించడంతో విత్తనాలు చల్లేందుకు రైతులు సమాయత్తమవుతున్నారు. స్వల్ప కాలిక రకాలతో మేలు.. చౌడు, ఉరక భూముల్లో సైతం మంచి దిగుబడినిచ్చే ఎంటీయూ 1318 వరి వంగడాన్ని సాగు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ రకం 155-160 రోజుల మధ్య పంట చేతికొస్తోంది. తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలాల్లో అవసరమైన నారుమడులు సిద్ధం చేసుకున్నారు. మిగిలిన 18 మండలాల్లో కొన్నిచోట్ల విత్తనాలు చల్లారు. మిగిలినచోట్ల చేలను అనువుగా మార్చుకుంటున్నారు.
రైతన్నకు ఉపిరి పోసిన వర్షాలు.. ప్రధానంగా రైతు స్థాయిలోనే అత్యధికంగా విత్తనాలు సేకరించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కిలోకి రూ.5 రాయితీపై రైతు భరోసా కేంద్రాల ద్వారా సరఫరా చేసేందుకు కేవలం 1,737 క్వింటాళ్ల విత్తనాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ దశలో నారుమడులు మరింత ఆలస్యమయ్యే చోట్ల ఎంటీయూ 1061, ఎంటీయూ 1064, ఎంటీయూ 7029 (స్వర్ణ), సంపద స్వర్ణ వంటి స్వల్పకాలిక రకాలను సాగు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ‘వచ్చే నెల 15కి నారుమడులు పూర్తవుతాయని అంచనా వేస్తున్నాం. ఖరీఫ్‌లో 53 వేల టన్నుల ఎరువులు అవసరమని గుర్తించాం. ఇప్పటికే అన్ని రకాల ఎరువులు 30 వేల టన్నుల వరకు సిద్ధం చేశాం ’ అని జిల్లా వ్యవసాయాధికారి జడ్.వెంకటేశ్వరరావు తెలిపారు.
- ALSO READ: పాలకొండలో వర్షం.. సంబరాల్లో జనం
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. అన్నట్లు శుక్రవారం ఉదయం కురిసిన భారీ వర్షానికి జిల్లాలో వడ గాల్పులతో వేడెక్కిన నేల తనివితీరా తడిసి చల్లబడింది. తొలకరి పలకరింపుతో బీటలు వారిన మట్టి వెదజల్లే పరిమళాలు నలుమూలలా వ్యాపించాయి. ఎడతెరిపి లేని వర్షానికి బడికి వెళ్లే బుడుగులు గొడుగులు చేతబట్టారు. విరామ సమయాల్లో వాన నీటిలో కాగితం పడవలు వదులుతూ పెద్దలకు సైతం బాల్యపు మధురిమలు గుర్తు చేశారు. జిల్లాలో అత్యధిక వర్షపాతం పాలకొల్లులో 87.4 మి.మీ. నమోదవగా తర్వాత నరసాపురంలో 63.6 మి.మీ. వర్షం కురిసింది.