Weighing Machines frauds at Jewelry Shops : బంగారు ఆభరణాలు విక్రయించే బహుళజాతి సంస్థలు.. చెయిన్ స్టోర్స్ దుకాణాల్లో కొన్నింట తూకాల్లో తేడా ఉంటోంది. పండగల రాయితీలు.. గ్రాము రూ.200 తక్కువ అంటూ ప్రకటనలతో ఆకర్షిస్తున్న కొన్ని సంస్థలు, దుకాణాల యాజమాన్యాలు మాయాజాలం ప్రదర్శిస్తున్నాయి. ఈ విషయమై కొనుగోలుదారుల నుంచి ఫిర్యాదులు అందుతుండటంతో తూనికలు, కొలతలు శాఖ అధికారులు డిజిటల్ త్రాసుల్లో లోపాలపై దృష్టి కేంద్రీకరించారు. మే, ఆగస్టు, అక్టోబరు, నవంబరు నెలల్లో తనిఖీలు నిర్వహించారు. 35 దుకాణాలు, చెయిన్‌స్టోర్స్, బహుళజాతి సంస్థలపై కేసులు నమోదు చేసి జరిమానా విధించారు. ఇకపై తరచూ తనిఖీలు నిర్వహించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.
మిల్లీగ్రాముల్లో.. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో మూడు వేలకుపైగా బంగారు, వజ్రాభరణాల దుకాణాలున్నాయి. కొన్ని గ్రాము ధర రూ.5400 ఉంటే.. రూ.5200కే ఇస్తామని, హారం కొంటే వెండిచెంచా, గ్లాసు ఉచితం వంటి ప్రకటనలు ఇస్తున్నాయి. దసరా, దీపావళి పండగలప్పుడు ఈ తరహా ప్రకటనలు ఎక్కువ రావడంతో.. అధికారులు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని 12 ప్రముఖ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. ఐదు చోట్ల ఆభరణాల బరువు వారు చూపిస్తున్న దానికంటే తక్కువగా ఉందని గుర్తించారు. మిల్లీగ్రాముల్లో తేడా ఉన్నట్లు తనఖీల్లో వెల్లడైంది. ఒక్కో దుకాణానికి రూ.12లక్షల జరిమానా విధించారు.
షాపింగ్ మాల్స్.. సూపర్ మార్కెట్లు: ఇక నెల మొదటి వారం, పండగలు, ఇతర సెలవు రోజుల్లో రాయితీల పేరుతో కొన్ని షాపింగ్‌మాల్స్, సూపర్‌మార్కెట్‌లు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. అక్టోబరు, నవంబరు నెలల్లో మూడు వందలకుపైగా షాపింగ్‌మాల్స్, సూపర్‌మార్కెట్ల యంత్రాంగం తనిఖీలు నిర్వహించింది, కొన్నిచోట్ల బ్రాండెడ్ దుస్తులకు కంపెనీ ప్యాకింగ్ లేదు. ప్యాంట్‌లు.. షర్టుల ప్యాకెట్‌లపై తయారీ వివరాలు అస్పష్టంగా ఉన్నాయి. వినియోగదారుల సేవాకేంద్రం నంబరు లేదు. ఆహార పదార్థాల బరువు కిలోకు 950-970 గ్రాములే ఉన్నాయి. రెండు నెలల్లో 42 కేసులు నమోదు చేశామని అధికారులు తెలిపారు. ఓ ప్రముఖ ‘మార్ట్’కు రూ.14లక్షల జరిమానా విధించామని వివరించారు.
ఇవీ చదవండి: