Guntur Body Builder Ravikumar: పేదరికం.. అవకాశాల్ని, అనుకున్న లక్ష్యాల్ని దూరం చేస్తుందనే ఆలోచన.. ముమ్మాటికి తప్పు అని నిరూపిస్తున్నాడు ఈ కండల వీరుడు. దేహదారుఢ్య పోటీల్లో అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్నాడు. పేద కుటుంబం నుంచి వచ్చిన ఈ యువకుడు బాడీ బిల్డర్‌గా దేశ పేరు ప్రతిష్ఠలు మరింత వ్యాప్తి చేయడమే తన లక్ష్యం అంటున్నాడు. అందుకోసం ఎంతైనా కష్టపడతానంటున్నాడు.
ఈ బాడీ బిల్డర్ పేరు నిశ్శంకరరావు రవికుమార్. గుంటూరు శివారు గ్రామమైన ఏటుకూరు ఇతని స్వస్థలం. తండ్రి లారీ డ్రైవర్, తల్లి గృహిణి. గత ఎనిమిదేళ్లుగా బాడీ బిల్డింగ్‌పై ఆసక్తితో ముందుకు సాగుతున్నాడు. పేదరికంలో ఉన్నా కూడా కష్టపడి ఈ స్థాయికి వచ్చానని చెబుతున్నాడు రవికుమార్.
పేదరికం నిత్యం ఎగతాళి చేస్తున్నా ఏమాత్రం వెరవకుండా ముందుకు సాగుతున్నాడు రవి కుమార్. సెప్టెంబర్ 13 నుంచి 15 వరకు ఫిలిప్పీన్స్‌లోని సెబూలో జరిగిన ఏషియన్ బాడీ బిల్డింగ్ పోటీల్లో 70–75 కేజీల విభాగంలో రవి రజత పతకం సాధించాడు. ఈ విజయంతో నవంబర్‌లో జర్మనీలో జరగనున్న ప్రపంచ బాడీ బిల్డింగ్ పోటీలకు దేశం తరపున ఎంపికయ్యాడు. ఇప్పటి వరకు రావడానికి తన ప్రయాణం చాలా కష్టతరంగా సాగింది అంటున్నాడు రవి.
దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో పాటు మరికొంత మంది వల్లే ఈ స్థాయిలో ఉన్నానని చెబుతున్నాడు రవికుమార్. ఇండియన్ ఆర్మీలో పని చేసే తనను ఇక్కడికి తీసుకువచ్చి గౌతమ్ రెడ్డి ధైర్యాన్నిఇచ్చాడని చెబుతున్నాడు. ప్రభుత్వం కూడా సహకరిస్తామని అన్నట్టు చెబుతున్నాడు.
పెద్ద ఉద్యోగాలు వచ్చినా కూడా వెళ్లకుండా బాడీబిల్డింగ్ పైనే దృష్టి సారించానంటున్నాడు. తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు చెబుతున్నాడు రవి. ప్రపంచ యవనికపై భారత్ జెండా రెపరెపలాడాలని రవి కుమార్ కల కంటున్నాడు. తన కల నిజం కావడానికి ఎంతైనా శ్రమిస్తానంటున్నాడు. అయితే ఈ క్రమంలో ఓ బాడీ బిల్డర్ జీవితంలో కోల్పోయే వాటి గురించి, బాడీబిల్డర్ రోజువారి ప్రణాళిక గురించి చెబుతున్నాడు.
గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన రవికుమార్ బాడీ బిల్డర్‌గా తనను తాను మలుచుకోవడమే కాకుండా ఎందరికో మెళకువలు నేర్పుతున్నాడు. తను ఈ స్థాయికి చేరడంతో శిక్షణలో ఆయనకు సాయం చేసిన జిమ్ కోచ్‌తో పాటు గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం కష్టపడే గుణం వల్లే ఈ స్థాయికి ఎదిగాడని చెబుతున్నారు.
అనుకున్నది సాధించే క్రమంలో సవాళ్లు ఎదురైనా.. పట్టుదలతో ప్రయత్నిస్తే గెలుపు సాహో అనాల్సిందే అంటాడు రవి కుమార్. ఏ రంగంలో ఉన్నా లక్ష్యం చేరేవరకు పట్టువిడవకుండా శ్రమించాలని చెబుతున్నాడు. ఈ కండల వీరుడు మరిన్ని పతకాలు సాధించాలని మనమూ ఆశిద్దాం.
"నేను ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నాను. 2015 నుంచి నేను బాడీ బిల్డింగ్ చేస్తున్నాను. ఎన్ని కష్టాలు వచ్చినా బాడీ బిల్డింగ్‌ను వదిలేదే లేదు. నా జీవితం ఇదే. జీవితంలో చాలా కష్టాలు వచ్చాయి.. ఎప్పుడూ దీనిని వదలలేదు. ఇక మీదట కూడా వదలను. మరిన్ని పతకాలు సాధించి.. దేశానికి అదే విధంగా మన రాష్ట్రానికి పేరు తీసుకువస్తాను". - రవికుమార్, బాడీబిల్డర్
80 శాతం వైకల్యం.. అంతర్జాతీయ మెడల్స్ దాసోహం.. 'పవర్'ఫుల్ బాడీ బిల్డర్ కథ ఇది!