268 Acres Land Allocated in S3 Zone: రాజధాని పరిధిలోని S-3 జోన్‌లో పేదలందరికీ ఇళ్లు పథకానికి 268 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే R-5 జోన్‌లో కేటాయించిన 1134 ఎకరాలకు అదనంగా 268 ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో లబ్ధిదారుల సంఖ్య మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు రాసిన లేఖ మేరకు అదనపు భూమి కేటాయింపునకు CRDA ప్రతిపాదన చేసింది. CRDA సిఫారసు మేరకు అనంతవరం, నెక్కల్లు, పిచ్చుకల పాలెం, బోరుపాలెం గ్రామాల్లో 268 ఎకరాల భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈమేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి ఉత్తర్వులు ఇచ్చారు.
ఇదీ జరిగింది: "నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు" పథకంలో భాగంగా సుమారు 50వేల మందికి.. రాజధాని అమరావతిలో ఇళ్ల స్థలాలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సీఆర్డీఏ చట్టాన్ని సవరిస్తూ, రాజధాని మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేస్తూ.. మందడం, ఐనవోలు, నవులూరు, కృష్ణాయపాలెం, కురగల్లు, నిడమర్రు పరిధిలో ఆర్5 జోన్ పేరుతో కొత్త రెసిడెన్షియల్ జోన్ ఏర్పాటు చేసింది. ఇళ్ల స్థలాల కోసం గుంటూరు జిల్లాకు 550 ఎకరాలు, ఎన్టీఆర్ జిల్లాకు 584 ఎకరాలు కలిపి మొత్తంగా 11వందల 34 ఎకరాల భూమిని ఇప్పటికే కేటాయించింది. ఇందుకోసం లే అవుట్‌లను సిద్ధం చేస్తుండగా.. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్ల విజ్ఞప్తితో మరో 268 ఎకరాలు కేటాయించాలని కమిటీని నిర్ణయించింది.
సీఆర్డీఏ కమిషనర్‌కు కలెక్టర్ల లేఖలు..: అదనపు భూములు కేటాయించాలంటూ ఏప్రిల్ 26న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, ఏప్రిల్27న గుంటూరు జిల్లా కలెక్టర్ లేఖలు రాశారు. అందుకు సమాధానంగా రెండు జిల్లాల కలెక్టర్లకు సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ సోమవారం లేఖలు రాశారు. 50 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నందు వల్ల.. ఆ సంఖ్యను చేరుకునేలా అదనపు లబ్ధిదారుల్ని గుర్తించమని కలెక్టర్లకు రాసిన లేఖలో వివేక్‌యాదవ్ సూచించారు. దీన్ని అత్యవసరంగా పరిగణించి లబ్ధిదారుల వివరాలు అందజేయాలని కోరారు. సోమవారం జిల్లా కలెక్టర్లకు వివేక్ యాదవ్ లేఖ రాయగా, మంగళవారం ల్యాండ్ అలాట్‌మెంట్ కమిటీ సమావేశమై.. 268 ఎకరాలు అదనంగా కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీనిని ఆమోదిస్తూ నేడు పురపాలక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మీ ఉత్తర్వులు జారీ చేశారు.
కౌలు డబ్బులు చెల్లించేందుకు సీఆర్డీఏ సిఫార్సు: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కురగల్లులో తమ భూమికి కౌలు ఇవ్వకుండా పేదల ప్లాట్ల కోసం రాళ్లు పాతటంపై మైలా అలివేలు మంగమ్మ కుటుంబం ఆందోళనకు దిగటంపై సీఆర్డీఏ అధికారులు స్పందించారు. అలివేలు మంగమ్మకు రిటర్నబుల్ ప్లాట్ కేటాయించేందుకు సీఆర్డీఏ అధికారులు సమ్మతించారు. ఆమె కుటుంబానికి సంబంధించిన 6ఎకరాలను భూ సమీకరణకు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ హయాంలో కౌలు కూడా పొందారు. కోర్టు కేసులు ఉన్నాయనే కారణంతో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కౌలు నిలిపివేశారు. అయితే కోర్టు తీర్పు కాపీని సీఆర్డీఏ అధికారులకు ఇచ్చినా కౌలు చెల్లించలేదు. పైగా పేదలకు సెంటు భూమి కోసం కురగల్లులో ప్లాట్లు వేస్తున్నారు. అక్కడ అలివేలు మంగమ్మ కుటుంబ సభ్యుల పొలం మొత్తాన్ని లే అవుట్లో కలిపారు. ప్లాట్లుగా విభజించి సరిహద్దు రాళ్లు పాతారు. దీనిపై ఆమె కుటుంబంతో సహా ఆందోళన చేసింది. సరిహద్దు రాళ్లు తొలగించి నిరసన తెలిపారు. విషయం ఈటీవీ భారత్‌లో ప్రచురితం అవడంతో సీఆర్డీఏ అధికారులు స్పందించారు. కౌలు డబ్బులు చెల్లించేందుకు సిఫార్సు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇవీ చదవండి: