గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ కుల ధ్రువీకరణ వివాదం కలెక్టరేట్‌కు చేరింది. తెదేపా ఎంపీపీ అభ్యర్థిని జబీన్‌కు కులధ్రువీకరణ పత్రం ఇవ్వడానికి అధికారులు నిరాకరించటంతో ఆమె హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కుల ధ్రువీకరణ పత్రంపై కలెక్టర్ విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దుగ్గిరాల తహసీల్దార్ విచారణ పూర్తి చేయగా..ఇవాళ కలెక్టర్ వివేక్ యాదవ్ ఎదుట షేక్ జుబీన్ తన మద్దతుదారులతో కలిసి విచారణకు హాజరైంది. తాను బీసీ వర్గానికే చెందిన మహిళనంటూ..తన కుటుంబ సభ్యులకు గతంలో అధికారులు జారీ చేసిన కులధ్రువీకరణ పత్రాలను కలెక్టర్ వివేక్ యాదవ్‌కు అందజేశారు. ఇవన్నీ పరిశీలించిన కలెక్టర్..నివేదికను హైకోర్టుకు సమర్పిస్తామని తెలిపినట్లు జబీన్ వెల్లడించారు.
ఇదీ వివాదం..
దుగ్గిరాల మండలంలోని 18 ఎంపీటీసీ స్థానాల్లో తెదేపా 9, వైకాపా 8, జనసేన 1స్థానాలు గెలుపొందాయి. అత్యధిక స్థానాలు గెలిచిన తెదేపాకు ఎంపీపీ పీఠం దక్కే అవకాశముండటంతో చిలువూరు నుంచి గెలిచిన జబీన్‌ను ఎంపీపీ అభ్యర్థిగా తెదేపా ప్రకటించింది. ఈ క్రమంలో జబీన్‌కు కులధ్రువీకరణ పత్రం ఇవ్వడానికి అధికారులు నిరాకరించారు. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది. జబీన్ వినతిని పరిశీలించిన హైకోర్టు..ఆమె కుల ధ్రువీకరణ పత్రంపై తగిన నిర్ణయం తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఆ తర్వాత ఎంపీపీ ఎన్నిక నిర్వహించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఇదీ చదవండి
Duggirala MPP election: దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికపై ప్రభుత్వం అప్పీలు.. కొట్టివేసిన డివిజన్ బెంచ్