బ్లీచింగ్ స్కాం: గుంటూరు డీపీవో సస్పెన్షన్ - బ్లీచింగ్ స్కాం తాజా వార్తలు
కరోనా సమయంలోనూ కాసులకు కక్కుర్తి పడిన గుంటూరు జిల్లా పంచాయతీ అధికారి సస్పెండయ్యారు. బ్లీచింగ్, పారిశుద్ధ్య సామగ్రి కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని నిర్ధరణ కావటంతో అతన్ని సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
గుంటూరు జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) డి.రాంబాబును సస్పెండ్ చేస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాంబాబు మాచవరం ఎంపీడీవోగా పని చేసేటప్పుడు ఓ మంత్రి సిఫార్సు మేరకు 2019 సెప్టెంబరులో డిప్యుటేషన్‌పై డీపీవోగా ప్రభుత్వం నియమించింది. విధుల్లో చేరిన కొన్ని నెలల్లోనే బ్లీచింగ్ కొనుగోళ్లపై ఆరోపణలు ఎదుర్కొన్నారు. కొవిడ్-19 నేపథ్యంలో పంచాయతీల్లో ఉపయోగించేందుకు బ్లీచింగ్ కొనుగోలు చేయగా, నిబంధనలు పాటించలేదని జిల్లా కలెక్టరు నియమించిన త్రిసభ్య కమిటీ తేల్చింది. మే 29న పంచాయతీరాజ్ కమిషనరుకు నివేదిక పంపగా.. సస్పెండ్ చేస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇటీవలే ప్రకటించారు. ఉత్తర్వులు శుక్రవారం వెలువడ్డాయి. కలెక్టర్ అనుమతి లేకుండా జిల్లా కేంద్రం విడిచి వెళ్లొద్దని ఆదేశాల్లో పేర్కొన్నారు. మరోవైపు పంచాయతీలకు సరఫరా చేసి స్ప్రేయర్లను అధిక ధరకు కొనుగోలు చేయడం, నకిలీ బ్లీచింగ్ పంపిణీపై ప్రభుత్వం జిల్లా సంయుక్త కలెక్టరును విచారణ అధికారిగా నియమించింది.
ఇదీ చదవండి