రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాల్లో ఒకదానికి గుర్రం జాషువా పేరు పెట్టాలని వైకాపా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. పల్నాడు లేదా గుంటూరు జిల్లాకు జాషువా పేరుపెట్టాలని కోరారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా 49వ వర్థంతి సందర్భంగా గుంటూరు నగరంపాలెంలోని ఆయన విగ్రహానికి మంత్రి ఆదిమూలపు సురేశ్, ఎంపీలు శ్రీకృష్ణదేవరాయలు, నందిగామ సురేశ్, ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, మద్దాలి గిరి, ముస్తఫా పూలమాలలు వేసి నివాళులర్పించారు.
గుర్రం జాషువా దళితుల ఆత్మగౌరవానికి ప్రతీకని.. ఆయన గుంటూరు జిల్లా వాసి కావడం మన అదృష్టంగా భావిస్తున్నాని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. జాషువా సమాధి, కళాపీఠం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మూడు కోట్ల రూపాయలను కేటాయించడం అభినందనీయన్నారు.
దళితుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పారు. గత ప్రభుత్వం ఊరి చివర అంబేద్కర్ విగ్రహం పెట్టాలనే నిర్ణయం చేస్తే... వైకాపా ప్రభుత్వం విజయవాడ నడి బొడ్డులో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయబోతోందని సురేశ్ అన్నారు. గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేసే రెండు జిల్లాలో ఒకదానికి గుర్రం జాషువా జిల్లాగా నామకరణం చేయడానికి తన వంతు కృషి చేస్తానని ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు తెలిపారు.
ఇదీ చదవండి