Fraud in the Name of Job : 2019 సంవత్సరంలో ఏపీ స్పెషల్ డీఎస్సీ నిర్వహించగా.. మొదటి ఫేజ్లో మెరిట్ సాధించిన వారికి ఉద్యోగాలు లభించాయి. కొన్ని పోస్టులు భర్తీ కాకుండా అలాగే ఉండిపోయాయి. వాటిని రెండో ఫేజ్లో భర్తీ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉండగా.. ఇదే అదనుగా తీసుకున్న కొందరు మోసాలకు తెర లేపారు. లక్షల రూపాయలు చెల్లించి మోసపోయామని నగదు చెల్లించిన వారు లబోదిబోమంటున్నారు. వడ్డీలకు తీసుకువచ్చి మరీ చెల్లించమని ఆరోపణలు చేశారు.
బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ జిల్లా కాజులూరు మండలం దుగ్గుడూరు గ్రామానికి చెందిన మాతా జయ ప్రకాశ్ రెడ్డి అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఏపీ స్పెషల్ డీఎస్సీ రాశాడు. మొదటి ఫేజ్లో ఉద్యోగం రాకపోయే సరికి రెండో ఫేజ్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ సమయంలో విజయవాడ ట్రెజరీ కార్యాలయంలో పనిచేస్తున్న దావులూరి మల్యాద్రి, ప్రకాశ్ రెడ్డికి ఉద్యోగం ఇప్పిస్తానని నగదు వసూలుకు పాల్పడ్డాడు. ఉద్యోగం పేరుతో తన వద్ద నుంచి మల్యాద్రి మొదట లక్ష రూపాయలు వసూలు చేశాడని.. ప్రకాశ్ రెడ్డి ఆరోపించాడు. ఉద్యోగం అనగానే ఆశతో చెల్లించమని అతను వాపోయాడు.
లక్ష రూపాయలు చెల్లించిన తర్వాత కాలం వెళ్లదీస్తు వచ్చాడని.. ఉద్యోగం రాలేదని ఒత్తిడి తీసుకు వస్తే ఎవో కారణాలు చెప్పేవాడని అన్నాడు. ఎమ్మెల్యే సంతకాలు తీసుకురావాలని.. అదనంగా మరింత నగదు చెల్లించాలని అనేవాడని తెలిపాడు. ఎమ్మెల్యే సంతకాలు తీసుకువచ్చామని.. అతను అడిగినట్లుగానే మరో 2లక్షల రూపాయల నగదు చెల్లించమని వివరించాడు. అప్పటికి ఉద్యోగాలు రాకపోవటంతో గట్టిగా నిలదీయగా.. మోసపోయిన విషయం బయట పడిందని విస్తుపోయాడు.
తనలాగే దాదాపు 40 మంది వరకు నగదు చెల్లించినట్లు ప్రకాశ్ రెడ్డి తెలిపాడు. ఉద్యోగం రాకపోవటంతో నగదు తిరిగి ఇవ్వమని అడిగినందుకు ఎవో బాండ్లు రాసిచ్చాడని పేర్కొన్నాడు. గట్టిగా నిలదీస్తే తిరిగి మాపై కేసులు పెడతానని బెదిరిస్తున్నాడని వాపోయాడు. ఈ మేరకు గుంటూరు జిల్లా ఎస్పీకి స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశాడు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని ప్రకాశ్ రెడ్డి కోరాడు. ఇతను మాత్రమే కాకుండా ఈ మోసంలో కాంట్రాక్టర్ లాజర్, సచివాలయ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న అతని భార్య అరుణ ఉన్నారని తెలిపాడు.
ఇవీ చదవండి :