కారుణ్య మరణాలకు అనుమతించాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్‌కి యూ-1 రిజర్వ్ జోన్ రైతులు ఆదివారం పోస్టుకార్డులు రాశారు. తాడేపల్లి, కుంచనపల్లి, కొలనుకొండ గ్రామాలకు చెందిన 320 మంది చిన్న, సన్నకారు రైతులకు సంబంధించిన 178 ఎకరాల భూమిని రాజధాని నగర డిటైల్డ్ మాస్టర్‌ప్లాన్‌లో యూ-1 (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రిజర్వ్ జోన్)గా గత ప్రభుత్వం ప్రకటించింది. ఈ రిజర్వ్ జోన్‌ను తొలగించాలని ఆరేళ్లుగా ప్రభుత్వాలను రైతులు కోరుతున్నారు.
ఆ భూమిలో పంటలు పండించుకోవడానికి తప్ప మరే అవసరాలకూ ఉపయోగించుకునేందుకు వీల్లేకుండా రిజర్వ్‌జోన్ ఆటంకంగా మారిందని రైతులు వాపోయారు. ఫలితంగా పిల్లల పెళ్లిళ్లు, వృద్ధుల వైద్యఖర్చులు, కుటుంబ అవసరాలకు భూమి అమ్ముకుందామంటే కొనేవారు రాక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో తమ కుటుంబసభ్యులతో కలసి కారుణ్య మరణాలకు అనుమతించాలని పోస్టుకార్డులు రాసి గవర్నర్‌కు పంపారు. రోజూ చస్తూ బతకలేకపోతున్నందున మూకుమ్మడిగా కారుణ్య మరణాలు కోరుతున్నట్లు వాటిలో పేర్కొన్నారు. సుమారు 24మంది రైతులు కార్డులు రాసి, పోస్టు చేశారు. వాటిపై రైతు సెల్‌ఫోన్ నంబరు, పూర్తి వివరాలు కూడా రాశారు.
ఇదీ చదవండి: ప్రముఖుడి విల్లాలో మెకానిక్ మృతి.. గుట్టుచప్పుడు కాకుండా రాజీ ప్రయత్నాలు!