Magic of house numbers in Guntur: గుంటూరులో ఒకే ఇంటి నంబర్‌తో వందలాది ఓట్లు నమోదు కావడం.. నగరపాలక అధికారులను ఉలికిపాటుకు గురిచేసింది. పొరపాటు ఎక్కడ జరిగిందనే కోణంలో అంతర్గతంగా విచారణ చేస్తున్నారు. నగరంలో భారీగా దొంగ ఓట్లు చేర్పించారని విపక్షాలు ఆరోపిస్తున్న వేళ.. ఇంటి నంబర్ల కేటాయింపు వ్యవహారం చర్చకు దారితీసింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 36వ వార్డులో ఒకే నంబరుతో రెండు ఇళ్లు ఉన్నాయి. ఇలా నగరంలో పదుల సంఖ్యలో ఇళ్లు ఉన్నాయి. ప్రతి ఇంటికి కొత్త, పాత నంబరు ఉండటం, ఓటర్ల జాబితాలో కొన్ని పాత నంబర్లతో పేర్లు నమోదవడం, మరికొన్ని కొత్త వాటితో ఉండటంతో తికమక ఏర్పడుతోంది.
ఓకే ఇంట్లో అనేక మంది ఓటర్లు.. స్తంభాలగరువు, శ్యామలానగర్, సాయినగర్ కాలనీల్లో ఒకే ఇంటి నంబరుతో ఓటర్ల జాబితాలో అనేకమంది ఓట్లు ఉన్నాయి. స్తంభాలగరువు కాలనీలో ఇంటి నంబరు 7-73తో 21మంది ఓటర్లు నమోదు కాగా... వీరిలో కొందరు ప్రస్తుతం అక్కడే ఉన్నారు. చాలామంది నగరంలోని వేర్వేరు ప్రాంతాలకు మారిపోయారు. అయినా పాత చిరునామాలో ఓట్లు కొనసాగుతున్నాయి. ఇక సాయినగర్‌లోనూ ఇదే ఇంటి నంబరు 7-73తో ఉన్న ఇంట్లో నలుగురు ఓటర్లు నమోదయ్యారు.
అధికారులు వస్తున్నారు ఇంటి నంబర్ అడుగుతున్నారు, వెళ్లిపోతున్నారు. పక్క పక్కన ఉండే ఇళ్లు వేర్వేరు వార్డుల్లో ఉన్నాయి. ఎన్నికల్లో ఎక్కడ ఓటు వేయాలో కూడా అర్థం కావడం లేదు. ఇదెక్కడి రాజకీయం - రసూల్, స్తంభాలగరువు, గుంటూరు
ఏ రోజు ఓ కార్పొరేటర్ వచ్చింది లేదు.. మా లైన్ చూసింది లేదు.. మా కార్పొరేటర్ ఎవరో కూడా మాకు తెలియదు. ఎన్నికల సమయంలో వేరే దగ్గర ఓటు వేశాం. - లక్ష్మి, స్తంభాలగరువు, గుంటూరు
ఇక 36 వార్డులోనూ ఇంటి నెంబర్ల గందరగోళం ఎక్కువగానే ఉంది. పట్టాభిపురం మెయిన్ రోడ్డులో ఇళ్లకు వరుసగా 10-1 నుంచి 10-44 వరకు నంబర్లు కేటాయించారు. ఇదే వార్డులో రామశాస్త్రితోట మెయిన్ రోడ్డులో 10-1 నుంచి 10-75 వరకు ఇంటి నంబర్లు ఇచ్చారు. రాజీవ్‌గాంధీ కాలనీలో 8-1 నుంచి 8-43వరకు, పట్టాభిపురం మెయిన్ రోడ్డులోనూ 8-1 నుంచి 8-28 వరకు ఇంటి నంబర్లు ఉన్నాయి. అలాగే స్తంభాలగరువు మెయిన్ రోడ్డులో 7-30 నుంచి 7-76 వరకు ఉండగా... సాయినగర్‌లో ఇదే నంబర్లు ఇళ్లకు కేటాయించారు.
మున్సిపల్ ఎన్నికల సమయంలో పెద్ద మొత్తంలో దొంగ ఓట్లు చేర్చారు. ఈ మధ్య అధికారులు పరిశీలిస్తే ఒకే ఇంటి నంబర్ మీద 150 చొప్పున ఓట్లు ఉన్నాయి. ఇదే విషయాన్ని ఇంటి యజమానులను అడిగితే.. అసలు ఆ ఓటర్లు ఎవరో కూడా తమకు తెలిదని చెప్తున్నారు. - రామకృష్ణ, గుంటూరు
డబల్ డోర్ నంబర్, డబల్ సిరీస్ ఉన్నాయి. అవి ఏ బూత్ పరిధిలో ఉన్నాయో తెలియడం లేదు. పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి. - రమేష్ బాబు, గుంటూరు
ఈ బూత్‌లో ఉన్న డోర్ నంబర్ మరో వీధిలో కూడా ఇదే నంబర్‌తో ఉంది. అసలు మున్సిపాలిటీ వాళ్లు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. మల్టిపుల్ డోర్ నంబర్లు ఇస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దుర్మార్గానికి పాల్పడుతోంది. - నరేంద్ర, గుంటూరు
రెండు ఇంటి నంబర్లు ఒకేలా ఉన్నప్పటికీ.... వేర్వేరు పోలింగ్ బూత్‌ల పరిధిలో ఉండటం వల్ల పెద్దగా ఇబ్బంది లేదని అధికారులు చెబుతున్నారు.