పులిచింతల ప్రాజెక్ట్ నుంచి వరదనీరు భారీగా దిగువకు వస్తోంది. గుంటూరు జిల్లా అచ్చంపేట వద్ద విడుదలైన ప్రవాహం కారణంగా.. బెల్లంకొండ, అమరావతి, అచ్చంపేట మండలాల్లోని పంటలు పెద్ద ఎత్తున నీట మునిగాయి. కృష్ణా పరివాహక ప్రాంత గ్రామాలు చల్లగరిగ, తాడువాయి, చామర్రు, కోనూరుల్లోకి నీరు చేరింది.
మాదిపాడు వేద పాఠశాల ఆవరణను వరదనీరు కమ్మేసింది. అక్కడ విద్యనభ్యసిస్తున్న 52 మంది మంది విద్యార్థులను అధికారులు తరలించారు. శారదాపీఠం దిగువభాగం లోలెవల్ వంతెనపైనా భారీగా నీరు చేరింది.
అమరావతి, మునగోడు, మల్లాది, ధరణికోట, వైకుంఠపురాలలోని నదీ పరివాహక, లంక ప్రాంతాల పంటపొలాలు పూర్తిగా నీట మునిగాయి. అమరేశ్వరుని పుష్కరఘాట్ దాటి కృష్ణమ్మ నిండుగా ప్రవహిస్తోంది. పెద్దమద్దూరు ప్రధాన రహదారిని వరద ముంచెత్తింది. అమరావతి నుంచి విజయవాడకు రాకపోకలు నిలిచిపోయాయు. అధికారులతో ఎమ్మెల్యే నంబూరు శంకర రావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.
ఇదీ చదవండి: రైతులకు కష్టం వస్తే సీఎంకు పట్టదా ..?: నారా లోకేశ్