Awards ceremony for Journalists : జర్నలిస్టులు సత్యానికి దగ్గరగా, సంచలనాలకు దూరంగా పని చేయాలని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. గుంటూరులోని రెవెన్యూ కల్యాణ మండపంలో తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ జర్నలిస్టులకు అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. ఆయనతో పాటు కార్యక్రమంలో మాజీమంత్రి కామినేని శ్రీనివాస్, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, ప్రెస్ అకాడమీ ఛైర్మన్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రాజకీయాల మాదిరిగానే పత్రికా రంగంలోనూ ప్రమాణాలు పడిపోతున్నాయని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. పత్రికలు నాయకుల చేతుల్లో ఉన్నాయని.. నాయకులు పేపర్లు పెట్టుకుని నచ్చినట్లు రాసుకుంటున్నారని ఆరోపించారు. రాజకీయ నాయకులకు శిక్షణ కార్యక్రమాలు ఉండాలని.. అవేమీ లేకుండానే నేరుగా రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారని వెంకయ్య నాయుడు విమర్శించారు. జర్నలిస్టులకు సామాజిక, ఆర్థిక, ఆరోగ్య రక్షణ అవసరమని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు.
ప్రజలకు సేవ చేసే రంగాలైన.. రాజకీయం, జర్నలిజం, విద్య, వైద్య రంగాలను ఒక మిషన్‌గా పోల్చేవారు. ఫ్యూడల్ మూమెంట్ కూడా ఒక మిషన్. ఆ మిషన్‌లో పనిచేసే అందరూ ఆ మిషనరీ జీల్.. ఆ ప్యాషన్ తో ఉండేవారు. రాజకీయాల్లో ప్రమాణాలు పడిపోతున్నాయి. చట్టసభల్లో ప్రమాణాలు పడిపోతున్నాయి.. ప్రజా సభల్లోను అలాగే పత్రికల్లోనూ ప్రమాణాలు పడిపోతున్నాయి. అది చాలా ప్రమాదకరం. ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీన పడుతుంది. ఈ విషయాన్ని గుర్తించి ఎవరికి వారు ఆయా ప్రమాణాలకు అనుగుణంగా మలుచుకోవాలి. దానిని నిలబెట్టాల్సిన అవసరం ఉంది. విద్యను వ్యాపారంగా మార్చి కార్పొరేటీకరణ చేశారు. వ్యాపారమయం చేశారు. విద్య, వైద్య రంగాల్లో ప్రైవేటీకరణ అవసరం కానీ వ్యాపారం కాకూడదు. రాజకీయాల్లోనూ ప్రవేశించి వ్యాపారమయం చేశారు. రాజకీయాన్ని ఉపయోగించుకుని ఆస్తులు పోగేస్తున్నారు. ప్రసంగాలు సైతం దిగజారుతున్నాయి. జుగుప్సాకరమైన పరిస్థితి ఉంది. - ఎం.వెంకయ్యనాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి
'నిన్న రాత్రి మధ్యదరా సముద్రంలో మునిగిన నావ ఇవాళ ఉదయం నా ఇంటి ముందు తేలింది' అని.. డా. సి. నారాయణరెడ్డి గారు అన్నట్లు.. ఎక్కడో జరిగిన సంఘటనను ప్రజలకు తెలియజేసే ఘనత జర్నలిస్టులదే అని చెప్పారు. ఎక్కడ, ఏ సంఘటన జరిగినా పోలీసులు, రెవెన్యూ వారి కంటే ముుందుగా జర్నలిస్టులు పరిగెడుతున్నారు. లోక కల్యాణం కోసం పాటు పడిన నారదుడి పేరిట అవార్డులను జర్నలిస్టులకు అందించాలి. దేశ ప్రగతికి జర్నలిజం అవసరం. నాగరిక సమాజానికి జర్నలిజం ప్రధాన అంశం. - లక్ష్మీనారాయణ, సీబీఐ మాజీ జేడీ
ఇవీ చదవండి :