కరోనా సంక్షోభ పరిస్థితుల్లోనూ సరకు రవాణాను పెంచి ఆదాయం పొందటంపై గుంటూరు రైల్వే డివిజన్ ప్రత్యేకంగా దృష్టిసారించింది. సాధారణంగా గూడ్సుల్లో ఎగుమతి అయ్యే ఎరువులు, ఖనిజాలు, సిమెంట్‌తోపాటు ఇతర వస్తువుల్ని రవాణాపై ఆలోచన చేసింది. అలాగే మన దేశానికే పరిమితం కాకుండా పొరుగు దేశాలకు సరకు రవాణా చేయటంపై దృష్టి సారించారు. ఈ రెండు అంశాల్లోనూ అధికారులు మంచి ఫలితాలు సాధించారు. తొలిసారిగా బంగ్లాదేశ్‌కు గూడ్సు ద్వారా మిర్చి ఎగుమతులు చేపట్టారు.
డివిజన్ ఆదర్శంగా నిలుస్తోంది..
గుంటూరు జిల్లా మిర్చికి పేరొందింది కావటం.. ఇక్కడే మిర్చి యార్డు ఉండటం రైల్వేకు కలిసొచ్చింది. వ్యాపారులతో మాట్లాడి గూడ్సులో రవాణా ద్వారా కలిగే లాభాలను వివరించారు. బంగ్లాదేశ్‌కు రైళ ద్వారా చేసే రవాణాపై రైతులకు అవగాహన కల్పించారు. గూడ్సు రైలు ప్రారంభమయ్యే ప్రాంతతోపాటు.. సరకు దించాల్సిన ప్రదేశంలోనూ వాటిని నిల్వ చేసేందుకు గోదాములు అందుబాటులో ఉంచారు. దీంతో ఇప్పటి వరకూ రోడ్డు, జల మార్గాల్లో రవాణా చేసే మిర్చిని ఇపుడు గూడ్సు వ్యాగన్లు బంగ్లాదేశ్ చేరుస్తున్నాయి. సరకు రవాణా రైలు నడపటం రికార్డుగా అధికారులు చెబుతున్నారు. అలాగే దేశంలోని ఇతర రైల్వేలకు గుంటూరు డివిజన్ ఆదర్శంగా నిలిచిందంటున్నారు.
రూ. 427కోట్లు ఆదాయం
కేవలం మిర్చికే పరిమితం కాకుండా పసుపు, అల్లం వంటి ఆహార పదార్థాలు, సిమెంట్ తయారీలో వాడే ముడిసరుకు, నిర్మాణరంగ సామగ్రిని కూడా రవాణా చేశారు. దీంతో సరకు రవాణాలో గుంటూరు డివిజన్ మొదటి వరుసలో నిలిచింది. 2019-20లో 1.55 మిలియన్ టన్నుల సరకు ఎగుమతులు చేయగా.. 2020-21లో 2.71 మిలియన్ టన్నులు రవాణా చేయగలిగారు. గతేడాది సరకు రవాణాతో 193.4కోట్ల రాగా.... ఈసారి రూ.427కోట్లు ఆదాయం వచ్చినట్లు గుంటూరు రైల్వే డివిజన్ అధికారులు వెల్లడించారు. ప్రత్యేకించి బంగ్లాదేశ్‌కు మిర్చి రవాణా ద్వారా రూ. 6.22కోట్లు ఆదాయం వచ్చింది. ఉత్తరాది రాష్ట్రాలకు సిమెంటు ముడిసరకు రవాణా ద్వారా రూ. 47కోట్ల ఆదాయం ఆర్జించింది.
ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ నంబర్
డివిజన్ పరిధిలో గతంలో నిత్యం 100 వరకూ వ్యాగన్లు సరుకులతో వెళ్లేవి. ప్రస్తుతం రోజుకు 140 వ్యాగన్లు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. సరకు రవాణా కోసం ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ నంబర్ 9701379955 కేటాయించారు. సదరు రైతులు ఈ నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం పొందవచ్చు. ప్రయాణీకుల రైళ్ల కోసం పనిచేసే సిబ్బందిని సరకు రవాణా విభాగంలో పనిచేయించటం ద్వారా ఫలితాలు సాధించినట్లు అధికారులు తెలిపారు.
అరుదైన ఘనత
ఇలా గుంటూరు రైల్వే డివిజన్ కరోనా సమయంలోనూ అరుదైన ఘనతను అందుకుంది. మిర్చితో పాటు పత్తి, ఇతర ఆహార పదార్థాల ఎగుమతులు పెంచేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సరకు రవాణాలో రెట్టింపు ఆదాయం సాధించిన గుంటూరు రైల్వే డివిజన్ అధికారుల్ని ఉన్నతాధికారులు అభినందించారు.
ఇదీ చూడండి: