Flexi Arrangement for Jagan on YSRCP Leaders Land Grabs: గుంటూరు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించిన వేళ, స్థానిక వైఎస్సార్సీపీ నేత ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు సంచలనంగా మారాయి. వైఎస్సార్సీపీ నేతలు భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆ భూమిని కాపాడంటూ సొంత పార్టీ నేతనే ఫ్లెక్సీని ఏర్పాటు చేశాడు. దీంతో స్థానికంగా ఇది చర్చనీయాంశంగా మారింది.
గుంటూరు జిల్లాలో సీఎం పర్యటించారు. ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని నల్లపాడు గ్రామంలో నిర్వహించే ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో గ్రామంలో 'వైసీపీ నేతలు ఆక్రమించిన వాగు పోరంబోకు భూమిని కాపాడు అన్న' అని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ దర్శనం ఇచ్చింది. వైసీపీ నేతలు దోచుకున్న భూముల వివరాలు ముఖ్యమంత్రికి తెలిపే విధంగా ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ స్థానిక వైఎస్సార్సీపీ నేత చల్లా అచ్చి రెడ్డి పేరుతో ఏర్పాటు చేశారు.
యువత, విద్యార్థి సంఘాల నిరసనకు కారణం : ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి నల్లపాడుకు వచ్చిన నేపథ్యంలో, ఆడుదాం ఆంధ్రా సరే, మరీ ఆట స్థలాలు ఎక్కడ అంటూ యువత, విద్యార్థి సంఘాల నాయకులు చుట్టుగుంట నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్టేడియాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్వీర్యం చేసి, ప్రైవేటు క్రీడా మైదానాల్లో ఆటలా అంటూ విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నించారు. సీఎం జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అరెస్టు చేశారు.
Nara Brahmani Tweet I am with babu : 'ఆంధ్రా భవిష్యత్ కోసం నేను సైతం..' నారా బ్రాహ్మణి కీలక ప్రకటన!
ఆడుదాం ఆంధ్రా వల్ల ప్రజల ఇబ్బందులు: ఆడుదాం ఆంధ్రాను నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్ సమీపంలో నిర్వహించారు. ఈ నేపథ్యంలో అక్కడి నిత్యవసర వస్తువుల దుకాణాలను, హోటళ్లను మూసేశారు. దీనివల్ల స్థానిక ప్రజలకు నిత్యవసర సరకులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణించి సరకులు తెచ్చుకోవాల్సి వస్తోందని ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఆడుదాం ఆంధ్రాను బహిష్కరించిన కార్పోరేటర్లు: గుంటూరు నల్లపాడులో నిర్వహిస్తున్న 'ఆడుదాం ఆంధ్రా'ను అధికార వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు బహిష్కరించారు. సీఎం పర్యటన దృష్ట్యా స్థానికంగా లయోలా స్కూల్ వద్ద కార్పొరేటర్లను పోలీసులు అడ్డుకున్నారు. వారికి లోపలికి అనుమతి లేదంటూ కార్యక్రమానికి పంపించేందుకు నిరాకరించారు. ఈ క్రమంలో పోలీసుల వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తూ వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు అక్కడి నుంచి వెనుదిరిగారు.
ఆడుదాం ఆంధ్రాను చుట్టుముట్టిన పలు అంశాలు : ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని నిర్వహించడానికి సరైన క్రీడా మైదానాలు లేవనే ఆరోపణలున్నాయి. అంతేకాకుండా ఈ కార్యక్రమంపై వాలంటీర్లు సమ్మె దిగిన విషయం కూడా తెలిసిందే. తాజాగా చుట్టుగుంట వద్ద విద్యార్థి సంఘాల నిరసన, వైఎస్సార్సీపీ కార్పోరేటర్లు ఆడుదాం ఆంధ్రాను బహిష్కరించడం వంటివి ఈ కార్యక్రమాన్ని చుట్టుముట్టాయి.