సికింద్రాబాద్ డెక్కన్ నిట్ వేర్ దుర్ఘటన నేపథ్యంలో తెలంగాణ విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ కీలక కసరత్తు దిశగా అడుగులేస్తోంది. భవిష్యత్తులో భారీ అగ్నిప్రమాదాలను నియంత్రించేందుకు కార్యాచరణ రూపొందించడంలో నిమగ్నమైంది. అగ్ని ప్రమాదాలకు అడ్డుకట్ట వేసే విషయంలో తెలంగాణ మంత్రులు కేటీఆర్, మహమూద్‌అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఇటీవల సమీక్ష నిర్వహించిన దృష్ట్యా ఫైర్ సేఫ్టీ ఆడిట్ చేపట్టేందుకు సిద్ధమవుతోంది. రానున్నది వేసవికాలం కావడంతో అగ్నిప్రమాదాలకు ఆస్కారమున్నందున త్వరగా కసరత్తు పూర్తి చేయాలని యోచిస్తోంది. ఇందుకోసం పోలీస్, పురపాలక శాఖల సహకారం తీసుకోనుంది.
ముఖ్యంగా బహుళ అంతస్తుల భవనాల్లో అగ్నిప్రమాదం జరిగితే ప్రాణ, ఆస్తినష్టం ఎక్కువగా జరిగే అవకాశముండటంతో వాటిపై దృష్టి సారించనుంది. వాస్తవానికి జీహెచ్‌ఎంసీ పరిధిలో 15 మీటర్ల లోపు ఉన్న భవనాలకు అగ్నిమాపక అనుమతులు అగ్నిమాపకశాఖ పరిధిలోకి రావు. అవన్నీ జీహెచ్‌ఎంసీనే పర్యవేక్షించాలి. అయితే భారీ భవంతుల విషయంలో ఈ రెండు శాఖల వద్ద స్పష్టమైన వివరాలు లేవు. ప్రతీ భవనాన్ని పర్యవేక్షించేందుకు అవసరమైన సిబ్బంది సైతం అందుబాటులో లేరు. ఈ నేపథ్యంలో తాజా సమీక్ష అనంతరం బహుళ అంతస్తులన్నింటిలో అగ్నిమాపక వ్యవస్థలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని మాత్రం నిర్ణయం తీసుకున్నారు.
బహుళ అంతస్తులకు తప్పనిసరిగా అగ్నిమాపక వ్యవస్థను అమర్చేలా చేయాలి.. అలాగని ఇప్పటివరకు ఆ వ్యవస్థలు అమర్చుకోని భవనాల యజమానులను ఇబ్బందులకు గురిచేయొద్దు.. సెట్‌బ్యాక్ విషయంలో పట్టింపులకు వెళ్లొద్దు.. ఇదీ ప్రస్తుతం అగ్నిమాపకశాఖ వ్యవహరించబోతున్న తీరు. ఇలా చేయాలంటే భారీ భవంతులన్నింటినీ తనిఖీ చేసేంత సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో సెల్ఫ్ అసెస్‌మెంట్(స్వీయ మదింపు) ప్రక్రియను తెరపైకి తీసుకురావాలనే యోచనతో ఉన్నారు.
ప్రస్తుతం ఆస్తిపన్ను విషయంలో పురపాలక శాఖ ఇదే ప్రక్రియను అమలు చేస్తోంది. యజమానులే తమ భవన విస్తీర్ణాన్ని నిపుణులతో మదింపు చేయించి మున్సిపాలిటీకి సమర్పించి.. అందుకు తగ్గట్టుగా పన్ను కట్టే ఆనవాయితీ కొనసాగుతోంది. భారీ భవనాలకు అగ్నిమాపకశాఖ అనుమతుల విషయంలోనూ యజమానులు ఇదేరీతిన స్వయం మదింపు చేసుకొని సమర్పించేలా ప్రోత్సహించాలని ఆశాఖ యోచిస్తోంది. ఒకవేళ తప్పుడు ధ్రువీకరణ ఇస్తే కఠిన చర్యలు ఉంటాయనే సందేశం పంపించాలనే భావనతో ఉంది. ఇందుకు గల సాధ్యాసాధ్యాలపై ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు.
ఇవీ చదవండి: