Government give Fee Waiver to YCP Leaders Illegal Mineral Mining: గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి 500 చదరపు అడుగుల విస్తీర్ణం లోపున్న ఇళ్ల నిర్మాణాలకు వాడుకునే కంకర, గ్రావెల్, వ్యవసాయ వినియోగం కోసం సాధారణ భూమిలో చేపట్టే మట్టి తవ్వకాలకు సీనరేజీ రుసుములు, కన్సిడరేషన్ అమౌంట్, డీఎంఎఫ్ అండ్ మెరిట్ తదితరాల నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ ఈ ఏడాది ఏప్రిల్ 17న ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సున్నపురాతి పలకలకూ కన్సిడరేషన్ అమౌంట్ నుంచి మినహాయింపు కోరారు. ఇందువల్ల ఖజానాకు ఎంత నష్టం వాటిల్లుతుందో అంచనా వేసేందుకు డేటా తన వద్ద లేదన్నారు. ‘చిన్నతరహా ఖనిజాల సంబంధిత రుసుముల వసూళ్ల బాధ్యతను ఉమ్మడి జిల్లాలవారీగా వివిధ ప్రైవేటు సంస్థలకు అప్పగించేశామని.. ఆ సంస్థలు అందరి నుంచీ రుసుములు వసూలు చేస్తున్నాయని చెప్పారు. గ్రామీణ, సెమీఅర్బన్ ప్రాంతాల్లో స్థానికులు దీన్ని వ్యతిరేకిస్తున్నారన్న వెంకటరెడ్డి.. ఈ నేపథ్యంలో వాటికి రుసుముల నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు.
నెల్లూరు జిల్లాలోని రుస్తుం మైనింగ్‌లో అర్థరాత్రి హల్చల్ - అధికార పార్టీ నేత అనుచరుల నిర్వాకం
500 చదరపు అడుగుల లోపు విస్తీర్ణమున్న ఇళ్లు ఏడాదికి లక్ష వరకూ నిర్మిస్తారనుకుంటే ఒక్కో యూనిట్‌కు అవసరమైన కంకర, గ్రావెల్‌పై 5,637 వరకూ రుసుము మినహాయించాలి. ఈ లెక్కన ప్రభుత్వ ఖజానాకు 56 కోట్ల నష్టం వాటిల్లుతుంది. వ్యవసాయ వినియోగం కోసం సాధారణ భూమిలో చేపట్టే తవ్వకాలకు 2021-22లో 31,500 ఘనపు మీటర్ల తవ్వకాలకు తాత్కాలిక అనుమతులివ్వగా.. 9.6 కోట్లు, 2022-23లో 43,500 ఘనపు మీటర్ల తవ్వకాలకు అనుమతించగా 13.6 కోట్ల మేర రుసుములు వసూలయ్యాయి. ఆ లెక్కన 50 వేల ఘనపు మీటర్ల తవ్వకాలు జరిగితే రుసుముల రూపంలో ప్రభుత్వ ఖజానాకు ఏడాదికి 16 కోట్ల నష్టం వాటిల్లుతుంది. సున్నపురాతి పలకలపై కన్సిడరేషన్ రుసుము మినహాయింపు వల్ల ఏడాదికి 10 కోట్ల మేర నష్టం వాటిల్లుతుందంటూ వాటికి మినహాయింపులివ్వాలని ప్రభుత్వానికి మళ్లీ ప్రతిపాదనలు పంపించారు. వీటిని ఆర్థికశాఖ సమ్మతి కోసం గనుల శాఖ పంపించింది.
కోట్ల రూపాయల ఖనిజ సంపద కొల్లగొడుతున్నారు, అంతా ఆ ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే!
చట్టబద్ధ రుసుముల చెల్లింపు నుంచి మినహాయింపు పొందిన చిన్నతరహా ఖనిజాల అంతిమ వినియోగాన్ని పర్యవేక్షించడం దాదాపు అసాధ్యమని.. ఈ చర్య వల్ల ప్రభుత్వ ఆదాయ లీకేజీలను ప్రోత్సహించినట్లవుతుందని ఆర్థికశాఖ స్పష్టంచేసింది. రుసుముల మినహాయింపు వల్ల ప్రభుత్వానికి ఆదాయం రాదని.. ప్రభుత్వ ఖజానాకు రెండు విధాలా నష్టమని తేల్చింది. ఇది ఎంతమాత్రం ఆచరణీయం కాదని నోట్‌ఫైల్‌లో తేల్చిచెప్పింది. అమలులో పరిపాలనాపరమైన ఇబ్బందులున్నాయంటూ 2023 మే 29న తిరస్కరించింది. ఈ అంశంపై సీఎంఓతో చర్చించామని, పునఃపరిగణనలోకి తీసుకోవాలంటూ అక్టోబరు 4న వెంకటరెడ్డి మరోమారు ప్రతిపాదనలు పంపించారు.
సున్నపురాతి పలకలకు కన్సిడరేషన్ అమౌంట్ నుంచి మినహాయింపు అంశాన్ని తాజా ప్రతిపాదనల్లో తొలగించారు. అయితే ‘అంతిమ లబ్ధి ఆధారిత మినహాయింపులు చాలా కష్టమైనవని.. వాటిని కనుక్కోవటం, నిరోధించటం అసాధ్యమని ఆర్థికశాఖ తెలిపింది. రుసుముల ఎగవేతకు ఇదో సులువైన మార్గమని.. ఎక్కువ సందర్భాల్లో ఈ మినహాయింపులు దుర్వినియోగమవుతాయని, అందుకు ఉదంతాలున్నాయని స్పష్టంచేసింది. అందుకే ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నామని ఆర్థికశాఖ ఆ ప్రతిపాదనలపై కరాఖండిగా తేల్చిచెప్పింది. సీఎంఓ నిర్ణయం మేరకు ఈ ప్రతిపాదనను పునఃపరిగణనలోకి తీసుకుంటూ అధికారులు దస్త్రాన్ని సర్క్యులేట్ చేశారు. సీఎస్, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా ముఖ్యమంత్రికి ఈ ఫైల్ వెళ్లింది. స్థానిక నివాసితుల అవసరాల దృష్ట్యా ఈ మినహాయింపుల ప్రతిపాదనను ఆమోదిస్తూ అక్టోబరు 21న సీఎస్ జవహర్‌రెడ్డి ఉత్తర్వులిచ్చారు.