Amravati villages : అమరావతి మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఇటీవల గెజెట్ విడుదల చేసింది. కొత్తగా 900 ఎకరాలలో ఆర్-5 జోన్ ఏర్పాటును ప్రతిపాదించింది. మందడం, ఐనవోలు, కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు గ్రామాల పరిధిలోని ప్రాంతాల్లో ఇది రానుంది. దీనిపై అభ్యంతరాల స్వీకరణకు సీఆర్డీఎ షెడ్యూల్ ప్రకటించింది. అక్టోబరు 28 నుంచి నవంబరు 11వ తేదీ వరకు అభ్యంతర పత్రాలు సమర్పించేందుకు అవకాశం కల్పించింది. ఈ అంశంపై రైతులు అటు అభ్యంతర పత్రాలు సమర్పిస్తూ..ఇటు గ్రామ సభల ఏర్పాటుకు పట్టుబట్టారు. ఇదే సమయంలో సీఆర్‌డీఏ కమిషనర్‌కు పెద్ద ఎత్తున తమ అభ్యంతరాలను ఫిర్యాదుల రూపంలో ఇచ్చారు.
'రాజధాని అమరావతి ప్రాంతం లో ఆర్-5 జోన్ ఏర్పాటు తమకు ఆమోదయోగ్యం కాదు. ప్రభుత్వం అమరావతిని నిర్వీర్యం చేసే కుట్రలను మానుకోవాలి. మాస్టర్ ప్లాన్ ను దెబ్బతీస్తు స్థానికులకు కాకుండా బయటివారికి ఇళ్ళ స్థలాలు ఎలా ఇస్తారు. కావాలంటే రాజధాని కి అనుకుని ఉన్న ప్రాంతాల్లో ఇంటి స్థలాలు ఇచ్చుకోవాలి ఆర్-5 జోన్ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలన్నదే మా ప్రధాన డిమాండ్'.- రాజధాని రైతులు
అభ్యంతరాలపై వినతిపత్రాలు సమర్పించినా..ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రాకపోవడం వల్ల మందడం, లింగాయపాలెం రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ రెండు గ్రామాల్లోనే ఈ మధ్యాహ్నం 12 గంటల్లోగా గ్రామ సభలు నిర్వహించి, వాటి వివరాలను తమకు సమర్పించాలని న్యాయస్థానం పంచాయతీ అధికారులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఉదయం 9న్నర గంటలకు మందడంలో గ్రామసభ జరగనుండగా... 10 గంటల 30 నిమిషాలకు లింగాయపాలెంలో గ్రామసభ జరగనుంది. వీటిల్లో తమ వాణి వినిపించేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.
మిగిలిన 27 గ్రామాల్లోనూ సభల నిర్వహణపై రాజధాని రైతు ఐకాస కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. నేడు హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. అమరావతి ప్రాంతంలో ఆర్-5 జోన్ ఏర్పాటు తమకు ఆమోదయోగ్యం కాదని రైతులు తేల్చిచెప్తున్నారు. మాస్టర్ ప్లాన్‌ను దెబ్బతీస్తు స్థానికులకు కాకుండా బయటివారికి ఇళ్ళ స్థలాలు ఎలా ఇస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ఆర్-5 జోన్ పరిధిలోని 5గ్రామాలతో సంబంధం లేకుండా మిగిలిన 24 గ్రామాల్లోనూ రైతులే సభలు నిర్వహించి తమ అభ్యంతరాలను న్యాయస్థానానికి సమర్పించే యోచనలో ఉన్నారు.
ఇవీ చదవండి: