Group 4 applications in Telangana: తెలంగాణలో గ్రూప్-4 పరీక్షకు నిరుద్యోగులు ఎక్కువ సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. నిరుద్యోగుల సంఖ్య అధికం అవడం వలన పోటీ పడే నిష్పత్తి కూాడా పెరిగింది. దీని వలన అభ్యర్థి ఉద్యోగం సంపాదించాలంటే తగిన కసరత్తు చేయాలి. పోటీని దృష్టిలో పెట్టుకొని సన్నద్దం కావాలి.
రాష్ట్రంలో గ్రూప్-4 దరఖాస్తుల ప్రక్రియ శుక్రవారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. జులై 1న రాతపరీక్ష జరగనున్న ఈ పోస్టుల కోసం 9,51,321 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గ్రూప్-4 సర్వీసుల కింద రాష్ట్రంలో ఈసారి 8,180 పోస్టులు భర్తీ చేయనుండగా.. ఒక్కోపోస్టుకు సగటున 116 మంది చొప్పున అభ్యర్థులు పోటీపడుతున్నారు. టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో ఈ స్థాయిలో దరఖాస్తులు రావడం ఇది రెండోసారి.
2018లో 700 వీఆర్‌వో పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన రాతపరీక్షకు రికార్డుస్థాయిలో 10.58 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అప్పట్లో పోస్టులు తక్కువగా ఉండటంతో ఒక్కో పోస్టుకు సగటున 1511 మంది పోటీపడ్డారు. ఈ సంవత్సరం 8,180 గ్రూప్-4 పోస్టులకు 9,51,321 లక్షల దరఖాస్తులు రావడం గమనార్హం.
సంక్షేమాధికారుల పోస్టులకు 1,45,358 దరఖాస్తులు: రాష్ట్రంలో 581 వసతిగృహ సంక్షేమాధికారుల పోస్టులకు 1,45,358 మంది దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు గడువు శుక్రవారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. ఆగస్టు నెలలో రాతపరీక్ష జరగనుంది.
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు 2,930: రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య శాఖలో భర్తీ చేయనున్న 1,147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు 2930 దరఖాస్తులు వచ్చాయి. ఈ శాఖలోని 34 విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. అత్యధికంగా అనస్థీషియా విభాగంలో 155 పోస్టులు భర్తీ చేయనుండగా వీటికి 332 దరఖాస్తులు వచ్చాయి. సుమారుగా 1:2 లో అభ్యార్థులు దరఖాస్తు చేశారు.
గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఎండోక్రైనాలజీ, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్, సీటీ సర్జరీలో పోస్టుల కంటే తక్కువ దరఖాస్తులు రావడం గమనార్హం. గ్యాస్ట్రోఎంట్రాలజీలో 14 పోస్టులకు 8, సీటీ సర్జరీలో 21 పోస్టులకు 10, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్‌లో 14 పోస్టులకు 7, ఎండోక్రైనాలజీలో 12 పోస్టులకు 5 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 7 నుంచి అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలించనున్నారు.
ఇవీ చదవండి: