Road Accident in America: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగువాళ్లు మృతిచెందారు. కనెక్టికట్ రాష్ట్రంలో మినీ వ్యాను, ట్రక్కు ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో మినీ వ్యానులో ప్రయాణిస్తున్న ఎనిమిది మందిలో ముగ్గురు మృతి చెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరొకరు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. మృతుల్లో ఒకరిది ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కడియపులంక కాగా.. మరో ఇద్దరు తెలంగాణకు చెందినవారు.
వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక గ్రామానికి చెందిన నర్సరీ రైతు పాటంశెట్టి శ్రీనివాస్ కుమారుడు పాటంశెట్టి సాయి నరసింహ(23) అమెరికాలో కనెక్టికట్ రాష్ట్రంలో ఎం.ఎస్ చదువుతున్నాడు. అమెరికా కాలమాన ప్రకారం మంగళవారం ఉదయం 5 నుంచి 7 గంటల సమయంలో ఏడుగురు స్నేహితులతో కలిసి కారులో ప్రయాణిస్తున్నాడు. వీరు ప్రయాణిస్తున్న కారు పొగమంచు కారణంగా ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయి నరసింహతోపాటు పావని (వరంగల్), హైదరాబాద్‌కు చెందిన మరో యువకుడు ప్రేమ్‌కుమార్‌రెడ్డి మృతి చెందారు. మిగిలిన ఐదుగురు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సాయి నరసింహ కుటుంబసభ్యులకు సమాచారం అందింది.
దీపావళికి వీడియో కాల్ చేశాడు.. ఇంతలోనే..: సాయి నరసింహ చెన్నైలోని హిందుస్థాన్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశారు. క్యాంపస్ ఇంటర్వ్యూ ద్వారా ఓ కంపెనీలో కొలువు సాధించాడు. అయితే ఎం.ఎస్. చేయాలని భావించి ఆ ఉద్యోగాన్ని వదులుకున్నాడు. ఈ ఏడాది ఆగస్టు 5న అమెరికా వెళ్లాడు. ఇటీవల అక్కడ జరిగిన దీపావళి వేడుకల్లో పాల్గొని కుటుంబ సభ్యులకు వీడియో కాల్ సైతం చేశాడు. అంతలోనే తమ కుమారుడు మృత్యువాతపడటంతో తల్లిదండ్రులు శ్రీనివాస్, సుశీల కన్నీటి పర్యంతమవుతున్నారు. మృతుడి సోదరి పాటంశెట్టి నందిని చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు కలచివేస్తోంది. ఇదే గ్రామానికి చెందిన సిద్ధిరెడ్డి ఐశ్వర్య కూడా మృతుడు ప్రయాణిస్తున్న కారులోనే ఉండగా.. ఆమె స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ఇవీ చదవండి: