కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అధికారులకు సూచించారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫోన్ నెంబర్లతో కూడిన పోస్టర్లు అందుబాటులో ఉంచాలన్నారు.
ఇప్పటికే కొవిడ్ వైద్య సహాయం కోసం 104, 14410 నెంబర్లు పనిచేస్తున్నాయని తెలిపారు. బాధితుల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. వ్యాధి నియంత్రణకు ప్రజలు తమవంతు సహకారం అందించాలని కోరారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనా సోకిన వారిపై వివక్ష చూపడం తగదన్నారు. కొవిడ్‌తో చనిపోయిన వారిలో కొన్ని గంటలవరకే వైరస్ ఉంటుందని చెప్పారు. కరోనా నెపంతో అంత్యక్రియలను అడ్డుకోవడం దారుణమన్నారు. కరోనాతో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు రూ. 15వేలు ఇవ్వాలని.. ఒకవేళ ఎవరూ ముందుకు రాకపోతే ప్రభుత్వమే అంత్యక్రియలు నిర్వహిస్తుందని సీఎం జగన్ చెప్పిన విషయాన్ని శ్రీదేవి గుర్తుచేశారు.
తెదేపా అధినేత చంద్రబాబుపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో కరోనాతో సెకనుకు ఒకరు చొప్పున చనిపోతున్నారంటున్న చంద్రబాబు అందుకు రుజువులు చూపించాలని డిమాండ్ చేశారు. పుష్కలంగా వర్షాలు పడుతుంటే చూసి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు.
ఇవీ చదవండి...